ఈటీఎఫ్ ల్లో పెట్టుబ‌డి చేయోచ్చా?

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు(ఈటీఎఫ్‌) లు త‌క్కువ వ్య‌య‌నిష్ప‌త్తితో ల‌భించే పెట్టుబ‌డి సాధ‌నాలు.....

Published : 19 Dec 2020 17:03 IST

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు(ఈటీఎఫ్‌) లు త‌క్కువ వ్య‌య‌నిష్ప‌త్తితో ల‌భించే పెట్టుబ‌డి సాధ‌నాలు​​​​​​​.

మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను ఏదైనా సూచీని అనుక‌రిస్తూ పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌ను ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌)లు అంటారు. నిఫ్టీ-50, సెన్సెక్స్-30 లాంటి మార్కెట్ సూచీల‌తో పాటు బ్యాంకింగ్ నిఫ్టీ, ఆటో నిఫ్టీ , బీఎస్ఈ మిడ్‌క్యాప్ లాంటి ప్ర‌త్యేక రంగానికి చెందిన‌ సూచీల‌లో కూడా మ‌దుపు చేస్తుంటాయి. సాధార‌ణంగా స‌ద‌రు సూచీ ఏయే రంగాల‌కు చెందినవైతే వాటి పేరును ఈటీఎఫ్ పేరులో క‌లిపి పెడుతుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు నిఫ్టీ బ్యాంకింగ్ ఈటీఎఫ్, బ్యాంకింగ్ సూచీ ని అనుక‌రిస్తూ పెట్టుబ‌డి చేస్తుంది ఇది. వ్య‌వ‌హారికంగా దీన్ని బ్యాంకింగ్ ఈటీఎఫ్ అంటారు. మ్యూచువ‌ల్ ఫండ్లతో పోలిస్తే ఇవి త‌క్కువ నిర్వ‌హాణ రుసుమును వ‌సూలు చేస్తాయి. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ‌వుతుంటాయి. కాబ‌ట్టి వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు అంటారు. ఈటీఎఫ్‌ల్లో ఉండే ప్ర‌ధాన ప్రయోజ‌నం ఇవి మార్కెట్‌లో ట్రేడ‌వుతుండ‌ట‌మే.పెట్టుబడిదారులు మార్కెట్ ప‌నివేళ‌ల్లో ఈటీఎఫ్‌ లావాదేవీలు చేయవచ్చు. డీమ్యాట్ ఖాతా ద్వారా ఈటీఎఫ్‌ల‌ను కొనడం అమ్మడం చేయ‌వచ్చు.ఈటీఎఫ్‌ల విషయంలో, బెంచ్మార్క్ ఇండెక్స్ కంటే ఈటీఎఫ్ ఎక్కువ రాబ‌డిని అందించ‌దు. ఫండ్ మేనేజరు సూచీలో ఉన్న విధంగా పెట్టుబ‌డులు చేయాలి త‌ప్ప స్వ‌త‌హాగా షేర్ల ఎంపిక‌ల‌ను చేసేందుకు నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వు. మ‌దుప‌ర్లు ట్రాకింగ్ ఎర్ర‌ర్ స్వ‌ల్పంగా ఉండే వాటిని ఎంచుకోవాలి.ఈటీఎఫ్ అనుక‌రిస్తున్న‌ సూచీకి, ఈటీఎఫ్ కు మ‌ధ్య రాబ‌డిలో గ‌ల తేడాను ట్రాకింగ్ ఎర్ర‌ర్ అంటారు.

ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఈటీఎఫ్ల‌ను ప్రారంభించింది. ప్ర‌భుత్వరంగ కంపెనీల షేర్ల‌తో ఇండెక్స్ ల‌ను రూపొందించి వాటి ఆధారంగా పెట్టుబ‌డి చేసేందుకు మ‌దుప‌ర్ల‌కు యూనిట్ల‌ను జారీ చేశాయి. భార‌త్ 22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ ఆఫ‌ర్ విడుద‌ల చేసేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. మూడో విడ‌త భార‌త్ 22 ఈటీఎఫ్ కింద రూ.10000 కోట్ల‌ను స‌మీక‌రించాల‌ని అనుకుంటోంది. రాబోయే కొత్త ఫాలో ఆన్ ఆఫ‌ర్ లో బేస్ ఆఫ‌ర్ లో రూ.5,000 కోట్లు మిగిలిన మొత్తం గ్రీన్‌షూ ఆప్ష‌న్ ద్వారా స‌మీక‌రించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టికీ భార‌త్ 22 ఈటీఎఫ్ ద్వారా ప్ర‌భుత్వం రూ.23,000 కోట్ల‌ను స‌మీక‌రించింది.

భార‌త్ 22 ఈటీఎఫ్ లో ఉన్న‌ సెంట్ర‌ల్ ప‌బ్లిక్ సెక్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ (సీపీఎస్ఈ) లు కోల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి. ప్రభుత్వ వ్యూహాత్మక వాటాదారుగా ఉన్న యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎల్ అండ్ టీ ల‌ను ఇందులో చేర్చారు.

ప్రస్తుతం రెండు ప్రభుత్వ ఈటీఎఫ్లు ఉన్నాయి. ఒకటి రిలయన్స్ నిప్పాన్ నిర్వహించే సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ , ఇది నిఫ్టీ ఇండెక్స్ లో 11 సీపీఎస్ఈ స్టాక్స్ ను ట్రాక్ చేస్తుంది. రెండోది, భారత్ 22ఈటీఎఫ్‌. దీన్ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎమ్‌సీ నిర్వహిస్తుంది. ప్రభుత్వం త్వరలో ఒక డెట్ ఈటీఎఫ్‌ను ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రుణ పత్రాలలో పెట్టుబ‌డులను చేస్తుంది.

నేరుగా పీఎస్‌యూ స్టాక్ ల‌లో కంటే ప్రభుత్వ రంగ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టడం తక్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈటీఎఫ్‌లో వివిధ కంపెనీలు ఉండ‌టం వ‌ల్ల వైవిధ్య‌త పెరిగి న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది.ఈటీఎఫ్‌ల‌ను ఎంచుకునే ముందు మ‌దుపప‌ర్లు తమ న‌ష్టభ‌యాన్ని అంచ‌నా వేసుకుని త‌ద‌నుగుణంగా ఎంపిక చేసుకోవాలి. త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే మ‌దుప‌ర్లు సెక్టార్ ఈటీఎఫ్ ల‌ను ఎంచుకోవ‌డం మంచిది కాదు. వాటిలో సెక్టార్ రిస్క్ ఉంటుంది. కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కూ నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ఇండెక్స్ ల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని