Yes Bank: డిష్‌ టీవీ వాటాలను విక్రయించే యోచనలో యెస్‌ బ్యాంకు?

లోన్‌ రికవరీలో భాగంగా డిష్‌ టీవీలో దక్కిన 25.6 శాతం వాటాలను విక్రయించాలని యెస్‌ బ్యాంకు యోచిస్తున్నట్లు సమాచారం....

Published : 10 Jan 2022 14:24 IST

 టాటా స్కై, ఎయిర్‌టెల్‌తో సంప్రదింపులు!

ముంబయి: లోన్‌ రికవరీలో భాగంగా డిష్‌ టీవీలో దక్కిన 25.6 శాతం వాటాలను విక్రయించాలని యెస్‌ బ్యాంకు యోచిస్తున్నట్లు సమాచారం. టాటా స్కై లేదా భారతీ ఎయిర్‌టెల్‌తో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇటు టాటా సన్స్‌గానీ, ఎయిర్‌టెల్‌గానీ స్పందించలేదు.

డిష్‌ టీవీ, యెస్‌ బ్యాంకు మధ్య గత కొన్ని రోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. కంపెనీపై నియంత్రణా హక్కులు తమకే ఉంటాయని ఇరు వర్గాలు వాదిస్తున్నాయి. ప్రస్తుతం 6 శాతం వాటా కలిగిన డిష్‌ టీవీ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర ఫ్యామిలీ కంపెనీ రోజువారీ వ్యవహారాల్ని నిర్వహిస్తోంది.

యెస్‌ బ్యాంకు వాటాలను టాటా స్కై లేదా ఎయిర్‌టెల్‌ ఏ ఒక్కరు దక్కించుకున్నా.. వారి మార్కెట్‌ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా స్కై 33 శాతం మార్కెట్‌ వాటాతో తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఎయిర్‌టెల్‌, డిష్‌ టీవీ ఉన్నాయి. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిష్‌ టీవీ ఆదాయం రూ.1,774 కోట్లుగా నమోదైంది. అలాగే రూ.677 కోట్ల నష్టాల్ని రిపోర్టు చేసింది. మార్కెట్‌ విలువ రూ.3,268 కోట్లుగా ఉన్నట్లుగా నివేదించింది.

డిష్‌ టీవీలో వరల్డ్‌ క్రెస్‌ అడ్వైజర్స్‌ అనే కంపెనీకి కూడా ప్రమోటర్‌ హోదా ఉంది. అయితే, లోన్‌ రికవరీలో భాగంగా యెస్‌ బ్యాంకుకు వాటాలు దక్కడాన్ని ఈ కంపెనీ బాంబే హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ తీర్పు వెలువడ్డ తర్వాతే యెస్‌ బ్యాంకు తమ వాటాల విక్రయాలపై ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని