Life Insurance: జీవిత బీమా కొనుగోలు చేస్తున్నారా? ఈ రెండు అంశాల‌లో జాగ్ర‌త్త వ‌హించండి. 

బీమా, పెట్టుబ‌డులు క‌ల‌ప‌డం వ‌ల్ల  అటు పూర్తి బీమా ప్ర‌యోజ‌నం ల‌భించ‌దు, ఇటు ఆశించ‌న రాబ‌డి రాదు.

Updated : 19 Oct 2021 15:55 IST

జీవిత బీమాకు ఉన్న ప్రాధాన్య‌త వ‌ల్ల చాలామంది పాల‌సీ కొనుగోలు చేస్తున్నారు. పాల‌సీ తీసుకుంటేనే స‌రిపోదు. కొనుగోలులో త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి. ఏయే అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుందో తెలుసుకోవాలి. పాల‌సీదారుడు జీవించి ఉన్నంత వ‌ర‌కు.. ఎలాంటి ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ పాల‌సీదారుడు అనుకోకుండా మ‌ర‌ణిస్తే చిన్న చిన్న అంశాలు కూడా కీల‌కంగా మార‌తాయి.

జీవిత బీమాను కొనుగోలు చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించాల్సిన రెండు అంశాలు..
1. పెట్టుబ‌డుల క‌ల‌యిక‌తో బీమా చేయ‌డం..
సంప‌ద సృష్టికి పెట్టుబ‌డులు చేస్తుంటాం. అలాగే ఆర్థిక న‌ష్టాన్ని భ‌ర్తీ చేసేందుకు బీమా కొనుగోలు చేస్తాం. అయితే రెండు క‌లిపి వ‌చ్చే ఉత్ప‌త్తులు ప్ర‌స్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటినే ఎండోమెంట్ పాల‌సీలు అంటారు. బీమా సంస్థ‌ల‌కు చెల్లించిన ప్రీమియంపై కొంత రాబ‌డిని పొందాల‌నే ప్ర‌య‌త్నంలో ట‌ర్మ్ పాల‌సీకి బ‌దులు సంప్ర‌దాయ పాల‌సీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వాస్త‌వానికి బీమా, పెట్టుబ‌డులు క‌ల‌ప‌డం వ‌ల్ల  అటు పూర్తి బీమా ప్ర‌యోజ‌నం ల‌భించ‌దు. ఇటు ఆశించ‌న రాబ‌డి రాదు. దీంతో రెండింటి ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతున్నారు.

సాధారణ ట‌ర్మ్ పాల‌సీకి చెల్లించే ప్రీమియం కంటే మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నంతో కూడిన బీమా పాల‌సీకి చెల్లించే ప్రీమియం ఎక్కువ ఉంటుంది.  అదే సమయంలో 3 నుంచి 4 శాతం రాబ‌డి మాత్ర‌మే ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి, రూ. 20 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితిలో రూ. 25 ల‌క్ష‌ల‌కు హామీ మొత్తంతో మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నంతో కూడిన‌ పాల‌సీని కొనుగోలు చేస్తే దానికి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం దాదాపు రూ.25వేలు ఉంటుంది. రాబ‌డి దాదాపు రూ. 7 ల‌క్ష‌లు ఉంటుంది. ఇలాంటి ఎండోమెంట్ పాల‌సీకి బ‌దులు ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే రూ. 25 ల‌క్ష‌ల హామీ మొత్తానికి వార్షిక ప్రీమియం దాదాపు రూ. 5వేలు ఉంటుంది.  మిగిలిన ప్రీమియం మొత్తాన్ని పెట్టుబ‌డి పెడితే 20 ఏళ్ల‌లో 8 శాతం రాబ‌డి అంచ‌నాతో రూ. 10 ల‌క్ష‌లు స‌మ‌కూర్చుకోవ‌చ్చు.

2. అవ‌స‌రానికి మించి లేదా త‌క్కువ హామీ మొత్తం..
పాల‌సీ కొనుగోలు చేసేప్పుడు ఇత‌రులు ఎలాంటి పాల‌సీ తీసుకుంటున్నారు.. ప‌న్ను ప్ర‌యోజ‌నం ఎంత వ‌స్తుంది, ప్రీమియం ఎంత చెల్లించాలి అనే అంశాల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జీవిత‌ బీమాను కొనుగోలు చేస్తుంటారు. 

ఇలాంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పాల‌సీని తీసుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి కాదు. వ్య‌క్తి నుంచి వ్య‌క్తికి అవ‌స‌రాలు మారుతుంటాయి. మీ కుటుంబానికి సంబంధించి భ‌విష్య‌త్తు ఖ‌ర్చులు, భాద్య‌త‌లు, ల‌క్ష్యాలు, తీర్చాల్సిన రుణాలు, జీవిత భాగ‌స్వామికి పెన్ష‌న్ వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని హామీ మొత్తం ఎంతుండాలో లెక్కించాలి. పాల‌సీదారుడు లేన‌ప్పుడు కూడా అత‌ని/  ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేలా పాల‌సీ ఉండాలి. పాల‌సీని మ‌రీ ఎక్కువ కాలం కూడా కొన‌సాగించాల్సిన అవ‌స‌రం లేదు. పాల‌సీదారుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌య‌సు వ‌ర‌కు పాల‌సీ కొన‌సాగిస్తే స‌రిపోతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని