పెట్టుబ‌డులకు ముందు పీపీఎఫ్ ప‌రిమితులు తెలుసుకోండి

ఎక్కువ రాబ‌డిని ఆశించేవారు పీపీఎఫ్ కాకుండా ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఎంచుకోవ‌డం మంచిది...........

Published : 19 Dec 2020 11:28 IST

ఎక్కువ రాబ‌డిని ఆశించేవారు పీపీఎఫ్ కాకుండా ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఎంచుకోవ‌డం మంచిది.​​​​​​​

ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్) , రిస్క్ లేకుండా పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్న‌వారికి స‌రైన ఆప్ష‌న్‌. పీపీఎఫ్ లో క‌చ్చిత‌మైన రాబ‌డితో పాటు ఆదాయ ప‌న్ను మిన‌హాయింపులు కూడా ల‌భిస్తాయి. అయితే పీపీఎఫ్‌లో కొన్నిప‌రిమితులుఉన్నాయి. పెట్టుబ‌డుదారులు ఈ ప‌రిమితుల‌ గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. 1968 లో పీపీఎఫ్‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ ఆర్థిక ప్ర‌గ‌తి కోసం ప్రారంభించారు. అదేవిధంగా దీనిపై ప్ర‌స్తుతం ఉన్న వ‌డ్డీ రేట్ల ప్ర‌కారం 8 శాతం వ‌డ్డీతో పాటు మెచ్యూరిటీ స‌మ‌యంలో కూడా మిన‌హాయింపులు ల‌భిస్తాయి. అందుకే పీపీఎఫ్ పెట్టుబ‌డులు అంద‌రికీ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. అయితే పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని విష‌యాలు…

  • పీపీఎఫ్‌పై ప్ర‌స్తుతం దీనిపై 8 శాతం వ‌డ్డీ ల‌బిస్తుంది. అయితే అధిక రాబ‌డి కోసం ఆశించే వారికి ఇది స‌రైన పెట్టుబ‌డి ప‌థ‌కం కాద‌నే చెప్పుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ వంటి ప‌థ‌కాల్లో పెట్టుబ‌డుల‌కు మ‌రింత ఎక్కువ రాబ‌డిని ఆశించ‌వ‌చ్చు.
  • లిక్విడిటీ కోసం ఆశించేవారికి కూడా ఇది స‌రైన ఎన్నిక కాదు. ఎందుకంటే దీనికి కాల‌ప‌రిమితి 15 సంవ‌త్స‌రాలు. అయితే ఖాతా ప్రారంభించిన త‌ర్వాత ఏడో ఆర్థిక సంవత్స‌రం నుంచి ప్ర‌త్యేక కార‌ణాలు ఉంటే పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. దీనిపై రుణం కూడా మూడో సంవ‌త్స‌రం నుంచి తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే స్వ‌ల్ప‌కాలానికి అంటే రెండు, మూడేళ్ల‌కోసం పెట్టుబ‌డులు పెట్టేవారికి ఇది స‌రైన‌ది కాద‌నే చెప్పుకోవ‌చ్చు.
  • ఇది కుటుంబం కోసం పొదుపు చేసేందుకు స‌రైన ప‌థ‌కం అని కూడా చెప్పుకోవ‌డానికి వీల్లేదు. ఎందుకంటే అంతేకాకుండా ఇందులో ఉమ్మ‌డి ఖాతాను తెరిచేందుకు వీల్లేదు. ఇది ఒక‌రి పేరుతో మాత్ర‌మే నిర్వ‌హిస్తారు, లేదా భార్య లేదా భ‌ర్త త‌మ మైనర్‌ను పిల్ల‌ల పేరుతో ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. కానీ భార్య‌, భ‌ర్త లేదా ఇంట్లో ఇద్ద‌రు పెద్ద‌వారు క‌లిపి తీసుకోకూడ‌దు.
  • ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాలైన ఈక్విటీలు, మ్యూచువ‌ల్ ఫండ్లు మాదిరిగా ఎన్ఆర్ ఐల‌కు కొత్త‌గా పీపీఎఫ్ ఖాతా ప్రారంభించేందుకు వీల్లేదు. అయితే ఎన్ఆర్ఐ కాక‌ముందు మీకు ఖాతా ఉంటే ఎన్ఆర్ఐ అయిన త‌ర్వాత కూడా ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. అదేవిధంగా ట్ర‌స్టులు, హిందు అవిభాజ్య కుటుంబాలు పీపీఎఫ్ ఖాతా ప్రారంబించేందుకు వీలుండ‌దు.
  • పీపీఎఫ్ పెట్టుబ‌డులకు ప‌రిమితి కూడా ఉంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి. సంవ‌త్సరానికి కేవ‌లం రూ.1.5 ల‌క్ష‌లు మాత్ర‌మే డిపాజిట్ చేయాలి.అదే ఈఎల్ఎస్ఎస్‌లో అయితే గ‌రిష్ఠంగా ఎంతైనా పెట్టుబ‌డులు పెట్టుకోవ‌చ్చు. కాని ప‌న్ను మిన‌హాయింపు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కే ఉంటుంది.
  • మీరు ఇప్ప‌టికే ఒక సంస్థ‌లో ఉద్యోగం చేస్తూ ఈపీఎఫ్‌లో ఉన్న‌ట్ల‌యితే పీపీఎఫ్ ప‌న్ను మిన‌హాయింపుల‌పై ప‌రిమితి ఉంటుంది. ఎందుకంటే రెండింటిపై క‌లిపి ప‌న్ను మిన‌హాయింపు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కే ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని