ప్రమరికా లైఫ్‌ ఎవరికి దక్కుతుందో?

ఐఆర్‌డీఏఐ వివరణ కీలకం
చిక్కుముడిలా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌
దివాలా పరిష్కార ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియ చిక్కుముడిగా మారింది. దీనికి ‘సబ్సిడరీ’గా ప్రమరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనే జీవిత బీమా కంపెనీ ఉండటం ఇందుకు నేపథ్యం. ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌) చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను సొంతం చేసుకోడానికి పలు సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వంటి దేశీయ సంస్థలతో పాటు, అమెరికాకు చెందిన ఏఐఎఫ్‌ (ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) అయిన ఓక్‌ట్రీ ఉన్నాయి. మనదేశంలోని జీవిత బీమా కంపెనీల్లో విదేశీ సంస్థల పెట్టుబడి 49 శాతానికి మించడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రమరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో విదేశీ సంస్థ అయిన ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌కు 49 శాతం వాటా ఉంది. దివాలా పరిష్కార ప్రక్రియలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను విదేశీ సంస్థలు సొంతం చేసుకోడానికి ఇదొక అవరోధం అవుతుందనే వాదన వినవస్తోంది. ఏదైనా విదేశీ సంస్థ చేతికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వెళ్తే, దానికి పరోక్షంగా ప్రమరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లో 51 శాతం వాటా దక్కినట్లు అవుతుంది. అదే జరిగితే విదేశీ పెట్టుబడి నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాథికార సంస్థ) వివరణ కీలకంగా మారనుంది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా పరిష్కార ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. ఆసక్తి గల సంస్థలు దీని కోసం బిడ్లు దాఖలు చేశాయి. బ్యాంకర్ల కమిటీ వీటిని పరిశీలించి, తమకు నచ్చిన బిడ్‌ ఎంచుకుని ఎన్‌సీఎల్‌టీకి నివేదించాలి. ఈ ప్రక్రియలో విదేశీ సంస్థ ఎంపిక అయితే ఎన్‌సీఎల్‌టీ ముందు బీమా రంగంలో ఉన్న విదేశీ పెట్టుబడుల నిబంధనల విషయం ప్రస్తావనకు వస్తుంది. ఆ సమయంలో ఐఆర్‌డీఏఐ వివరణ కోరడమే కాకుండా, దాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది.
కొవిడ్‌-19 నేపథ్యంలో దేశంలోని బీమా కంపెనీల ఆర్థిక స్థితిగతులు, వాటికి ఉన్న క్లెయిముల పరిష్కార సత్తాపై ఇటీవల కాలంలో ఐఆర్‌డీఏఐ దృష్టి సారించినట్లు సమాచారం. అందువల్ల ప్రమరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో పరిశీలించాకే ఐఆర్‌డీఏఐ ఒక నిర్ణయానికి వస్తుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని