Sundar Pichai: త్వరలో గూగుల్‌-జియో ఫోన్‌ !

చౌకధరలో స్మార్ట్‌ఫోన్ తయారీ కోసం జియో ప్లాట్‌ఫాంతో కలిసి చేపట్టిన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ఆసియా

Updated : 27 May 2021 17:18 IST

ముంబయి: చౌకధరలో స్మార్ట్‌ఫోన్ తయారీ కోసం జియో ప్లాట్‌ఫాంతో కలిసి చేపట్టిన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతానికి చెందిన కొంతమంది విలేకరులతో ఆయన నేడు వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘అందుబాటు ధరలో ఫోన్‌ తయారీపై దృష్టిపెట్టాం. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం మా భాగస్వామి జియోతో కలిసి పనిచేస్తున్నాం’’ అని పిచాయ్‌ వివరించారు. 

అయితే స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారు.. ధర.. డేటా రేట్లు వంటి ఇతర వివరాలను మాత్రం పిచాయ్‌ వెల్లడించలేదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫాంలో గూగుల్‌ భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.  రూ. 33,737 కోట్లు చెల్లించి జియోలో 7.7శాతం వాటాను గూగుల్‌ సొంతం చేసుకుంది. ఆ సమయంలోనే జియోతో కలిసి చౌక ధరలో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నట్లు రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. 

‘గూగుల్ ఫర్‌ ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌’ పేరుతో వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్‌లో 10 బిలియన్‌ డాలర్ల(రూ. 75వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు పిచాయ్‌ గతేడాది జులైలో ప్రకటించారు. ఇందులో భాగంగానే జియోలో వాటాను గూగుల్‌ కొనుగోలు చేసింది. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు పిచాయ్‌ వెల్లడించారు. వాటికి సంబంధించి వివరాలను ఈ ఏడాది చివర్లో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది తొలి బీటా వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రైవసీ సెట్టింగ్స్‌లోనూ కొత్త మార్పులు తీసుకొస్తున్నామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని