World Diabetes Day: డ‌యాబెటీస్ ఉన్న వారు ఆరోగ్య బీమా ఎందుకు తీసుకోవాలి?  

డ‌యాబెటీస్‌కి దీర్ఘ‌కాల చికిత్స అవ‌స‌రం. అందువ‌ల్ల కుటుంబంపై ఆర్థిక భారం ప‌డ‌కుండా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలి. 

Updated : 13 Nov 2021 14:51 IST

ప్ర‌స్తుత రోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మందిలో డ‌యాబెటీస్ వ్యాధి క‌నిపిస్తుంది.. ఇదివ‌రికటి రోజుల్లో 50 సంవ‌త్స‌రాలు దాటిన వారిలోనే ఈ వ్యాధి ఎక్కువ‌గా క‌నిపించేది. దీనికి ప్ర‌ధాన కార‌ణం జీవ‌నశైలిలో వ‌చ్చిన మార్పులు. ఇలాంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల బారిన‌ప‌డినా జేబుకు చిల్లు ప‌డ‌కుండా ఉండాలంటే ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిది అంటున్నారు నిపుణులు. 

ప‌త్రీ సంవ‌త్స‌రం న‌వంబ‌రు 14వ తేదిన వ‌ర‌ల్డ్ డ‌యాబెటిక్ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. కాలంతో పాటు మ‌దుమేహంతో భాద‌ప‌డేవారి సంఖ్య పెరుగుతూనే వ‌స్తుంది. ఒక స‌ర్వే ప్ర‌కారం 7.2 కోట్ల మంది భార‌తీయులు ఈ వ్యాధితో భాద‌ప‌డుతున్నారు. అందువ‌ల్లే ఇండియాని ప్రపంచ డయాబెటిక్ రాజధానిగా  పిలుస్తున్నారు.

డ‌యాబెటీస్ ఎందుకు వ‌స్తుంది?
రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మ‌ధుమేహ‌ సమస్య వస్తుంది.  ఆహారం తీసుకున్న‌ప్పుడు వ‌చ్చే బ్ల‌డ్ గ్లూకోజ్‌ నుంచి శ‌రీరంలో శ‌క్తి ఉత్ప‌త్తి అవుతుంది. ప్యాంక్రియాస్.. ఇన్సులిన్ అనే హార్మోన్‌ను తయారు చేస్తుంది. ఈ హార్మోన్ గ్లూకోజ్‌ను క‌ణాలు గ్ర‌హించేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఒక‌వేళ శ‌రీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉత్ప‌త్తి చేయ‌క‌పోతే.. డయాబెటిస్ సమస్య వస్తుంది. 

ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి?
మ‌దుమేహ స‌మ‌స్య ఉన్న వారిలో గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్ని స‌మ‌స్య‌లు, కంటి చూపు మంద‌గించ‌డం వంటివి ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ మ‌ధుమేహ వ్యాధిలో మూడు ర‌కాలు ఉంటాయి. టైప్‌-I, టైప్‌-II, మూడోది గెస్‌టేష్న‌ల్ డ‌యాబెటీస్‌ (గ‌ర్భ‌దార‌ణ స‌మ‌యంలో వ‌స్తుంది) 

ఆరోగ్య బీమా ఎందుకు తీసుకోవాలి?
డ‌యాబెటీస్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగిపోయాయి. దీర్ఘ‌కాలం చికిత్స అవ‌స‌రం కావ‌డంతో కుటుంబాల‌పై అధిక ఆర్థిక భారం ప‌డుతుంది. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం భారత్‌లో నివ‌సించే ప్ర‌జ‌లలో చాలా మంది.. త‌మ‌ మొత్తం కుటుంబ ఆదాయంలో 25శాతం ఇలాంటి దీర్ఘ‌కాలిక జీవ‌న శైలి వ్యాధుల‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. డయాబెటిక్‌ వ్యాధిని ఎదుర్కొనేందుకు సమగ్రమైన ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వ‌ల్ల పొదుపు పెరిగే అవ‌కాశం ఉంటుంది. దీంతో పిల్ల‌ల చ‌దువులు, రుణాలు చెల్లింపులు వంటి వాటికి ఎక్కువ మొత్తం కేటాయించ‌గ‌లుగుతారు. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ధుమేహం వ్యాది కోసం చేసే ప్ర‌త్యక్ష ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌యం 2025 నాటికి 213-396 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా. ఇది కొన్ని దేశాల్లో వారి మొత్తం ఆర్థిక అంచానాల్లో 40శాతం ఉంటుంది. అందువ‌ల్ల‌, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో.. మిమ్మల్ని మీరు ఆర్థికంగా ర‌క్ష‌ణ పొందేందుకు సమగ్ర ఆరోగ్య బీమా పథకం ఉపయోగపడుతుంది.

ముందుగా వ్యాధి నిర్థార‌ణ అయితే బీమా పొంద‌లేరా? 
ముందుగా నిర్ధార‌ణ‌ అయిన జీవినశైలి వ్యాధుల‌తో భాద‌ప‌డుతున్న వారు ఆరోగ్య బీమా పొంద‌లేర‌ని చాలా మంది అపోహ ప‌డుతుంటారు. ఈ కార‌ణంగానే బీమా కొనుగోలును వాయిదా వేస్తుంటారు. అయితే ఇది నిజం కాదు. కేవ‌లం అపోహ మాత్ర‌మే. ముందుగా నిర్థార‌ణ అయిన వ్యాధులు ఉన్న‌వారు కూడా ఆరోగ్య బీమా తీసుకోవ‌చ్చు. 

మొద‌టి రోజు నుంచే ఓపీడి క‌వ‌రేజ్‌..
సాధార‌ణంగా ముందుగా నిర్థార‌ణ అయిన వ్యాధుల‌కు(ప్రీ ఎక్సిటింగ్‌ డిసీజెస్‌- పిఈడి) 3 నుంచి 4 సంవ‌త్స‌రాల‌ వెయింటింగ్ పిరియ‌డ్ ఉంటుంది.  వెయింటింగ్ పిరియ‌డ్ పూర్తైన త‌రువాత పాల‌సీ అమ‌లులోకి వ‌స్తుంది. అంటే ఈ కాల‌వ్య‌వ‌ధిలో క‌వ‌రేజ్ కోసం క్లెయిమ్ చేయ‌లేరు. అయితే ప్ర‌స్తుతం ఆరోగ్య బీమా సంస్థ‌లు ఎర్లీ క‌వ‌రేజ్ లేదా బీమా తీసుకున్న మొద‌టి రోజు నుంచి సేవ‌లు పొందేలా ఆరోగ్య బీమా ప్లాన్‌ను రూపొందిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కి.. ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ప్లాటినం ఎన్‌హాన్స్‌డ్ (డయాబెటిస్), యాక్టివ్ హెల్త్ ప్లాటినం ఎసెన్షియల్ (డయాబెటిస్) వంటి ప్లాన్‌లు మధుమేహానికి ఎర్లీ కవరేజీని అందిస్తున్నాయి. ఈ ప్లాన్ల‌లో ఓపిడి సేవ‌లు మొద‌టి రోజు నుంచి క‌వ‌ర‌వుతాయి. మ‌ధుమేహం కార‌ణంగా ఉత్ప‌న్న‌మ‌య్యే.. స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను పాల‌సీ తీసుకున్న రోజు నుంచి 30 రోజుల త‌రువాతి నుంచి క‌వ‌ర‌వుతాయి.  

ఇది ఉచిత క్రానిక్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రామ్ వ‌స్తుంది. ఈ ప్రొగ్రామ్‌లో 3 సార్లు వైద్యుని సంప్ర‌దించ‌వ‌చ్చు. అలాగే డ‌యాబెటిక్ ప‌రీక్ష‌లు ఉంటాయి. ఆరోగ్యం కాపాడుకునేందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకునే వారికి రివార్డు పాయింట్ల‌తో పాటు ప్రీమియం త‌గ్గే అవ‌కాశం కూడా ఉంటుంది.  పోష‌కాశారం, ఫిట్‌నెస్‌, మెంట్ కౌన్సలింగ్ సెక్ష‌న్‌, హోమియోప‌తి టెలిక‌న్స‌టేష‌న్ కూడా అందిస్తుంది.  

అదేవిధంగా, స్టార్ హెల్త్ డ‌యాబెటిస్ సేఫ్ ప్లాన్‌-బి పేరుతో ఆరోగ్య బీమాను ఆఫ‌ర్ చేస్తుంది. డ‌యాబిటీస్‌తో వ‌చ్చే వ్యాధుల కార‌ణంగా వ్యాధుల ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు 12 నెల‌ల వెయిటింగ్ పిరియ‌డ్‌తో వ‌స్తుంది. టైప్ I లేదా టైప్ II డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న ఎవరైనా ఈ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. రూం ఛార్జీలు, సర్జన్ ఫీజులు, రక్తం, ఆక్సిజన్, రోగనిర్ధారణ ఖర్చులు, ఔషధం, మందుల ఖర్చులు మొదలైన మధుమేహం స‌మస్యల కారణంగా ఆసుపత్రిలో చేరే ఖర్చులను ప్లాన్ కవర్ చేస్తుంది. 

పీఈడిని దాచిపెట్ట‌కండి..
ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేట‌ప్పుడు మీ వైద్య చరిత్రను తెలియ‌ప‌ర‌చ‌డం చాలా ముఖ్యం. కొంత మంది ముందుగా నిర్థార‌ణ అయిన వ్యాధులు, వైద్య చ‌రిత్ర‌ను గురించి దాచిపెట్టి త‌ప్పు చేస్తున్నారు. ఇలా చేయడం వ‌ల్ల క్లెయిమ్ స‌మ‌యంలో పాల‌సీ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంది. మీకు ముందుగా నిర్థార‌ణ అయిన దీర్ఘ‌కాల స‌మ‌స్య‌లు ఉంటే.. పాలసీని కొనుగోలు చేసే ముందు నియమాలు, షరతులను జాగ్రత్తగా చదవండి. ఉప-పరిమితులు, సహ-చెల్లింపులు, గది అద్దె ఛార్జీలను తెలుసుకోండి. ఒక‌వేళ‌ ఆసుపత్రిలో చేరాల్సి వ‌స్తే.. మీ జేబు నుంచి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండ‌దు. 

చివరగా..
ఆరోగ్య బీమాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించండి. ఈ ప‌ద్ధ‌తిలో త్వ‌ర‌గా కొనుగోలు చేయ‌డంతో పాటు మిస్ సెల్లింగ్ అవకాశాలను తగ్గిస్తుంది.  టెలిమెడికల్స్,  వీడియోమెడికల్స్ వంటి ఆధునాత‌న స‌దుపాయ‌లు పాలసీలు వేగంగా జారీ చేయడంలో సహాయపడుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని