ఆ వివరాలు చెప్పలేదు..పాలసీ తిరస్కరిస్తారా?

నేను ఏడాది తర్వాత కారు కొనాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం ఇప్పటి నుంచి నెలకు రూ.30వేల వరకూ జమ చేయాలనుకుంటున్నాను. షేర్లలో నెలనెలా ఈ మొత్తాన్ని పెడితే లాభం ఉంటుందా?.....

Published : 09 Apr 2021 10:30 IST

* నేను ఏడాది తర్వాత కారు కొనాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం ఇప్పటి నుంచి నెలకు రూ.30వేల వరకూ జమ చేయాలనుకుంటున్నాను. షేర్లలో నెలనెలా ఈ మొత్తాన్ని పెడితే లాభం ఉంటుందా? ఏం చేయాలి? - సంతోశ్‌
ఏడాది తర్వాత డబ్బు వెనక్కి తీసుకుంటానంటున్నారు అంటే.. మీకు చాలా తక్కువ సమయం ఉంది. షేర్‌ మార్కెట్లో మదుపు చేసి, లాభాలు గడించాలంటే.. కనీసం 7-10 ఏళ్లు కొనసాగించాలి. పైగా నష్టభయం ఉంటుంది. మీరు ఏడాదిలో కారు కొనాలనుకుంటున్నారు కాబట్టి, మీరు పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేయండి. రాబడి తక్కువగా ఉన్నా.. డబ్బు సురక్షితంగా ఉంటుంది.

* ఇటీవల ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. నాకు మధుమేహం ఉంది. ఆ విషయాన్ని బీమా సంస్థకు తెలియజేయలేదు. నా వయసు 39 ఏళ్లు. దీనివల్ల సమస్య వస్తుందంటున్నారు. నిజమేనా? ఇప్పుడు చెబితే బీమా సంస్థ పాలసీని తిరస్కరిస్తుందా? - గిరిధర్‌
జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు మన పూర్తి వివరాలతోపాటు, ఆర్థిక, ఆరోగ్య వివరాలనూ ఎలాంటి దాపరికం లేకుండా చెప్పాలి. గతంలో ఏదైనా ఆపరేషన్లు జరిగినా.. ప్రమాదాల బారిన పడ్డా.. ఆ విషయాన్ని తెలియజేయాలి. అది చిన్నదైనా కావచ్చు.. పెద్దదైనా కావచ్చు. ఇవన్నీ చెప్పిన తర్వాత పాలసీ తీసుకుంటే.. భవిష్యత్తులో క్లెయిం వచ్చినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా నామినీకి పరిహారం అందుతుంది. మీకు మధుమేహం ఉన్న విషయాన్ని ఇప్పటికైనా బీమా సంస్థకు తెలియజేయండి. బీమా సంస్థ విచక్షణ మేరకు మీకు ఆరోగ్య పరీక్షలు చేయించవచ్చు. లేదా ప్రీమియం కాస్త అధికంగా చెల్లించాల్సిన అవసరం ఉండవచ్చు. పూర్తి వివరాల కోసం బీమా సంస్థ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించండి.

* మా అబ్బాయి వయసు ఐదేళ్లు. తన పేరుమీద ఒకేసారి కొంత మొత్తం మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాను. మంచి రాబడి వచ్చేలా ఎక్కడ మదుపు చేయాలి? - సాయిరాం
మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తం మీ బాబు ఉన్నత చదువులకు ఉపయోగపడేలా చూసుకోవాలి. విద్యా ద్రవ్యోల్బణం అధికంగా ఉంటోంది. కాబట్టి, మీరు పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే రాబడి దీన్ని మంచి ఉండేలా జాగ్రత్తపడాలి. దీర్ఘకాలం ఎదురు చూస్తానంటున్నారు కాబట్టి, మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించండి. వీటిద్వారా 12-13శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. ముందుగా మీ బాబు భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలకు భరోసా కల్పించేందుకు మీ పేరుమీద టర్మ్‌ పాలసీ తీసుకోండి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ బీమా ఉండేలా చూసుకోండి.

* నేను గృహిణిని. నా దగ్గర ఉన్న రూ.లక్షను మంచి వడ్డీ వచ్చే పథకాల్లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఇటీవల ఒక పథకం 10శాతం వరకూ రాబడి ఇస్తుందనే ప్రకటన చూశాను. వీటిని ఎంత వరకూ నమ్మొచ్చు? బ్యాంకు రాబడికన్నా ఎక్కువగా వచ్చే పథకాలేమైనా ఉన్నాయా? - నీలిమ
ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైన వ్యవధిని బట్టి 5-6శాతం వరకూ వడ్డీ వస్తోంది. మీరు చెబుతున్న పథకంలో 10 శాతం వరకూ రాబడి వస్తుందని అంటున్నారంటే... అందులో తప్పకుండా నష్టభయం ఉంటుంది. బ్యాంకు వడ్డీకంటే 1 శాతం కంటే ఎక్కువ వడ్డీ వస్తుందంటే.. దాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించాల్సిందే. మీరు ఆ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. నియంత్రణ సంస్థల అనుమతి ఉందా చూడండి. ఆ తర్వాతే సొంతంగా నిర్ణయం తీసుకోండి.

* మా వివాహమై ఆరు నెలలు అవుతోంది. ఇద్దరమూ ఉద్యోగులమే. మా ఇద్దరి పేరుమీద కలిసి, ఉమ్మడిగా ఏదైనా బీమా పాలసీ లేదా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉందా? నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయగలం. కనీసం 5 ఏళ్లపాటు కొనసాగించేందుకు వీలుగా పథకాలను సూచించండి? - సుందర్‌
మీరు ఉమ్మడిగా జీవిత బీమా పాలసీ తీసుకోవడంకంటే.. వేర్వేరుగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. మీరు పెట్టాలనుకున్న పెట్టుబడిలో రూ.20వేలలో రూ.10వేలను ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. మిగతా రూ.10వేలను బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌లో జమ చేయండి.

- తుమ్మల బాల్‌రాజ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని