
Zydus Cadila: యాంటీబాడీ కాక్టెయిల్ పరీక్షలకు అనుమతివ్వండి
ఇంటర్నెట్‌డెస్క్: ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా కొవిడ్ చికిత్సకు యాంటీబాడీ కాక్టెయిల్ను సిద్ధం చేస్తోంది. జెడ్ఆర్సీ-3308 పేరుతో అభివృద్ధి చేసిన ఈ చికిత్సను మనుషులపై ప్రయోగించేందుకు అనుమతులు కోరింది. గతంలో దీనిని జంతువులపై ప్రయోగించగా.. ఊపిరితిత్తులు కొవిడ్ కారణంగా దెబ్బతినకుండా సమర్థంగా అడ్డుకొన్నట్లు తేలిందని కంపెనీ పేర్కొంది. ఇది సురక్షితమైందని కంపెనీ పేర్కొంది. ఈ కాక్టెయిల్లో వాడే యాంటీబాడీలు సహజమైన యాంటీబాడీల వలే పనిచేస్తూ.. కొవిడ్‌తో పోరాడేలా శరీరాన్ని సిద్ధం చేస్తాయి.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌తో పోరాడేందుకు మరింత సమర్థవతమైన, సురక్షితమైన చికిత్సను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని జైడస్ క్యాడిలా ఎండీ షార్విల్ పటేల్ తెలిపారు. తాము డీసీజీఐ నుంచి అనుమతి కోరామని జైడస్ పేర్కొంది. ఇప్పటికే ఇటు వంటి చికిత్సకు అమెరికాలో అత్యవసర అనుమతులు లభించాయి. వైర్ బయోటెక్నాలజీ, జీఎస్కే, రీజనరాన్, ఎలి లిల్లీ సంస్థలు వీటిని అభివృద్ధి చేశాయి. రీజనరాన్- రోచ్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న యాంటీబాడీ కాక్టెయిల్కు భారత్‌లో అనుమతలు లభించాయి.