మీ ఆస్తుల కోసం ఎందుకు నామినీని నియమించాలి?

మీరు ఎప్పుడైనా నామినీ పేరును మార్చుకునే అవకాశం ఉంది

Published : 07 Aug 2021 16:45 IST

ఇల్లు, బ్యాంకు ఖాతాల్లో ఉండే డబ్బు, కారు, గృహోపకరణాలు, బంగారం, స్థిరాస్తులు, పెట్టుబడులు, జీవిత బీమా, వ్యక్తిగత ఆస్తులు మొదలైనవి ఆస్తి అంటారు. మీ తదనంతరం మీకు సంబంధించిన ఆస్తి మీకిష్టమైన వారికి చెందాలనే ఉద్దేశంతో ముందుగానే ఆస్తి ప్రణాళికను తయారు చేసుకోవడం ద్వారా మీ కోరికను నెరవేర్చుకోవచ్చు. మన దేశంలో చాలా కుటుంబాలు ఆస్తి ప్రణాళికపై నమ్మకం ఉంచరు. అలాగే కొంత మంది నామినేషన్ పత్రంలో నామినీ పేరు రాస్తే సరిపోతుందని నమ్ముతున్నారు. అయితే, ఇది వాస్తవం కాదు. నామినీ అంటే కేవలం ఒక ధర్మకర్త లాగా పనిచేస్తారు. మీ ఆస్తులు చట్టపరమైన వారసులకు బదిలీ చేయడంలో సహాయపడతారే తప్ప ఆస్తులకు వారు యజమానులు కాదు.  

సాధారణంగా చాలా మంది తమ భార్య / భర్త పేరును ఆస్తి లావాదేవీల్లో నామినీగా పేర్కొంటారు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే తమ పేరు మీద ఉన్న అన్ని ఆస్తులు  ఆమెకు / అతనికి చెందుతాయని భావిస్తారు. దురదృష్టవశాత్తూ ఇది నిజం కాదు. ఒకవేళ ఆస్తులు మీ జీవిత భాగస్వామికి బదిలీ అయినప్పటికీ, హిందూ వారసత్వ చట్టం ప్రకారం - మీ తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు మీకున్న ఆస్తిలో వాటాను క్లెయిమ్ చేసుకోవచ్చు. చట్టం ప్రకారం, నామినీ అనే వారు ఒక ధర్మకర్త మాత్రమే, వారు ఆస్తులకు అసలైన యజమాని కాదు. వీరు కేవలం న్యాయపరమైన వారసులకు ఆస్తిని చట్టబద్ధంగా బదిలీ చేయటానికి సహాయకులుగా ఉంటారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. 

వీలునామా ప్రాముఖ్యత:

చాలా పెట్టుబడుల్లో, పెట్టుబడి దారుడు మరణించినట్లైతే వారి ఆస్తులకు చట్టపరమైన వారసుడిని అర్హుడిగా చేస్తారు. కానీ వీలునామాలో ఎవరి పేరైతే నమోదుచేయబడి ఉంటుందో వారే చట్టపరమైన వారసుడిగా ఉంటారు. ఒకవేళ వీలునామా రాయకపోయినట్లైతే అప్పుడు వారసత్వ చట్టాల ప్రకారం చట్టపరమైన వారసులు నిర్ణయించబడతారు. వారసత్వ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. వీటిలో ముందే ఎవరికీ ఎంత మొత్తం ఇవ్వాలో నిర్ణయించబడి ఉంటుంది. 

నామినీ కూడా చట్టపరమైన వారసుల్లో ఒకరు కావచ్చు. మీరు ఎప్పుడైనా నామినీ పేరును మార్చుకునే అవకాశం ఉంది. అయితే మీరు ముందుగా ఆ విషయాన్ని సంబంధిత సంస్థకు తెలియచేయవలసి ఉంటుంది. ఒకవేళ నామినీ మైనర్ అయితే, నామినితో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని నియమించాలి. వారి పేరు, వయస్సు, చిరునామా, నామినీతో గల సంబంధాన్ని తెలియచేయవలసి ఉంటుంది. పెట్టుబడి దారుడు నామినీగా ఒకరి కంటే ఎక్కువ మందిని ఎంపిక చేసుకోని ఎవరికీ ఎంత వాటా ఇవ్వాలో నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎంత వాటా ఇవ్వాలో నమోదు చేయకపోతే సదరు సంస్థ నామిని జాబితాలో ఉన్న అందరికీ సమానంగా వాటాను చెల్లిస్తుంది. 

నామినేషన్ సాధారణ నియమాలు  :

జీవిత బీమాలో నామినేషన్ :

ప్రతి జీవిత బీమా పాలసీదారుడికి తన మరణం తరువాత బీమా సొమ్మును స్వీకరించడానికి ఒక వ్యక్తిని నియమించుకునే హక్కు కల్పించబడింది. పాలసీదారుడి మరణం తర్వాత నామిని బీమా సొమ్మును పొందడం మిన్నహా ఎలాంటి ప్రయోజనాలను పొందరు. బీమా (సవరణ) చట్టం 2015 ప్రకారం నామిని ఖచ్చితంగా పోలసీదారుడికి దగ్గర బందువై ఉండాలి. ఉదాహరణకు పాలసీదారుడు తన తండ్రిని గానీ, తల్లిని గానీ, భార్యను గానీ, పిల్లలను గానీ నామినిగా పేర్కొనట్లైతే వారు బీమా సొమ్ముకు లాభదాయకమైన యజమానులు అవుతారు.    

ఉద్యోగ భవిష్యనిధిలో నామినేషన్ :

ఉద్యోగ భవిష్య నిధిలో నమోదు చేయాలనుకున్న నామిని కచ్చితంగా ఖాతాదారుడితో వారసత్వం కలిగివుండాలి. చట్టపరమైన వారసులు నామినీగా ఉండడానికి అవకాశం లేదు. ఉద్యోగ భవిష్య నిధి చట్టం ప్రకారం తన కుటుంబ సభ్యుని నామినీగా నియమించవలసి ఉంటుంది.

షేర్లలో నామినేషన్ :

సంస్థల చట్టం, డిపాజిటరిస్ చట్ట నిబంధనల ప్రకారం, మిగతా సంస్థల్లోని నామినీతో పోల్చితే షేర్లలో నామిని పాత్ర భిన్నమైనది. సంస్థల చట్టంలోని సెక్షన్ 109 (ఎ), డిపాజిటరిస్ చట్టంలోని 9.11 నిబంధనల ప్రకారం నామినేషన్ ముఖ్య ఉద్దేశం ఒక వ్యక్తి తన ఆస్తిని (ఆస్తిపై అన్ని హక్కులు కలిగివుండాలి) షేర్లలో పెడితే పైన తెలిపిన నిబంధనల ప్రకారం నామినేషన్ చెల్లుబాటు అవుతుందని స్పష్టంగా తెలియచేయబడింది.
 
దీని అర్ధం మీరు గనక వీలునామా రాయకపోతే, మీ షేర్లకు ఎవరినైతే నామినీగా నియమిస్తారో మీ తదనంతరం వారే మీ షేర్లన్నిటికీ యజమాని అవుతారు. దీనికి వారసత్వ చట్టాలు వర్తించవు. కానీ ఒకవేళ మీరు వీలునామా రాసినట్లైతే, దాని ప్రకారం నిజమైన వారసుడికి మీ షేర్లు దక్కుతాయి.  

మ్యూచువల్ ఫండ్లలో నామినేషన్ :

మ్యూచువల్ ఫండ్లలో నామిని అనేవారు కేవలం ఒక ధర్మకర్త మాత్రమే. మ్యూచువల్ ఫండు దరఖాస్తు పత్రాన్ని నింపుతున్నప్పుడు అందులో మీకు నామిని వివరాలు తెలిపే అవకాశం కల్పించబడి ఉంటుంది. మొదట ఒకరి పేరును నామినీగా పేర్కొన్నప్పటికీ తరువాత మ్యూచువల్ ఫండు వెబ్సైట్ ద్వారా నామిని పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో నామినేషన్ ఫోలియో స్థాయిలో ఉంటాయి. ఫోలియోలో ఉన్న అన్ని యూనిట్లు నామినీ పేరు మీదకు బదిలీ అవుతాయి. ఒకవేళ పెట్టుబడిదారుడు అదే ఫోలియోలో మరిన్ని పెట్టుబడులను పెడితే, సదరు కొత్త యూనిట్లకు కూడా అదే నామినేషన్ వర్తిస్తుంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని