మహిళలకు ఆర్థిక నిర్వ‌హ‌ణ చాలా ముఖ్యం

స్త్రీలు సహజంగానే డ‌బ్బు విష‌యంలో పొదుపుగా ఉంటారు

Published : 08 Mar 2021 13:23 IST

మహిళలకు జీవితంలో చేరుకోవాల్సిన‌ వేర్వేరు మైలురాళ్ళు ఉంటాయి. ఇప్పుడు చాలావ‌ర‌కు మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. దీంతో వారు కూడా ఆర్థిక నియంత్రణను పాటించ‌డం చాలా ముఖ్యం. మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళల ఆర్థిక పరిస్థితులను చక్కగా నిర్వహించడానికి కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆర్థిక నిపుణులు అందించారు.

మనలో చాలా మందికి డబ్బు నిర్వహణ చాలా కష్టమైన పని. మహిళలకు ఇది మ‌రింత క‌ష్టంగా భావిస్తారు. మహిళలు తమ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించాలని స‌ల‌హాదారుల సూచ‌న‌. అవి స్వేచ్ఛ, కోరిక‌, అవసరం.

మొదట ఆర్థిక స్వేచ్ఛ కోసం డబ్బును కూడ‌బెట్టుకోవ‌డం ప్రారంభించండి,  అంటే దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలైన పదవీ విరమణ వంటి  లక్ష్యాల కోసం దాచుకోండి. మీ ఆదాయంలో కనీసం 20 శాతం దీనికి కేటాయించాలి. ఈ డ‌బ్బును మ‌ళ్లీ తీసుకునే అవ‌స‌రం ఉండ‌కూడ‌దు. తరువాత, మీ కోసం డబ్బును కేటాయించండి. మీకు సంతోషాన్నిచ్చే ఏమైనా ఖర్చు చేయడానికి కనీసం 10 శాతం కేటాయించ‌వ‌చ్చు. చివరిది ముఖ్య‌మైన‌ది అవ‌స‌రాలు. ఇది సాధారణంగా నెలవారీ ఖ‌ర్చుల్లోకి వ‌స్తాయి.  మీ నిత్యావ‌స‌రాల త‌ర్వాత ఇంకా ఏమైనా డ‌బ్బు మిగిలితే తిరిగి ఆర్థిక స్వేచ్ఛ వైపు కేటాయించాలి.

 ఆదాయం పెరిగే కొద్దీ ఈ విభాగంలో కేటాయింపులు కూడా పెర‌గాలి. ఈ విధంగా, మీరు మీ ప్రస్తుత అవసరాలకు రాజీ పడకుండా మీ భవిష్యత్తు కోసం ప్ర‌ణాళిక‌తో ఉండాలి. ఇలా విచక్షణతో ఖ‌ర్చు చేస్తే త‌ర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం రాదు.

వారసత్వ చట్టాలు, కుటుంబ బాధ్యతలు, ప్రసవం స‌మ‌యంలో  లేదా వృద్ధుల సంరక్షణ కొర‌కు విరామం తీసుకోవాల్సి రావ‌డం, పురుషుల కంటే ఎక్కువ కాలం జీవించడం వంటి మహిళలు ప్రత్యేకమైన ఆర్థిక ఇబ్బందుల‌ను మహిళలు ఎదుర్కొంటారు. డబ్బు నిర్వహణను పురుషులకు వదిలివేయడం స‌రైన‌ది కాదు. మహిళలు తమ పెట్టుబడులను నిర్వహించడం నేర్చుకుంటే ఈ క్లిష్ట సంద‌ర్భాల‌ను  సులభంగా అదిగ‌మించ‌వ‌చ్చు. ఇది ప్రారంభించడానికి ఇక్కడ ఐదు దశలు ఉన్నాయి.

1. డ‌బ్బు విష‌యాలు మ‌న‌కెందుకులే అని అనుకోవ‌డం స్ర్తీల‌కు అతిపెద్ద అవ‌రోదం. ఇలాంటి అభిప్రాయాల‌ను మార్చుకొని నేటి నుంచే మీ డ‌బ్బు నిర్వ‌హ‌ణ‌ను ప్రారంభించండి.

2. అవ‌గాహ‌న పెంచుకోండి. దీని కోసం మీరు ఫైనాన్స్‌లో నిపుణులు కానవసరం లేదు. మీకు కావలసిందల్లా మార్కెట్ డైనమిక్స్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి తగినంత సమాచారం, జ్ఞానం పొందడం.

3. నిష్పాక్షికంగా, మానసికంగా డబ్బు మీకు ఎందుకు కావాలో అర్థం చేసుకోండి! అవసరాలు, కోరికల మధ్య తేడాను తెలుసుకోండి. ప్రస్తుత అవసరాల కోసం  జాగ్రత్తగా చూసి ఖ‌ర్చు చేసుకోండి. భవిష్యత్ అవసరాలు, కోరికల కోసం ఆదా చేయండి. త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌స్తే త‌ప్ప రుణం తీసుకోద్దు. ఇంటి కోసం రుణం తీసుకుంటే ఫ‌ర్వాలేదు.
4. మీ భవిష్యత్ అవసరాలు, కోరికల కోసం పెట్టుబడి పెట్టండి! ఒక వ్యూహాన్ని నిర్ణయించి, పెట్టుబడి పెట్టండి. మార్కెట్ కదలికలను, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తుండాలి.
5. మీ ప్రత్యేక అవసరాలను అర్థం చేసుకుని,  విశ్వసనీయ సలహాదారుని సూచ‌న‌లు తీసుకోవ‌డం మంచిది.

మహిళలు పెట్టుబడి నిర్ణయాలతో  ఖర్చు చేయడం, ఆదా చేయడం వంటి వాటిలో పాలుపంచుకోవాలి. ఉమ్మడి లక్ష్యాలను నిర్ధారించడానికి, జీవనశైలి అంచనాలను నిర్ణయించడానికి, కుటుంబ రక్షణను నిర్ధారించడానికి మీ కుటుంబంతో డబ్బు గురించి మాట్లాడ‌టం చాలా ముఖ్యం.  మ‌హిళ‌ల‌కు కూడా ఆర్థిక విష‌యాల‌పై బాధ్య‌త ఉందనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్‌ను త‌గ్గించుకోవాలి. ల‌క్ష్యాలు, ఆర్థిక స‌రిస్థితులు వేర్వేరుగా ఉంటాయి కాబ‌ట్టి ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న పెంచుకొని ఎవ‌రికి త‌గిన‌ట్లుగా వారు పొదుపులు, పెట్టుబ‌డులు నిర్వ‌హించాలి.  

స్త్రీలు సహజంగానే డ‌బ్బు విష‌యంలో పొదుపుగా ఉంటారు. ఇది గృహ బడ్జెట్‌కు, అత్యవసర పరిస్థితులకు  సిద్ధం కావడానికి బాగా పనిచేస్తుంది. కానీ, పెట్టుబడి విషయానికి వస్తే, మహిళలు వివిధ పెట్టుబడి ఉత్పత్తులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల‌ సహాయం కూడా తీసుకోవాలి.

మహిళలు మూడు నుంచి ఆరు నెలల గృహ ఖర్చులకు సమానమైన అత్య‌వ‌స‌ర‌ నిధిని పక్కన పెట్టాలి. మీపై ఆధార‌ప‌డిన‌వారికోసం జీవిత బీమాను కొనుగోలు చేయాలి, టర్మ్ కవర్ ఒక వివేకవంతమైన ఎంపిక. మీ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యను నివారించడానికి తగినంత ఆరోగ్య బీమాను తీసుకోవాలి. ఈ మ‌ద్య‌కాలంలో స్ర్తీల‌కు బీమాపై అవ‌గాహ‌న పెరిగిన‌ట్లు పురుషుల‌తో స‌మానంగా వారు బీమా పొందుతున్న‌ట్లు స‌ర్వేలు చెప్తున్నాయి.

స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక అవసరాలను అర్థం చేసుకోండి, దీనికి సరిపోయే పెట్టుబడులు పెట్టండి. ఈ లక్ష్యాలను చేరుకోవ‌డానికి ఉన్న స‌మ‌యం, పెట్టుబ‌డి వంటివి తెలుసుకొని దానికి త‌గిన‌ట్లుగా అనుస‌రించాలి.

చివ‌ర‌గా మీరు కష్టపడి సంపాదించిన సంపదను మీ పిల్లలు లేదా వాళ్ల పిల్ల‌లు సజావుగా పొందగలిగేలా వీలునామా రాయాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని