Emergency Fund: అత్య‌వ‌స‌ర నిధిని ఎప్పుడు ఉప‌యోగించాలి? 

కుటుంబంలో ఒకరే ఆర్జిస్తుంటే.. కనీసం 12 నెలల ఖర్చులకు సరిపడా నిధి అందుబాటులో ఉండాలి

Updated : 30 Nov 2021 13:03 IST

జీవితంలో ఒడిదుడుకులు ఉండ‌డం స‌హ‌జ‌మే. అయితే ఆ ప‌రిస్థితుల‌ను ముందుగానే ఊహించి స‌రైన ఏర్పాటు చేసుకున్న వారే విజ‌యం సాధించ‌గ‌ల‌రు. ఆర్థిక విష‌యంలోనూ అంతే.. ఆర్థిక అస‌మానత‌లు వ‌స్తుంటాయి.. పోతుంటాయి. అటువంటి ప‌రిస్థితుల‌లో ఆర్థికంగా జాగ్ర‌త్త ప‌డ‌టం కోసం ఏర్పాటు చేసుకునేదే అత్య‌వ‌స‌ర నిధి. అయితే, ఎంత మొత్తం నిధిని ఏర్పాటు చేసుకోవాలి, ఎప్పుడు ఉప‌యోగించాలి అనేది తెలుసుకోవ‌డ‌మూ ముఖ్య‌మే. 

ఎంత మొత్తం ఏర్పాటు చేసుకోవాలి?
సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడే మొత్తం అత్యవసర నిధి కోసం అందుబాటులో ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇది కనీస మొత్తం మాత్రమే. గరిష్ఠంగా మీ వీలును బట్టి ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబంలో ఒకరే ఆర్జిస్తుంటే.. కనీసం 12 నెలల ఖర్చులకు సరిపడా నిధి అందుబాటులో ఉండాలి. భార్యాభర్త‌లు ఇరువురు ఉద్యోగాలు చేస్తుంటే.. కాస్త తక్కువగా ఉన్నా ఇబ్బంది ఉండకపోవచ్చు. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న‌ప్పుడు.. సంబంధిత‌ వైద్య ఖ‌ర్చుల‌ను, పిల్లలు ఉంటే వారి అస‌రాల‌ను దృష్టిలో పెట్టుకోవాలి. మీ ఆదాయంలో స్థిర‌త్వం ఉంటుందా లేదా.. ఉద్యోగానికి ఏ మేర‌కు భద్రత ఉంది, వంటి అంశాల‌ను ప‌ర‌గ‌ణ‌లోకి తీసుకోవాలి. ఒక‌వేళ‌, ఉద్యోగం, ఆదాయంలో స్థిరత్వం లేకపోతే మ‌రింత నిధి అవ‌స‌రం కావ‌చ్చు. 

అత్య‌వ‌స‌ర నిధిని ఎప్పుడు ఉప‌యోగించాలి?
ఉద్యోగం కోల్పోయిన‌ప్పుడు..
ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు తలెత్త‌డానికి ముఖ్య కార‌ణం ఉద్యోగం కోల్పోవ‌డం లేదా ఆదాయం త‌గ్గ‌డం. కోవిడ్ స‌మ‌యంలో చాలా ప‌రిశ్ర‌మ‌లపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది. దీంతో ఆయా కంపెనీలు కొంత మంది ఉద్యోగులను తొల‌గించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అలాగే మ‌రికొంత మందికి ప‌నిగంట‌లు త‌గ్గించి జీతాల్లో కోత‌లు విధించాయి. ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్న‌ప్పుడు జీవ‌న వ్య‌యాల‌(ఇంటి అద్దె, ఆహారం, వంటివి) కోసం అత్య‌వ‌స‌ర నిధిని ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే వీలైనంత వ‌ర‌కు ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని డ‌బ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. 

వైద్య ఖ‌ర్చులు..
ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడికి ప్ర‌ధాన కార‌ణం వైద్య బిల్లులు. త‌గినంత ఆరోగ్య బీమా ఉన్న‌ప్ప‌టికీ, స‌హ చెల్లింపులు, బీమా నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను అనుస‌రించి క‌వ‌ర్ కాని ఖ‌ర్చులు ఉండే అవ‌కాశం ఉంది. అలాంటి స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర నిధిని వినియోగించుకోవ‌చ్చు. 

అక‌స్మిక ఖ‌ర్చులు..
వృత్తి, వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఎక్క‌వ‌గా సొంత వాహ‌నంలో ప్ర‌యాణించే వారి వాహ‌నాలకు చిన్న చిన్న మ‌ర‌మ్మ‌త్తులు వ‌స్తుంటాయి. ఒక‌వేళ ఇలాంటి ఆక‌స్మిక మ‌ర‌మ్మ‌త్తుల‌కు, అలాగే ఇత‌ర ఆక‌స్మిక ఖ‌ర్చుల‌కు డ‌బ్బు అవ‌స‌ర‌మైతే మీ పొదుపు నుంచి ఉప‌యోగించాలి. ఒక వేళ దీని కోసం మీ పెట్టుబ‌డులను క‌ద‌ప‌వ‌ల‌సి వ‌చ్చినా, లేదా క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చినా.. అధిక వ‌డ్డీ రేట్లు చెల్లించే కంటే అత్య‌వ‌స‌ర నిధిని ఉప‌యోగించ‌డం మంచి ఎంపిక‌. 

పొదుపును వృధా చేయ‌ద్దు..
అత్య‌వ‌స‌రం ప‌దానికి అర్థం తెలుసుకోవాలి. అవ‌స‌రం కోసం ఖ‌ర్చు చేస్తున్నారా..కోరిక కోసం ఖ‌ర్చు చేస్తేన్నారా.. స‌మీక్షించండి. అన‌వ‌స‌ర‌మైన‌ ఖ‌ర్చుల కోసం పొదుపును వృధా కానివ‌ద్దు. ఏదైనా ఖ‌ర్చు కోసం అత్య‌వ‌స‌ర‌నిధిని ఉప‌యోగించే ముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాలి. 

ముఖ్య‌మైన ఖ‌ర్చుల‌ను గుర్తించ‌డం ఎలా?
గ‌త రెండు నెల‌ల్లో మీరు చేసిన మొత్తం ఖ‌ర్చుల జాబితాను తయారు చేయండి. అందులో అతి ముఖ్య‌మైన ఖ‌ర్చుల‌ను గుర్తించండి. వాటికి కావల‌సిన మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధి నుంచి తీసుకోండి. దీంతో మీ ఖ‌ర్చు త‌గ్గుతుంది. అత్య‌వ‌స‌ర నిధిని ముఖ్య‌మైన ఖ‌ర్చుల‌కు మాత్ర‌మే ఉప‌యోగిస్తారు.

తిరిగి స‌మ‌కూర్చండి..
అత్య‌వ‌స‌ర నిధిని తిరిగి ఏర్పాటు చేయ‌డం చాలా ముఖ్యం. ఉప‌యోగించిన డ‌బ్బు మొత్తాన్ని ఒకేసారి భర్తీ చేయ‌లేరు. కాబ‌ట్టి ఆదాయం ప్రారంభ‌మైన వెంట‌నే చిన్న‌గా పొదుపును ప్రారంభించండి. ప్ర‌తీ నెల ఎంత మొత్తం కేటాయించ‌గ‌ల‌రో లెక్కించండి. మీ ఆర్థిక స్థితి మెరుగుప‌డిన త‌ర్వాత ఈ మొత్తాన్ని పెంచే దిశ‌గా అడుగులు వేయాలి. అత్య‌వ‌స‌ర నిధిని మునుప‌టి స్థాయికి లేదా అంత‌కంటే ఎక్కువ స్థితికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించండి. 

చివ‌రిగా..
బోన‌స్, ప‌న్ను రీఫండ్లు వంటివి పొందిన‌ప్పుడు..ఆ మొత్తంలో కొంత భాగాన్ని అత్య‌వ‌స‌ర‌నిధికి మ‌ళ్లించ‌డం ద్వారా వేగంగా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. క‌రోనా కొత్త వేరియంట్ల గురించి కొంత ఆందోళ‌న ఉన్న‌ప్ప‌టికీ..ప్ర‌జ‌ల జీవనం క్ర‌మంగా సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. తిరిగి పెట్టుబ‌డులు చేసే కంటే ముందే అత్య‌వ‌స‌ర నిధిని పునర్నిర్మించడం, నిర్వ‌హించ‌డం చాలా ముఖ్యం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని