Amazon Bribery: ఆ ఆరోపణలను.. తీవ్రంగా పరిగణిస్తున్నాం

భారత ప్రభుత్వ అధికారులకు తమ న్యాయ ప్రతినిధులు లంచం ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అమెజాన్‌ స్పష్టం చేసింది....

Updated : 21 Sep 2021 11:43 IST

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
భారత అధికారులకు తమ న్యాయ ప్రతినిధులు లంచం ఇచ్చారనే కథనాలపై అమెజాన్‌

దిల్లీ: భారత ప్రభుత్వ అధికారులకు తమ న్యాయ ప్రతినిధులు లంచం ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అమెజాన్‌ స్పష్టం చేసింది. అవినీతిని ఏమాత్రం సహించబోమని పేర్కొంది. అయితే ఆరోపణలను కొట్టిపారేయడం గానీ ధ్రువీకరించడం గానీ కంపెనీ చేయలేదు.

మార్నింగ్‌ కంటెక్స్ట్‌నివేదిక ప్రకారం.. ఈ విషయమై అమెజాన్‌ కొందరు న్యాయ ప్రతినిధులపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  ఈ వ్యవహారం విషయంలోనే సంస్థ సీనియర్‌ కార్పొరేట్‌ న్యాయవాదిని సెలవుపై పంపించినట్లు సమాచారం. ఈ వార్తలపై అమెజాన్‌ అధికార ప్రతినిధిని సంప్రదించగా.. ‘మేం అవినీతిని ఏమాత్రం సహించం. అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం. ఈ ఆరోపణలపై, దర్యాప్తు ఎంత వరకు వచ్చిందనే విషయాలపై ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోవడం లేద’ని తెలిపారు.

వ్యాపార అవకాశాలను నిలబెట్టుకునేందుకు లేదా పొందేందుకు విదేశీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారంటూ అందిన ఫిర్యాదుల ఆధారంగా అమెజాన్‌ విచారణ చేపడుతోందని ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు తెలిపాయి.ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన విషయం అయినందున ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు వేయాల్సిందిగా వాణిజ్య సంఘం కెయిట్‌ డిమాండు చేస్తోంది. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో అవినీతి నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అధికారుల పేర్లను బయటకు వెల్లడించి, వాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలని  కెయిట్‌ డిమాండు చేసింది. సరైన, స్వతంత్ర దర్యాప్తును కోరుతూ అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు తాము లేఖ రాయనున్నట్లు వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌కు కెయిట్‌ తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని