జీవితాలు, జోవనోపాధిని కాపాడతాం: సీతారామన్‌ 

దేశవ్యాప్తంగా రెండో దశ కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు వాణిజ్య సంఘాలు, ప్రముఖులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. మహమ్మారి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోందో చర్చించారు....

Published : 19 Apr 2021 15:27 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా రెండో దశ కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు వాణిజ్య సంఘాలు, ప్రముఖులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. మహమ్మారి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోందో చర్చించారు. అలాగే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు తీసుకున్నారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతి స్థాయిలో విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రాలతోనూ సమన్వయం చేసుకుంటూ ప్రజల జీవితాలు, జీవనోపాధిని కాపాడేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సీఐఐ అధ్యక్షుడు ఉదయ్‌ కొటాక్‌, ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్‌ శంకర్‌, అసోచామ్‌ అధ్యక్షుడు వినీత్‌ అగర్వాల్‌ సహా మరికొంత మంది ప్రముఖులతో నిర్మలా సీతారామన్‌ చర్చలు జరిపి వారి సలహాలు తీసుకున్నారు. టాటా స్టీల్‌ ఎండీ నరేంద్రన్‌, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌, టీసీఎస్‌ ఎండీ రాజేశ్‌ గోపీనాథన్‌, మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ, టీవీఎస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, హీరో మోటో కార్ప్‌ ఎండీ పవన్‌ ముంజల్‌తోనూ మంత్రి చర్చలు జరిపారు.గతవారం ఓ సందర్భంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. భారీ ఎత్తున లాక్‌డౌన్‌లు విధించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కట్టడి చేసే చర్యలు తీసుకోబోమని తెలిపారు. క్షేత్రస్థాయి లాక్‌డౌన్‌, స్థానిక కంటైన్‌మెంట్లకే పరిమితమవుతామని పేర్కొన్నారు. 

భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఉదయం 8 గంటలతో ముగిసిన 24గంటల వ్యవధిలో 13.56 లక్షల పరీక్షలు చేయగా.. 2,73,810 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో వరుసగా ఐదో రోజూ రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 1,619 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని