Term Insurance: ట‌ర్మ్ బీమాతో కుటుంబానికి భ‌రోసా 

 మీ ఖ‌ర్చులో నెల‌కు కొంత ట‌ర్మ్ బీమా పాల‌సీకి కేటాయిస్తే ఎలాంటి అవాంత‌రాలు ఎదురైనా సుల‌భంగా ఎదుర్కోవ‌చ్చు.   

Updated : 01 Oct 2021 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవ‌రైనా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందీ లేకుండా సంతోషంగా జీవ‌నం గ‌డుపుతున్నారంటే దాని అర్థం వారికి మంచి ఆర్థిక ప్ర‌ణాళిక ఉంద‌ని. స‌రైన స‌మ‌యంలో త‌గిన నిర్ణ‌యాలు తీసుకుంటే వృద్ధాప్యంలో ఆనందంగా జీవించ‌డంతో పాటు వారి పిల్ల‌లను కూడా మంచి స్థాయిలో ఉంచ‌గ‌లుగుతారు. మ‌న‌లో చాలా మంది ఎక్కువ ఆదాయం ఉన్న‌వారి కోసమే ఆర్థిక ప్ర‌ణాళిక అవ‌స‌రం అనుకుంటారు. కానీ అది త‌ప్పు. ఒక భ‌వ‌నానికి పునాది ఎంత అవ‌స‌ర‌మో, ఆర్థిక జీవ‌నానికి ప్ర‌ణాళిక అంత అవ‌స‌రం. అంతా సాఫీగా ఉన్న స‌మ‌యంలో ఇంట్లో ఒక‌రికి అనుకోని ప్ర‌మాదం లేదా ఏమైనా అనుకోని ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబం మొత్తంపై ఆ ప్ర‌భావం ప‌డుతుంది. ముఖ్యంగా ఇంటి య‌జ‌మానికి ఏమైనా జ‌రిగితే ఆ కుటుంబం చిన్నాభిన్నమ‌వుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఒక ట‌ర్మ్ బీమా ప్లాన్ ఉంటే ఆ స‌మ‌యంలో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది.

త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ క‌వ‌రేజ్..
ఒక కుటుంబం వినోదం కోసం హెచ్‌డీ కేబుల్ క‌నెక్ష‌న్ కోసం నెల‌కు రూ.500, నెట్‌ఫ్లిక్స్ వంటి ఫ్లాట్‌ఫామ్‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్స్‌ కోసం రూ.650, థియేట‌ర్లో సినిమా చూసేందుకు రూ.1000 ఖ‌ర్చు చేస్తుందనుకుందాం. ఇలా నెల‌కు దాదాపు రూ.2 వేల నుంచి రూ.3వేల వ‌ర‌కు వినోదానికి ఖ‌ర్చు చేస్తుంటాం. ఇవ‌న్నీ సంతోషాన్నిచ్చేవే. వీటితో పాటు నెల‌కు రూ.500 ఖ‌ర్చుపెట్టి.. ట‌ర్మ్ ప్లాన్ తీసుకుంటే అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని ఎదుర్కోగ‌లుగుతారు. చిన్న వ‌య‌సులోనే ట‌ర్మ్ బీమా తీసుకుంటే ప్రీమియం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. వ‌య‌సు పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది. మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 15 రెట్లు హామీ మొత్తం ఉండాలి. క‌నీసం 60 ఏళ్ల వర‌కు పాల‌సీని కొన‌సాగించాలి.

క్ష‌ణాల్లో పాల‌సీ తీసుకోండి..
ఈ బిజీ జీవితాల్లో సమ‌యం అన్న‌ది అన్నింటికంటే విలువైన‌ది. 21వ శ‌తాబ్దంలో స‌మ‌యం వృథా కాకుండా ఏదైనా క్ష‌ణాల్లో పూర్త‌య్యే ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఇదివ‌ర‌కు ఉన్న‌ట్లుగా గంట‌ల త‌ర‌బ‌డి బ్యాంకులు, బిల్లుల చెల్లింపులు, రైలు టికెట్ల కోసం వ‌రుస‌లో నిల‌బ‌డ‌టం లేదు. అన్ని డిజిట‌ల్ అయిపోయాయి. క్ష‌ణాల్లో ప‌నులు జ‌రిగిపోతున్నాయి. ట‌ర్మ్ ప్లాన్ కూడా అంతే. మీ మొబైల్ ద్వారా క్ష‌ణాల్లో పాల‌సీని కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.

శ్ర‌మ అక్క‌ర్లేదు ..
గ‌తంలో బీమా పాల‌సీ తీసుకునేందుకు చాలా ప‌త్రాలు ఇవ్వాల్సి వ‌చ్చేది. చాలా ప‌త్రాలు నింపాల్సి వ‌చ్చేది. అయితే ఇప్పుడు ఆధార్‌, పాన్‌, ఆదాయం వంటి కొన్ని వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో ఎంట‌ర్ చేయ‌డం ద్వారా ట‌ర్మ్ ప్లాన్ తీసుకోవ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో వైద్య చికిత్స‌ల ధ్రువీకకరణ ప‌త్రాలు అవ‌స‌ర‌మైన‌ప్ప‌డు ప‌రీక్ష‌లు కోసం స‌మ‌యం తీసుకోవ‌చ్చు. అయితే అది కూడా ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా వైద్యుడి అపాయింట్‌మెంట్ తీసుకొని స‌మ‌యానికి వెళ్లొచ్చు.

డిజిట‌ల్ స్టోరేజ్‌..  
ముఖ్య‌మైన ప‌త్రాల‌ను పోగొట్టుకుంటే తిరిగి పొంద‌డం చాలా క‌ష్టం. మ‌రి ఇప్పుడు అన్ని ప‌త్రాలూ డిజిట‌ల్ రూపంలోనూ భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌చ్చు. ట‌ర్మ్ ప్లాన్ తీసుకున్న‌ప్పుడు అనుకోకుండా పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే క్లెయిమ్ చేసుకునేట‌ప్పుడు అవ‌స‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం క‌ష్టమైపోతుంది. అయితే ఆన్‌లైన్ పాల‌సీలతో అన్ని డిజిట‌ల్ రూపంలో ఉండటం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లూ ఉండ‌వు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని