ఈపీఎఫ్ఓ చందాదారులు పెన్ష‌న్ పొందేందుకు ఈ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ప్రకారం పెన్షన్ పొందటానికి, మీరు స్కీమ్ స‌ర్టిఫికెట్ పొందాలి.........

Updated : 01 Jan 2021 17:15 IST

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ప్రకారం పెన్షన్ పొందటానికి, మీరు స్కీమ్ స‌ర్టిఫికెట్ పొందాలి

ఉద్యోగుల వేత‌నం నుంచి ఈపీఎఫ్‌లో సంస్థ‌లు జ‌మ‌చేసిన‌ప్పుడు ఎక్కువ భాగం ఈపీఎస్ (ఉద్యోగుల పింఛ‌ను ప‌థ‌కం) చెందుతుంది . ఇప్పుడు ఈపీఎస్ అంటే ఏంటి ఎలా ప‌నిచేస్తుంది. పెన్ష‌న్ క్లెయిమ్ చేసుకునేందుకు స‌ర్టిఫికెట్ ఎలా పొందాలో తెలుసుకుందాం…

ఈపీఎస్ స్కీమ్ అంటే ఏంటి?
ఈపీఎస్ అనేది ఈపీఎఫ్‌లో ఒక భాగం. ఈపీఎఫ్‌లో జ‌మ చేసిన ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత నెలవారీ పింఛను పొందవచ్చు. ఉద్యోగి మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా నామినీ ఈ పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు.

ఉద్యోగి, సంస్థ స‌మానంగా 12 శాతం వేత‌నం నుంచి ప్ర‌తి నెల‌ ఈపీఎఫ్‌లో జ‌మ‌చేస్తారు. సంస్థ వాటా అయిన 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌కి చెందుతుంది. మిగ‌తా 3.67 శాతం ఈపీఎఫ్‌కి చేరుతుంది.

ఈపీఎస్ ఫీచ‌ర్లు

  • పెన్ష‌న్ నెల‌కు క‌నీసం రూ.1000 ల‌భిస్తుంది.
  • ఉద్యోగి 58 సంవ‌త్స‌రాల త‌ర్వాత లేదా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్‌ను పొంద‌వ‌చ్చు.
  • ఉద్యోగి తన ఈపిఎస్‌ను 60 సంవత్సరాల వయస్సు వరకు వాయిదా వేయవచ్చు. వాయిదావేసిన‌ ప్రతి సంవత్సరానికి ఈపీఎస్ బ్యాలెన్స‌పై 4% ఎక్కువ పొందుతాడు.
  • భార్య లేదా భ‌ర్త చ‌నిపోయిన‌వారికి , పిల్ల‌ల‌కు ( 25 సంవ‌త్స‌రాల లోపు) పెన్ష‌న్ ల‌భిస్తుంది.
  • భార్య లేదా భ‌ర్తను కోల్పోయిన‌వారు తిరిగి పెళ్లి చేసుకుంటే కేవ‌లం పిల్ల‌లు మాత్ర‌మే 25 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు పెన్ష‌న్ ప్ర‌యోజ‌నాలు పొందుతారు.
  • పిల్ల‌ల‌కు వైక‌ల్యం ఉంటే జీవితాంతం పెన్ష‌న్ పొందేందుకు వీలుంటుంది.
  • పెన్ష‌న్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ నుంచి పెన్ష‌న్ స‌ర్టిఫికెట్ పొంద‌డం అవ‌స‌రం

ఈపీఎస్ స‌ర్టిఫికెట్ ఎవ‌రికి ల‌భిస్తుంది?
ఈపీఎఫ్ఓ కింద స‌బ్‌స్క్కైబ్ చేసుకున్న ప్ర‌తీ ఉద్యోగి ఈపీఎస్ స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు. దీంతో పెన్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఉద్యోగి స‌ర్వీస్, వ‌య‌సు ఆధారంగా ఈపీఎస్ బ్యాలెన్స్ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత విత్‌డ్రా చేసుకోవ‌చ్చు లేదా ఈపీఎస్ స‌ర్టిఫికెట్‌లో పెన్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఒక ఉద్యోగి ఆరు నెల‌ల కంటే ఎక్కువ కాలం ప‌నిచేస్తే దానిని ఏడాదిగా ప‌రిగ‌ణిస్తారు.

  • ఒక వ్య‌క్తి 9 సంవ‌త్స‌రాల 6 నెల‌లు ఉద్యోగం చేస్తే దానిని 10 సంవ‌త్స‌రాలుగా లెక్కిస్తారు. అయితే 58 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌ప్పుడు స్కీమ్ స‌ర్టిఫికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు లేదా ఈపీఎస్ నుంచి న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవచ్చు.

  • ఒక వ్య‌క్తి వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు కానీ ఉద్యోగంలో చేరి 7 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే పూర్తి అయితే స్కీమ్ స‌ర్టిఫెకెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం లేదా ఈపీఎస్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

  • ప‌దేళ్ల కంటే ఎక్కువ కాలం స‌ర్వీస్‌లో ఉన్న‌వారు త‌ప్ప‌కుండా ఈపీఎస్ స‌ర్టిఫికెట్ తీసుకోవాలి. వారు ఈపీఎస్ నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండ‌దు.

ఈపీఎస్ స‌ర్టిఫికెట్ అంటే ఏంటి?
ఈపీఎస్ స‌ర్టిఫికెట్‌ను ఈపీఎఫ్ఓ, కార్మిక శాఖ‌, ప్ర‌భుత్వం జారీ చేస్తాయి. ఈపీఎఫ్ స‌భ్యుడిగా ఎన్ని రోజులు ప‌నిచేశారో ఈ స‌ర్టిఫికెట్ తెలుపుతుంది. ఎన్ని సంవ‌త్స‌రాలు ఉద్యోగం చేశారు, కుటుంబ వివ‌రాలు అంటే ఒక‌వేళ ఉద్యోగి మ‌ర‌ణిస్తే పెన్ష‌న్ పొందేందుకు అర్హ‌త ఉన్న‌వారు ఎవ‌రు అనేది తెలుపుతుంది. దీనిని అధికారిక రికార్డుగా ప‌రిగ‌ణిస్తారు.

ఈపీఎస్ స‌ర్టిఫికెట్ కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేస్తుకోవాలి?
ఉద్యోగం మానేస్తున్న‌ప్పుడు ఫారం 10 సీ పూరించాల్సి ఉంటుంది. అందులో ఈపీఎస్ స‌ర్టిఫికెట్ కోసం అప్లికేష‌న్ పెట్టుకుంటారా లేదా న‌గ‌దు విత్‌డ్రా చేసుకుంటారా అనే ఆప్ష‌న్ ఉంటుంది. ఈపీఎస్ స‌ర్టిఫికెట్ ఆప్ష‌న్ ఎంచుకున్న‌ప్పుడు మీ సంస్థ ఈపీఎఫ్ఓకి దీనిని చేర‌వేస్తుంది. అప్పుడు ఈపీఎఫ్ఓ ఈపీఎస్ స‌ర్టిఫికెట్ జారీచేస్తుంది. అన్ని స‌రైన వివ‌రాలు అందిస్తే ఒక నెల‌లోపు ఈపీఎఫ్ స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని