Wipro Q3 Results: విప్రో లాభం రూ.2,969 కోట్లు.. అంచనాలను అందుకున్న ఫలితాలు

ఐటీ సేవల దిగ్గజం విప్రో (Wipro) మూడో త్రైమాసిక ఫలితాలు (Q3 Results) అంచనాలను అందుకోవడం విశేషం....

Published : 12 Jan 2022 18:57 IST

లాభాల్లో స్థిరత్వం

దిల్లీ : ఐటీ సేవల దిగ్గజం విప్రో (Wipro) మూడో త్రైమాసిక ఫలితాలు (Q3 Results) అంచనాలను అందుకోవడం విశేషం. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు ఫ్లాట్‌గా నమోదయ్యాయి. క్రితం ఏడాదితో ఇదే త్రైమాసికంలో సంస్థ లాభాలు రూ.2,968 కోట్లుగా నమోదు కాగా.. ఈసారి అవి రూ.2,969 కోట్లుగా రికార్డయ్యాయి. త్రైమాసిక ప్రాతిపదికన సంస్థ లాభాలు 1.3 శాతం పెరిగాయి. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయంలో 30 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది వచ్చిన రూ.15,670 కోట్ల ఆదాయం ఈసారి రూ.20,313.6 కోట్లకు చేరింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండును ప్రకటించింది.

* కంపెనీ ‘ఎర్నింగ్స్‌ బిఫోర్‌ ఇంట్రెస్ట్‌, ట్యాక్సెస్‌ (EBIT)’ రూ.3,553.5 కోట్లుగా నమోదయ్యాయి.

* మార్చి త్రైమాసికంలో ఐటీ సర్వీసుల నుంచి కంపెనీకి వచ్చే ఆదాయం 2745 - 2692 మిలియన్ డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

* ఈ త్రైమాసికంలో కంపెనీలో 10,306 మంది కొత్త ఉద్యోగులు చేరారు. వార్షిక ప్రాతిపదికన కొత్తగా 41,363 మంది ఉద్యోగులను కంపెనీ నియమించుకుంది. దీంతో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,31,671కు చేరింది.

* మూడో త్రైమాసిక ఫలితాల పట్ల విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్‌ హర్షం వ్యక్తం చేశారు. వేతనాల వంటి నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ.. బలమైన ఫలితాలు నమోదు చేశామని తెలిపారు. ఈరోజు బీఎస్‌ఈలో షేరు విలువ 0.40 శాతం నష్టపోయి రూ.691.35 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని