మార్కెట్లలో ఒడిదుడుకులున్నా సిప్‌ల‌ను ఎందుకు కొన‌సాగించాలంటే..

మార్కెట్లు ఊగిస‌లాట‌కు గురవుతున్న‌ప్ప‌టికీ, సిప్‌ల‌లో పెట్టుబ‌డుల‌ను ఎందుకు కొన‌సాగించాలో తెలుసుకుందాం​​​​​​....​

Published : 21 Dec 2020 13:12 IST

మార్కెట్లు ఊగిస‌లాట‌కు గురవుతున్న‌ప్ప‌టికీ, సిప్‌ల‌లో పెట్టుబ‌డుల‌ను ఎందుకు కొన‌సాగించాలో తెలుసుకుందాం

26 మే 2018 మధ్యాహ్నం 10:32

ఎన్నో విశ్లేష‌ణ‌లు, చ‌ర్చ‌ల త‌ర్వాత మీరు ఈక్విటీ క్ర‌మానుగ‌త పెట్టుబ‌డ‌ల విధానం(సిప్‌) ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో క్ర‌మ క్ర‌మంగా మీ సంప‌ద వృద్ధి చెందుతుంద‌ని మీరు భావిస్తున్నారు. కానీ అదే స‌మ‌యంలో మార్కెట్లు ఊగిస‌లాట‌కు గుర‌వుతున్నాయ‌న్న వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి.

దీర్ఘ‌కాలంలో ఈక్విటీలు, సిప్‌ల‌లో ఎందుకు పెట్టుబ‌డాలో, వాటి ఆవ‌శ్య‌క‌త ఏంటో ఈ కింది నాలుగు కార‌ణాల ద్వారా వివ‌రించాం.

  1. స‌గటు వ్య‌యం త‌గ్గుతుంది

సిప్‌లో మ‌దుప‌రులు మొద‌ట స్థిరంగా క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్టుబ‌డుల‌ను పెడుతుంటారు. ఆ త‌ర్వాత మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతూ, నిక‌ర స‌గ‌టు విలువ‌(ఎన్ఏవీ) త‌క్కువున్న‌ప్పుడు ఎక్కువ సంఖ్య‌లో యూనిట్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. అదే విధంగా మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతూ, ఎన్ఏవీ ఎక్కువున్న‌ప్పుడు త‌క్కువ యూనిట్ల‌ను కొనేందుకు మొగ్గు చూపుతుంటారు. దీనిని రూపాయి-వ్య‌య స‌గటు(రూపీ కాస్ట్ యావ‌రేజింగ్‌) అంటారు. సాధారణంగా మార్కెట్ల ఒడుదొడుకుల గురించి స‌రైన అవ‌గాహ‌న లేనివారు, మార్కెట్లు ప‌డిపోయిన‌ప్పుడు కాకుండా, రాణిస్తున్న‌ప్పుడు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తారు. దీంతో వారి స‌గ‌టు వ్య‌యం పెరుగుతంది.

సిప్‌ల‌లో మ‌దుపు చేయ‌డం, మ‌న పెట్టుబ‌డుల‌ పోర్ట్‌ఫోలియోను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో నిర్వహించేందుకు ఉప‌క‌రిస్తుంది. మార్కెట్లు త‌క్కువ శ్రేణిలో చ‌లిస్తున్న‌ప్పుడు పెట్టుబ‌డులు పెట్టేందుకు మంచి స‌మ‌యం. ఒక మ‌దుప‌రిగా మీరు పెట్టుబ‌డులు పెట్టాల‌నుకున్న‌ప్పుడు మీకు మార్కెట్ స్థితిగ‌తుల‌తో సంబంధం లేదు. మ‌దుప‌రులు ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే, మార్కెట్లు ఒడుదొడుకుల‌కు గురవుతాయి కానీ, మ‌న ఆర్థిక ల‌క్ష్యాలు మాత్రం మారవు. అందుకే స్థిరంగా పెట్టుబ‌డులు పెడుతూ ఉండాలి.

  1. చ‌క్ర‌వ‌డ్డీ కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్టుబ‌డులు చేయాలి

మీ పెట్టుబ‌డుల ద్వారా వ‌చ్చిన లాభాల‌ను తిరిగి పెట్టుబ‌డుల‌లో పెట్టేలా చ‌క్ర‌వ‌డ్డీ ఉప‌క‌రిస్తుంది. మీరు మ‌దుపు చేసిన మొత్తంపై ఆర్జించిన వడ్డీ ఆదాయాన్ని తిరిగి పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మీ సంప‌ద వృద్ధి చెందుతుంది. మార్కెట్ ఒడుదొడుకుల‌తో సంబంధం లేకుండా, రోజు/వారం/నెల‌వారీగా మీరు చేసే పెట్టుబ‌డుల‌కు చ‌క్ర‌వ‌డ్డీ అందుతుంది.

  1. మార్కెట్ స్థితితో సంబంధం లేకుండా మ‌దుపు చేయాలి

ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెడుతున్న‌ప్ప‌డు సాధార‌ణంగా ఉత్ప‌న్న‌మ‌య్యే ప్ర‌శ్న పెట్టుబడులు ఎక్క‌డ పెట్టాల‌నే దానికంటే ఎప్పుడు పెట్టాలి అని. ఎప్పుడు పెట్టాలి అనే ప్ర‌శ్న‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు స‌మాధానంగా నిలిస్తే, ఎక్క‌డ పెట్టాలి అనే ప్ర‌శ్న‌కు మంచి స‌మాధానం సిప్‌లు. మార్కెట్ల స్థితిగ‌తుల‌తో సంబంధం లేకుండా, సిప్‌ల‌లో మ‌దుపు చేయ‌డం మ‌న‌కు ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను నేర్పుతుంది. మార్కెట్లు ఉచ్ఛ స్థితిలో ఉన్న‌ప్పుడు, అధిక స్థాయిలో పెట్టుబ‌డులు పెట్ట‌కుండా ఉంటే, పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవ‌చ్చు. దీంతో మార్కెట్ల స్థితితో సంబంధం లేకుండా ప్ర‌శాంతంగా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

  1. రోజువారీ అవ‌స‌రాల కోసం ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేదు

చిన్న చిన్న మొత్తాల‌(రూ.100 నుంచి) నుంచే సిప్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిప్‌లు మ‌న‌కు ఉప‌క‌రిస్తాయి. దీంతో మదుపరుల‌కు రోజువారీ అవ‌స‌రాలు ఎలా తీర‌తాయ‌న్న బెంగ అక్క‌ర్లేదు. ఇంకా చెప్పాలంటే ఈక్విటీ మార్కెట్ల‌లో మ‌దుపు చేసే ధైర్యం లేని చిన్న మ‌దుప‌రుల‌కు సిప్‌లు మంచి ఆర్థిక సాధ‌నాలుగా చెప్ప‌వ‌చ్చు. అదేవిధంగా రిస్క్‌ను త‌ట్టుకుని, భారీ స్థాయిలో పెట్టుబ‌డి పెట్టే తాహతు గ‌ల వారు సిప్‌ల‌లో పెద్ద మొత్తంలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

పై వివ‌ర‌ణ‌ను బ‌ట్టి అర్థ‌మ‌య్యిందేంటంటే, దీర్ఘ‌కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా ఆర్థిక ల‌క్ష్యాల‌ను ఛేదించ‌వ‌చ్చు. స్వ‌ల్ప‌కాల ల‌క్ష్యాల కంటే దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌కు ప్రాధాన్యం ఇచ్చి పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది. పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు స‌రైన్ ఫండ్‌హౌస్‌ను ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని