Health Insurance.. క్రిటిక‌ల్ ఇన్సురెన్స్ పాల‌సీని తీసుకోనే ముందు ఇవి తెలుసుకోండి 

జీవితం మొత్తం పున‌రుద్దర‌ణ స‌దుపాయం అందించే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ ఎంచుకోవ‌డం మంచింది.

Updated : 17 Aug 2021 16:35 IST

ప్ర‌స్తుత రోజుల్లో ఆరోగ్య బీమాపాల‌సీతో పాటు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేయడం త‌ప్ప‌నిస‌రి. అసాధార‌ణ చికిత్స వ్య‌యం, ఔష‌ధాల ధ‌ర‌లు పెరగ‌డం, ఆరోగ్య బీమా పాల‌సీలు తీవ్ర అనారోగ్యాల‌ను క‌వ‌ర్ చేయ‌క‌పోవడం వంటివి ఇందుకు కార‌ణం. మీరు కూడా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా? ప్ర‌స్తుతం మార్కెట్లో ల‌భించే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీలో ఏది మంచి పాల‌సీ?  ఏ అంశాల ఆధారంగా పాల‌సీని ఎంపిక చేసుకోవాలి? అనే సందేహాలకు స‌మాధానం తెలుసుకుందాం. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకునే ముందు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ ప్రాముఖ్య‌త‌ను తెలుసుకుందాం. 

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ ఎందుకు కొనుగోలు చేయాలి?
ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా మ‌నమంద‌రం ట‌ర్మ్ బీమా, జీవిత బీమా, సాధార‌ణ ఆరోగ్య బీమాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటాం. కానీ మ‌న‌లో చాలా మంది క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీకి ప్రాధాన్య‌త  ఇవ్వ‌రు.  అయితే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్‌ కూడా, జీవిత‌, ఆరోగ్య‌ బీమా పాల‌సీల‌తో స‌మాన‌మైన ప్రాముఖ్య‌త‌ను క‌లిగి ఉంది. 

ఉదాహ‌ర‌ణ‌కి సుహాన్ కి  తీవ్ర‌మైన‌ గుండె సంబంధిత స‌మ‌స్య ఉన్న‌ట్లుగా డ‌యోగ్నైజ్ చేశారు. గుండె క‌వాటాల మార్పిడి చేయాల‌ని చెప్పారు వైద్యులు.  అత‌నికి రూ.8 ల‌క్ష‌ల హామీ మొత్తంతో ఆరోగ్య‌బీమా పాల‌సీ ఉంది. దీనితో వైద్య ఖ‌ర్చులు, గుండె కవాటు మార్పిడి చికిత్స‌ను చేయించుకోవ‌చ్చు అనుకున్నాడు. అయితే అత‌ను తీసుకున్న‌ ఆరోగ్య బీమా, ఈ వైద్య చికిత్స‌ల‌ను క‌వ‌ర్ చేయ‌దు అని బీమా సంస్థ ఇచ్చిన‌ స‌మాచారానికి అత‌ను ఆశ్చ‌ర్యపోయాడు. సుహాన్‌ ఆరోగ్య బీమా అయితే  తీసుకున్నాడు. కానీ దానిపై క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్‌ను తీసుకోలేదు. అత‌ను తీసుకున్న ఆరోగ్య బీమా పాల‌సీ క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌ను క‌వ‌ర్ చేయ‌దు. సుహాన్‌ మాదిరిగానే చాలా మంది సాధార‌ణ ఆరోగ్య బీమా పాల‌సీకి, క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ మ‌ధ్య తేడా తెలియ‌క ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 

సాధార‌ణ ఆరోగ్య బీమా పాల‌సీ..
 బీమా సంస్థ చెల్లించే మొత్తం డబ్బుతో మీ వైద్యానికి సంబంధించిన ఖర్చులను, అలాగే వైద్యం కోసం ఏదైనా రుణం తీసుకున్నట్లయితే వాటిని చెల్లించవచ్చు. మీ ఆరోగ్య పాలసీ పరిమితులు, షరతులకు సంబంధించి ఆసుపత్రి బిల్లుల ఆధారంగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. న‌గ‌దు ర‌హిత చెల్లింపులు సౌక‌ర్యాలు కూడా సాదార‌ణ ఆరోగ్య బీమా పాల‌సీలో అందుబాటులో ఉన్నాయి.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ..
క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌లో  పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి, ఆ పాల‌సీ జాబితాలో ఉన్న వ్యాధికి గురైన‌ట్లు నిర్ధార‌ణ అయితే పాల‌సీ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. బీమా సంస్థ హామీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తుంది.  వ్యాధి కార‌ణంగా ప‌నిచేయ‌లేని స్థితిలో, మీ ఆర్థిక అవ‌స‌రాల‌కు, శ‌స్త్ర‌చికిత్స‌ల‌కు ఈ మొత్తం ఉప‌యోగ‌పడుతుంది. 

గుండెపోటు, క్యాన్సర్, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం లేదా పక్షవాతం, అవ‌య‌వ మార్పిడి, గుండె క‌వాటాల మార్పిడి,  బ్రెయిన్‌ట్యూమ‌ర్ మొద‌లైన తీవ్ర అనారోగ్యాల‌ను క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్ చేస్తుంది. క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌కు అయ్యే ఖ‌ర్చు చాలా అధికంగా ఉంటుంది. అత్యంత ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, తక్కువ శారీరక శ్రమ, ఎక్క‌వగా జంక్ ఫుడ్ తీసుకునే వారు క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌కు గురైయ్యే అవకాశం పెరుగుతుంది. అందువ‌ల్ల ఈ విధ‌మైన జీవ‌న శైలి ఉన్న‌వారు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని తీసుకోవ‌డం మంచిది. 

ఉత్త‌మ క్రిటిక‌ల్ ఇల్‌నెస్ బీమా పాల‌సీ-ఏవిధంగా ఎంచుకోవాలి?
క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేసే ముందు ఈ కింది అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలి.

స్టాండ్ ఎలోన్, యాడ్ ఆన్ పాల‌సీ..
క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని రెండు ర‌కాలుగా తీసుకోవ‌చ్చు.  ఒక‌టి స్టాండ్ ఎలోన్ పాల‌సీ.   ప్ర‌స్తుతం ఉన్న ఆరోగ్య పాల‌సీతో సంబంధం లేకుండా ఒక ప్ర‌త్యేక‌మైన పాల‌సీని కొనుగోలు చేస్తే దానిని స్టాండ్ ఎలోన్ పాల‌సీ అంటారు. యాడ్ ఆన్ పాల‌సీని కొనుగోలు చేయడం మ‌రొక విధానం. దీనేనే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్ అని కూడా అంటారు.  స్టాండ్ ఎలోన్ పాల‌సీని కొనుగోలు చేస్తే మ‌రింత స‌హాకారంతో పాటు అధిక క‌వ‌రేజ్‌ను పొంద‌వ‌చ్చు. 

హామీ మొత్తం..
పాల‌సీ కొనుగోలు చేసే ముందు ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవ‌ల్సిన మ‌రొక ముఖ్య‌మైన అంశం క‌వ‌రేజ్‌. హామీ మొత్తం క్రిటిక‌ల్ ఇల్‌నెస్ వైద్య చికిత్సలు, మందులు మొద‌లైన వాటికి స‌రిపోయేలా ఉండాలి. హామీ మొత్తం రూ. 10 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ ఉండే విధంగా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేయడం మంచిది. 

తీవ్ర‌మైన అనారోగ్యాలు..
బీమా సంస్థ అందిస్తున్న ప్లాన్‌లో క‌వ‌ర్ అవుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల జాబితాను ప‌రిశీలించాలి. సాధార‌ణంగా వ‌చ్చే గుండెపోటు, ప‌క్ష‌వాతం, స్ట్రోక్‌, క్యాన్స‌ర్‌, అవ‌య‌వ మార్పిడి, మూత్ర‌పిండాల వైఫ‌ల్యం, గుండె క‌వాటాల మార్పిడి, బ్రెయిన్ ట్యూమ‌ర్ మొద‌లైన వ్యాధుల‌ను  క‌వ‌ర్ చేసేలా పాల‌సీ తీసుకోవాలి. 

పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ, వ‌య‌సు..
పున‌రుద్దర‌ణ ప్లాను త‌నిఖీ చేయాలి. కొన్ని బీమా సంస్థ‌లు కొంత వ‌య‌సు (50 సంవ‌త్స‌రాలకు) వ‌ర‌కు మాత్ర‌మే పాల‌సీ పున‌రుద్ద‌ర‌ణ‌ను అనుమ‌తిస్తాయి. అటువంటి ప్లాన్ల‌కు దూరంగా ఉండ‌డం మంచింది. పున‌రుద్దర‌ణ స‌మ‌యం జీవితం మొత్తం ఉండే విధంగా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ ఎంచుకోవాలి. 

పాల‌సీ క‌వ‌ర్ చేసేవి, చేయ‌న‌వి..
పాల‌సీ కొనుగోలు చేసే ముందు పాల‌సీ నియ‌మ నిబంధ‌నల‌ను శ్ర‌ద్ధ‌గా చ‌దివి అందులో ఎలాంటి వ్యాధులు క‌వ‌ర్ అవుతాయి, ఎలాంటి వ్యాధులు క‌వ‌ర్ కావు. పాల‌సీ ప‌రిధిలోకి వ‌చ్చే అంశాలు, రాని అంశాల‌ను తెలుసుకుంటే స‌రైన పాల‌సీ కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది. 

వెయిటింగ్ పిరియ‌డ్‌..
పాల‌సీ తీసుకునే ముందు వెయిటింగ్ పిరియ‌డ్ గురించి ప్ర‌త్యేక శ్ర‌ధ్ద తీసుకోవాలి. కొన్ని బీమా సంస్థ‌లు 2-3 సంవ‌త్స‌రాల వెయిటింగ్ పిరియ‌డ్‌ను అమ‌లు చేస్తాయి. ఈ కాలంలో వ‌చ్చిన అనారోగ్యాల‌కు క్లెయిమ్ చేసే అవ‌కాశం ఉండ‌దు. అందువ‌ల్ల త‌క్కువ వెయిటింగ్ పిరియ‌డ్ ఉన్న పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిది. 

స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్‌..
 వ్యాధి గుర్తించిన తర్వాత పాల‌సీ స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్‌లోపు.. పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి మృతి చెందితే బీమా వర్తించదు.  తీసుకునే పాలసీని బట్టి ఇది మారుతుంది. సాధార‌ణంగా బీమా సంస్థ‌లు 30 రోజుల స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్‌ను అమ‌లు చేస్తాయి. కొన్ని బీమా సంస్థ‌లు 90/180 రోజ‌ల వ‌ర‌కు కూడా అమ‌లు చేస్తాయి. స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్‌ను అధిగ‌మిస్తే బీమా సంస్థ హామీ మొత్తాన్ని చెల్లిస్తుంది. అందువ‌ల్ల త‌క్కువ స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్ ఉన్న పాల‌సీని కొనుగోలు చేయాలి. 

క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో..
ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక బీమా సంస్థ‌కు ఎన్ని క్లెయిమ్‌లో వ‌చ్చాయో, అందులో ఎన్ని ప‌రిష్క‌రించారో తెలిపే దానిని క్లెయిమ్ ప‌రిష్కార నిష్ప‌త్తి (క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో) అంటారు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి ఆధారంగా ఏ కంపెనీ ఎన్ని జీవిత బీమా క్లెయిమ్‌లు ప‌రిష్క‌రించిందో చెప్ప‌వ‌చ్చు. ఐఆర్‌డీఏ వెబ్‌సైట్ నుంచి కంపెనీల క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోకి సంబంధించిన స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు. 

క్లెయిమ్ ప్రోసెస్‌..
క్లెయిమ్ చేసే ప‌ద్ద‌తిని కూడా తెలుసుకోవాలి. ఒక‌వేళ క్లెయిమ్ చేసే ప‌ద్ద‌తి క్లిష్ట‌మైన‌దిగా ఉన్న‌, చాలా ప్ర‌తాలు ఇవ్వాల్సి వచ్చిన‌ప్పుడు ఆ బీమా సంస్థ నుంచి పాల‌సీ కొనుగోలు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో క్లెయిమ్ చేయాల్సి వ‌స్తే ఏలాంటి ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలి త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుని పాల‌సీ కొనుగోలు చేయ‌డం మంచిది.

ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న  కొన్ని క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ వివ‌రాలు

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఆప్టిమా వైటెల్‌..
*
37 క్లిష్ట వ్యాధుల‌ను క‌వ‌ర్ చేస్తుంది. 
* గ‌రిష్టంగా రూ. 50 ల‌క్ష‌ల హామీ మొత్తం ఉంటుంది. 
* క్లిష్ట‌మైన వ్యాధి నిర్ధార‌ణ కోసం ఇ-ఒపీనియ‌న్ అందుబాటులో ఉంది.
* హెల్త్‌లైన్‌, హెల్త్ రిస్క్ ఎసెస్‌మెంట్ వాల్యు యాడెడ్ సేవ‌లు అందిస్తుంది.
* పాల‌సీ తీసుకున్న మొద‌టి సంవ‌త్స‌రంలో 90 రోజుల వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. పున‌రుద్ధ‌ర‌ణ‌కు వెయిటింగ్ పిరియ‌డ్ ఉండ‌దు. 
* 30/90 స‌ర్వైవ‌ర్ పిరియ‌డ్ ఉంటుంది. 

కేర్ అస్యూరెన్స్‌..
*
20 క్లిష్ట వ్యాధుల‌ను క‌వ‌ర్ చేస్తుంది. 
* గ‌రిష్టంగా రూ. 1కోటి క‌వ‌రేజ్ ఉంటుంది. 
* స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్ లేదు
* వ్య‌క్తిగ‌త ప్ర‌మాదాల‌కు ఇన్‌బిల్ట్ క‌వ‌రేజ్ ఉంటుంది.
* ఉచిత హెల్త్ చెక‌ప్స్‌తో పాటు వేరొక వైద్యుని అభిప్రాయం తీసుకొనే వీలుక‌ల్పిస్తుంది. 

స్టార్ క్రిటిక‌ల్ ప్ల‌స్ ఇన్సురెన్స్ పాల‌సీ..
ప్ర‌ధానంగా 9 క్లిష్ట‌మైన అనారోగ్యాల‌ను క‌వ‌ర్ చేస్తుంది. 
* స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్ లేదు
* అల్లోప‌తితో పాటు ఇత‌ర వైద్య విధాల‌ను క‌వ‌ర్ చేస్తుంది.
* క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించిన త‌రువాత కూడా ఆసుప‌త్రి ఖ‌ర్చులను క‌వ‌ర్ చేస్తుంది. 

మ‌నిపాల్ సిగ్మా లైఫ్‌స్టైల్ ప్రొట‌క్ష‌న్.. క్రిటిక‌ల్ కేర్ ఇన్సురెన్స్ ప్లాన్‌..
*
కొత్త ప్లాన్‌లో 30 వ‌ర‌కు వ్యాధులు క‌వర‌వుతాయి.
* గ‌రిష్టంగా రూ.3 కోట్ల క‌వ‌రేజ్ ల‌భిస్తుంది. 
* పాల‌సీ దారుల కోసం ఆన్‌లైన్ వెల్‌నెస్ ప్రొగ్రామ్‌ల‌ను అందిస్తుంది.
* ఉచితంగా నిపుణుడైన రెండ‌వ వైద్యుని అభిప్రాయం తీసుకొనే వీలుక‌ల్పిస్తుంది. 

బ‌జాజ్ అలియాంజ్ క్రిటిక‌ల్ ఇల్‌నెస్ ప్లాన్‌..
*
ప్ర‌ధానంగా 10 అనారోగ్యాలు క‌వ‌ర్ అవుతాయి.
* గరిష్టంగా రూ. 50 ల‌క్ష‌ల క‌వ‌రేజ్ ఉంటుంది.
* 3 నెల‌ల వ‌య‌సున్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి 80 సంవ‌త్స‌రాల వ‌య‌సు వారి వ‌ర‌కు క‌వ‌ర్ చేస్తుంది. 
* ప్ర‌త్యేకంగా అభివృద్ధి చేసిన యాప్ ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేస్తారు

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ..
*
ఇది రెండు వేరియంట్‌ల‌లో ల‌భిస్తుంది. 16 క్లిష్ట‌మైన వ్యాధుల‌ను క‌వ‌ర్ చేస్తుంది. 
* గ‌రిష్టంగా రూ.10 ల‌క్ష‌ల క‌వ‌రేజ్ ఉంటుంది. 

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి..
సాధార‌ణంగా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని క్లెయిమ్ చేసే విధానం చాలా సుల‌భంగా ఉంటుంది. మీ బీమా సంస్థ‌ను సంప్ర‌దించి, మీ క్లెయిమ్‌ను రిజిస్ట‌ర్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసేందుకు ఈ కింది ప‌త్రాలు అవ‌స‌ర‌మ‌వుతాయి.
* పూర్తిగా నింపిన క్లెయిమ్ ఫార‌మ్‌
* గుర్తింపు కార్డు
* నిపుణుడైన వైద్యుడు నిర్ధారించిన క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌, మెడిక‌ల్ స‌ర్టిఫికేట్ ఫార‌మ్‌
* డిశ్ఛార్జ్‌ స‌మ‌రీ లేదా వైద్య ప‌రీక్ష‌ల నివేదిక‌లు(ఉన్న‌ట్ల‌యితే)
ఈ ప‌త్రాల‌ను అందించిన త‌రువాత బీమా సంస్థ వాటిని ప‌రిశీలించి క్లెయిమ్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ ఏమైన ఇబ్బంది ఎదురైతే రిజ‌క్ట్ చేస్తుంది. 

చివ‌రిగా..
ప్ర‌స్తుత రోజుల్లో జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో మ‌నం ఊహించ‌లేము. అత్య‌వ‌స‌ర ప‌రిస్థిత‌లు ఏనిమ‌షంలోనేనా రావ‌చ్చు. అందువ‌ల్ల జీవిత బీమా, ఆరోగ్య బీమాల‌తో పాటు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని తీసుకోవాలి. ఇది మీ కుంటుంబానికి పూర్తి ఆర్థిక భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తుంది.  పాల‌సీల‌ను ఆన్‌లైన్‌లో పోల్చి చూసుకుని మీ భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే పాలసీని కొనుగోలు చేయండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని