Updated : 15 Jan 2021 09:57 IST

క్రెడిట్ స్కోర్‌ను మెరుగుప‌రుచుకోండి 

కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది రుణగ్రహీతలు ఆర్థిక ఒత్తిడికి గురయ్యారు. జీతం కోతలు, తొలగింపులు, వ్యాపారాలు మూతపడ్డాయి. తాత్కాలిక నిషేధం ముగిసిన తర్వాత క్రమం తప్పకుండా రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలను తిరిగి చెల్లించడంలో కొందరు విఫలమయ్యారు. దీంతో వారి క్రెడిట్ స్కోర్లపై ప్ర‌భావం చూపింది.

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ లిమిటెడ్ ప్రకారం, 42 శాతం రుణగ్రహీతలు 300 నుంచి 747 మధ్య క్రెడిట్ స్కోరును కలిగి ఉన్నారు.  సుమారు 41 శాతం మందికి 748- 777 మధ్య క్రెడిట్ స్కోర్లు ఉన్నాయి. ఇక 17 శాతం మాత్రమే 778 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్లు కలిగి ఉన్నారు.

చాలా బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న రుణగ్రహీతలకు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఉదాహరణకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణగ్రహీతలకు 700 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరుతో ఉంటే ఉత్తమ గృహ రుణ వడ్డీ రేటును అందిస్తుంది.  600- 700 మధ్య క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి రిస్క్ ప్రీమియం విధిస్తుంది.  600 కంటే తక్కువ స్కోరు కలిగి ఉంటే, చాలా బ్యాంకులు రుణ దరఖాస్తును కూడా తిరస్కరించవచ్చు.

మహమ్మారి వల్ల కలిగిన‌ ఆర్థిక సంక్షోభం కారణంగా మీ క్రెడిట్ స్కోరు క్షీణిస్తే దాన్ని మెరుగుపరచడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి..

క్రెడిట్ నివేదికను సమీక్షించండి:

మీ క్రెడిట్ నివేదికను సమీక్షించడం మొదటి విషయం. అవ‌స‌ర‌మైన‌చోట త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోండి. క్రెడిట్ రిపోర్టులలో పొరపాట్లు జ‌రుగుతుంటాయి. బ్యాంకులు మీ డేటాను క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తున్నప్పుడు అవి జరగవచ్చు. అదేవిధంగా మీ కార్డుల‌ను మీకు తెలియ‌కుండా ఎవ‌రైనా ఉప‌యోగిస్తే తీవ్రంగా న‌ష్ట‌పోతారు. అందుకే క్రెడిట్ రిపోర్ట్ చూసుకొని ఏమైనా త‌ప్పులుంటే సరిచేసుకోవాలి.
ట్రాక్ రికార్డ్:
 మీ చెల్లింపులు క్రమంగా లేకుంటే క్రెడిట్ స్కోరు మెరుగుపడదు. మొదట చిన్న-కాల, అసురక్షిత రుణాలను చెల్లించడం పూర్తిచేయాలి.  బ్యాంకులు రుణం జారీచేసేట‌ప్పుడు కేవ‌లం క్రెడిట్ స్కోర్‌నే కాకుండా క్రెడిట్ చ‌రిత్ర‌, ప్ర‌స్తుత ఆదాయం, ఎక్క‌వ‌గా తీసుకున్న రుణం, చెల్లింపు విధానం వంటి వేర్వేరు విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీస‌కుంటారు. అందుకే వీటిని మెరుగుప‌రిచేందుకు ప్ర‌య‌త్నించాలి.  తిరిగి చెల్లించిన అన్ని రుణాలు పూర్తిగా ముగిసిన‌ట్లు నిర్ధారించుకోండి. ఇంకా కాకపోతే, సంబంధిత రుణదాతలను మూసివేసి, త‌గిన ప‌త్రాల‌ను ఇవ్వాల్సిందిగా  కోరండి.

క్రెడిట్ వినియోగం:
 సిబిల్ నివేదికలో క్రెడిట్ వినియోగాన్ని చెక్ చేసుకోవాలి. మీ క్రెడిట్ వినియోగం 30-35 శాతం ఉండాలి.  కనీసం 50 శాతం కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి..

రుణ ద‌ర‌ఖాస్తులు:
 రుణం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ, రుణదాత మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. ఎక్కువ సార్లు రుణం తీసుకుంటే క్రెడిట్ స్కోరు కొద్దిగా తగ్గుతుంది. రుణదాతలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారని ఇది సూచిస్తుంది. కాబ‌ట్టి తీసుకున్న రుణాలు స‌క్ర‌మంగా చెల్లించ‌డంతో పాటు ఎక్కువ సార్లు తీసుకోక‌పోవ‌డం మంచిది. 
 
సుర‌క్షిత రుణాలు:
మంచి ట్రాక్ రికార్డ్‌ను కొన‌సాగించడానికి, సురక్షితమైన రుణాలను ఎంచుకోండి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై కూడా మీరు క్రెడిట్ కార్డును కూడా పొందవచ్చు. వ్యక్తిగత రుణాలు వంటి అసురక్షిత రుణాలను వీలైనంత వరకు తీసుకోక‌పోవ‌డం మంచిది. రుణదాతలు ఎక్కువగా భ‌ద్ర‌త లేని  రుణాలు కలిగి ఉంటే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది.

రుణాల‌ను తిరిగి చెల్లించడంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటే ఈ ప్రక్రియకు సమయం పడుతుంది. చెల్లింపులు క్ర‌మంగా ప్రతి త్రైమాసికంలో మీ స్కోరు మెరుగుపడటం ప్రారంభమవుతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని