ఈపీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసుకోవ‌డం స‌రైన నిర్ణ‌య‌మేనా?

పీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసుకుంటే దానిపై భ‌విష్య‌త్తులో ల‌భించే వ‌డ్డీని పూర్తిగా కోల్పోతారు....

Published : 24 Dec 2020 13:31 IST

పీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసుకుంటే దానిపై భ‌విష్య‌త్తులో ల‌భించే వ‌డ్డీని పూర్తిగా కోల్పోతారు

క‌రోనా కార‌ణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు త‌మ పీఎఫ్ ఖాతా నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చ‌ని ఈపీఎఫ్ఓ వెల్ల‌డించిన‌ సంగ‌తి తెలిసిందే. దీంతో పీఎఫ్ క‌రోనా క్లెయిమ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఇప్ప‌టివ‌ర‌కు 1.37 ల‌క్ష‌ల క్లెయిమ్‌ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపింది. 4 లక్ష‌ల‌కు పైగా క్లెయిమ్‌లు వ‌చ్చిన‌ట్లు నివేదిక‌లు తెలుపుతున్నాయి.

పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే…
పీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం, మూడు నెల‌ల వేత‌నం లేదా డీఏ ఏది త‌క్కువ‌గా ఉంటే అంత మొత్తం విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎప్ఓ అనుమ‌తించింది. దీనిని తిరిగి జ‌మ చేయ‌న‌వ‌స‌రం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు మీ ప్రాథ‌మిక వేత‌నం నెల‌కు రూ.30,000 అనుకుంటే ఈపీఎప్ బ్యాలెన్స్ రూ. 1 ల‌క్ష ఉంది. అంటే గ‌రిష్ఠంగా రూ.75,000 విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
వేత‌నం * 3 నెల‌లు = 30,000* 3 = 90,000
ఇందులో 75 శాతం అంటే రూ.75,000. ఇదే త‌క్కువ కాబ‌ట్టి ఇంత మొత్తం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఎవ‌రు విత్‌డ్రా చేసుకుంటున్నారు?

  1. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న‌వారు
  2. ఖర్చుల కోసం లేదా పాక్షికంగా రుణాలు చెల్లించాలనుకునేవారు
  3. ఈక్విటీలలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు

విత్‌డ్రా చేసుకోవ‌డం స‌రైన‌దేనా?
ఇది గృహ కొనుగోలు, వైద్య చికిత్స లేదా కోవిడ‌తో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి త‌ప్ప ఇత‌ర కార‌ణాల‌తో విత్‌డ్రా చేసుకోవ‌డం మంచిది కాద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పదవీ విరమణ నిధి కొర‌కు ఈపీఎఫ్ దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించ‌వచ్చు. వృద్ధాప్యంలో తగిన ఆదాయం పొంద‌డం చాలా అవ‌స‌రం. ఇది ఈపీఎఫ్‌తో సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌భుత్వ హామీతో ప‌న్ను లేకుండా, రిస్క్ లేకుండా రాబ‌డి పొందే ఏకైక ప‌థ‌కం ఈపీఎఫ్ అని చెప్ప‌వ‌చ్చు. ఈపీఎఫ్‌ నుంచి ఉపసంహరించుకోవడం అంటే ఇక్క‌డ‌ కలిగి ఉన్న అతిపెద్ద ప్రయోజనాన్ని కోల్పోవడం. అది చ‌క్ర‌వ‌డ్డీతో పొందే లాభం.

ఉదాహ‌ర‌ణ‌కు పైన చెప్పిన‌ట్లుగా ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ.75,000 ఉప‌సంహ‌రించుకుంటే , వారి ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఇంకా 30 ఏళ్ల స‌మ‌యం ఉంద‌నుకుంటే మొత్తం రూ.9 ల‌క్ష‌ల వ‌డ్డీ కోల్పోతారు. ఇది చాలా ఎక్కువ అని గుర్తుంచుకోండి. ఒక‌వేళ ఇప్పుడు విత్‌డ్రా చేసుకొని, తిరిగి ఖాతాలో డిపాజిట్ చేసేందుకు కూడా వీల్లేదు. అంటే భ‌విష్య‌త్తులో ఆ మొత్తంపై వ‌చ్చే వ‌డ్డీని పూర్తిగా కోల్పోతారు.

స‌రిప‌డినంత డ‌బ్బు లేక‌పోతే ?
ఈపీఎఫ్ నుంచి అడ్వాన్స్ విత్‌డ్రా చేసుకొని వడ్డీని కోల్పోయే బదులుగా, ఇంట్లో ఉన్న బంగారాన్ని కొంత మేర‌కు అమ్మేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది బంగారాన్ని ఆర్థిక ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు ఒక భ‌రోసాగా లేదు ఒక పెట్టుబ‌డిగా కొని ఇంట్లో దాచుకుంటారు. ఇలాంటి అనిశ్చితి ఏర్ప‌డిన‌ప్పుడు దీనిని అమ్మ‌డాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌చ్చు. కాని బంగారం ఆర్థిక విలువను సృష్టించ‌దు. అందువల్ల ఆర్థికంగా కష్టతరమైన దశలో మ‌ద్ద‌తు కోసం పాక్షికంగా విక్ర‌యించాలి. దీనికి బ‌దులుగా ప‌న్ను ర‌హిత పెట్టుబ‌డుల‌ను, రాబ‌డినిచ్చే వాటిలో పెట్టుకోవ‌డం మంచిది.

రుణ చెల్లింపుల కోస‌మా?
ఈపీఎఫ్ విత్‌డ్రా చేసుకోవ‌డం సుల‌భం కావ‌డంతో దానివైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రుణాలు చెల్లించాల‌న‌కోవ‌డం మంచి నిర్ణ‌యం కాదు. మ‌రి ఇప్పుడే తీసుకుంటే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవితం గురించి ఆలోచించారా. అప్పుడు మొత్తం ఆదాయం రావ‌డం ఆగిపోతుంది. ఇక్క‌డ మీరు గుర్తుంచుకోవోఆల్సిన ఇంకో విష‌యం ఏంటంటే మీ ఈపీఎఫ్ ఖాతాలో మీకు స‌మానంగా మీ సంస్థ కూడా జ‌మ‌చేస్తుంది. అందుకే పీఎఫ్ నుంచి డ‌బ్బు తీసుకోవ‌డానికి బ‌దులుగా ఖ‌ర్చుల‌ను తగ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

ఈక్విటీల్లో పెట్టుబ‌డుల కోస‌మా?
పీఎఫ్ కంటే ఈక్విటీ పెట్టుబ‌డులు ఎక్కువ రాబ‌డిన‌స్తాయ‌న్న మాట నిజ‌మే కానీ, ఈక్విటీల్లో పెట్టుబ‌డుల కోసం పీఎఫ్ నుంచి న‌గ‌దు ఉప‌సంహ‌రించ‌డం తెలివైన నిర్ణ‌యం కాదు. దీనికోసం వేరే మార్గాలు అన్వేషించాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తప్పనిసరి అయినట్లే, వేత‌న జీవుల‌కు ఈపీఎఫ్‌ ఒక ముఖ్యమైన పెట్టుబడి, ఎందుకంటే ఇది ఆర్థిక భద్రతను అందిస్తుంది, ఇది ఇతర పథ‌కాలు చేయ‌లేవు. పెట్టుబ‌డుల‌కు అర్థం ఎక్కువ రాబ‌డి పొంద‌డం ఒక్క‌టే కాదు. ఆర్థిక భ‌రోసాను పొంద‌డం. అందుకే కారణం ఏమైనప్పటికీ, ఈపీఎఫ్‌ నుంచి అడ్వాన్స్ తీసుకోకండి. దీర్ఘకాలిక లాభం కోసం స్వ‌ల్ప‌కాలికంగా కాస్త ఇబ్బంది ప‌డినా ఫ‌ర్వాలేద‌ని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని