థ‌ర్డ్ పార్టీ వాహ‌నా బీమా ఎందుకు తీసుకోవాలి?

ప్ర‌స్తుతం చ‌ట్టం ప‌రంగా కార్ల‌కు మూడు సంవ‌త్స‌రాలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు ఐదు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి థ‌ర్డ్ పార్టీ బీమా పాల‌సీలు తీసుకోవాలి.

Updated : 23 Jun 2023 14:20 IST

రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మనం వాహ‌నాన్ని బాగానే నడుపుతూ ఉన్నా వివిధ కారణాల రీత్యా అనుకోకుండా ప్రమాదం జరగవచ్చు. రద్దీ రోడ్లు, ట్రాఫిక్‌ నిర్వహణ సరిగా లేకపోవడం, రోడ్లపై గుంతలు ఉండటం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ‌. వాహ‌నం ద్వారా ఏదైనా ప్రమాదం జ‌రిగితే, దానికి అయ్యే ఖ‌ర్చుల‌ను భ‌ర్తీ చేసేందుకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనివల్ల రోడ్డు ప్ర‌మాదానికి గురైన వాహ‌నం లేదా ప్రమాదం కారణంగా గాయపడిన లేదా మరణించిన వారికి బీమా ప్రయోజనం చేకూరుతుంది.

ప్ర‌స్తుతం చ‌ట్టం ప‌రంగా కార్ల‌కు మూడు సంవ‌త్స‌రాలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు ఐదు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి థ‌ర్డ్ పార్టీ బీమా పాల‌సీలు తీసుకోవాలి. ఒకవేళ ప్రమాదం జరిగిన వ్యక్తికి వాహనదారు నష్టాన్ని చెల్లించేందుకు ఈ బీమా పాల‌సీని ఉప‌యోగ‌ప‌డుతుంది కాబ‌ట్టి దీన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. వాహ‌న ప్ర‌మాదం చేసి కొంత మంది న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డానికి అంగీక‌రించ‌క‌పోవ‌డం లేదా చేయ‌లేని స్థితి ఉండొచ్చు. ఆ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గంగా థ‌ర్డ్ పార్టీ బీమా పాల‌సీ ఉంటుంది.

థ‌ర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌కు సంబంధించి నష్టాన్ని లెక్కించేందుకు బీమా సర్వేయ‌ర్ ను ఇన్సూరెన్స్ సంస్థ పంపిస్తుంది. వ్యక్తులు గాయపడినా, మరణించినా అందుకు క్లెయిం చేసే సొమ్ముకు పరిమితులంటూ ఉండ‌వు. అయితే థర్డ్‌ పార్టీ వస్తువులకు చట్టంలో ఉన్నమేరకు మాత్రమే నష్టాన్ని చెల్లిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించ‌డం ముఖ్యం. ప్రమాదానికి గురైనవారు నష్టాన్ని క్లెయిం చేసుకునేందుకుగాను ఎఫ్‌ఐఆర్ ప్ర‌తి, బీమా సర్వేయర్‌ ఇచ్చే నివేదిక, ప్రమాదం జరిగిన తర్వాత చికిత్స‌క‌య్యే ఖర్చులన్నింటిన్నీ బీమా సంస్థ‌కు స‌మ‌ర్పించాలి. అప్పుడే సులువుగా క్లెయిం పొందవచ్చు.

సాధార‌ణంగా వాహనం కొన్న ప్రాంత పరిధిలోనే ఇన్సూరెన్స్‌ తీసుకుంటారు. ఆ నిర్దిష్ట ప్రాంతం పరిధి మేర‌కే థర్డ్‌ పార్టీ బీమా వర్తిస్తుంది. పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న విధంగా కాకుండా మరే విధంగానూ క్లెయించేయడానికి వీలుపడదు. క్లెయిం చేసిన‌ప్పుడు వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని బీమా హామీ సొమ్మును ల‌బ్ధిదారుకు చెల్లిస్తారు. లబ్ధిదారు వయసు, ఆదాయం, అతనిపై ఆధారపడ్డవారు, ఎంతమేరకు గాయపడ్డారు అనే వాటి ఆధారంగా థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ చెల్లింపు ఉంటుంది.

థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను బీమా కంపెనీలు రెండు విధాలుగా అందిస్తున్నాయి. ఒకటి థర్డ్‌పార్టీకి మాత్రమే వర్తించేలా, రెండొది సమగ్ర పాలసీ రూపంలో. రెండో రకం పాలసీలో వాహనం యజమాని బీమాతో పాటు, థర్డ్‌ పార్టీకి సైతం బీమా ఉంటుంది. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని ఐఆర్‌డీఏ నిర్ధారిస్తుంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని