Stock Market: సానుకూలతలకు అవకాశం

రాబోయే బడ్జెట్‌పై ఆశావహ దృక్పథంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రాణించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ప్రతిపాదనలు వృద్ధిరేటు పెంచేందుకు దోహదం చేసేలా ఉంటాయనే అంచనాలున్నాయి.

Published : 08 Jul 2024 01:53 IST

బడ్జెట్పై ఆశావహ దృక్పథం
ఈ వారంలోనే టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫలితాలు
లోహ, యంత్రపరికరాల షేర్లు రాణించే వీలు
విశ్లేషకుల అంచనాలు

రాబోయే బడ్జెట్‌పై ఆశావహ దృక్పథంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రాణించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ప్రతిపాదనలు వృద్ధిరేటు పెంచేందుకు దోహదం చేసేలా ఉంటాయనే అంచనాలున్నాయి. దేశీయ మదుపర్లు కొనుగోళ్లను కొనసాగిస్తారని.. సూచీలకు ఇది కలిసిరావొచ్చని అంటున్నారు. అయితే లాభాలు కొనసాగడం మాత్రం ఐటీ రంగ దిగ్గజ కంపెనీల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు. జూన్‌ త్రైమాసిక ఫలితాలను టీసీఎస్‌ గురువారం, హెచ్‌సీఎల్‌ టెక్‌ శుక్రవారం ప్రకటించనుండడమే ఇందుకు కారణం. నిఫ్టీ-50 ముందుకే వెళ్తుందని.. అయితే 24,500 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావచ్చొని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఈ సూచీకి 24,175-24,200 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చని అంచనా వేస్తున్నారు. విదేశీ మదుపర్ల ధోరణి, రుతుపవనాల కదలిక కీలకం కానున్నాయి. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు..

  • ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభాలు అందుకోవచ్చు. అయితే లాభాల స్వీకరణనూ కొట్టిపారేయలేం.  సాధారణ వర్షపాత అంచనాల వల్ల, గ్రామీణ గిరాకీ పుంజుకోవచ్చని భావిస్తున్నారు. 
  • ఐటీ కంపెనీల షేర్లు రాణించొచ్చు. సంస్థల ఫలితాలు గతంలో కంటే నిరుత్సాహకరంగా ఉండబోవని.. భవిష్యత్తులో స్థిర వృద్ధి నమోదు చేస్తాయని అంచనాలు ఉన్నాయి. ఫలితాల సందర్భంగా టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్‌ యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి.
  • నిఫ్టీ వాహన సూచీ స్థిరీకరణకు గురికావొచ్చు. నెలవారీ రిటైల్‌ విక్రయాల్లో వృద్ధి కారణంగా కొన్ని ద్విచక్ర వాహన షేర్లు మాత్రం పెరగొచ్చు. రాబోయే కొద్ది వారాల్లో మాత్రం వాహన షేర్లు, సూచీ ఊగిసలాటకు గురికావొచ్చు.
  • ప్రభావం చూపే వార్తలు లేనందున చమురు ఉత్పత్తి, మార్కెటింగ్‌ సంస్థల లాభాలు స్తబ్దుగానే కొనసాగొచ్చు. ఆయా కంపెనీల ఆదాయ అంచనాలపై దృష్టి పడొచ్చు.
  • టెలికాం కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగొచ్చు. టారిఫ్‌ పెంపు ప్రకటనతో, పెరిగిన షేర్లలో కొంతమేర లాభాల స్వీకరణ జరగొచ్చు. జియో ఐపీఓ వార్తలను సునిశితంగా గమనించాలి. 
  • సిమెంటు షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. కంపెనీల విలీనాలు జరుగుతున్నా, చాలా ప్రాంతాల్లో సిమెంటు ధరలు తగ్గుతుండడం ఇందుకు కారణం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధరను రూ.10-15 మేర తగ్గించారు. వర్షాల కారణంగా గిరాకీ అంతగా ఉండకపోవచ్చని అంచనా.
  • త్వరలోనే ఆర్డర్లు పెరగొచ్చన్న అంచనాల మధ్య యంత్ర పరికరాల షేర్లు దూసుకెళ్లొచ్చు. ఈ త్రైమాసికంలో మార్జిన్లు పెరగొచ్చని బ్రోకరేజీలు అంటున్నాయి. బడ్జెట్‌లో మూలధన వ్యయాలకు భారీ కేటాయింపులుంటాయన్న అంచనాలూ సానుకూలతలు తీసుకురావొచ్చు.
  • అంతర్జాతీయ సానుకూలతల మధ్య లోహ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది. ఈ రంగంపై ఆశావహ అంచనాలున్నందున, తగ్గినపుడల్లా ఈ షేర్లు కొనుగోలు చేయడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. 
  • ఔషధ కంపెనీల షేర్లు కొద్ది రోజుల పాటు రాణించొచ్చు. అయితే ప్రీమియం ఆవిష్కరణలు లేకపోవడం, అక్యూట్‌ థెరపీ విభాగం పనితీరు దేశీయంగా అంతగా బాగోలేకపోవడం, అమెరికాలో ఔషధాల ధరలపై ఒత్తిడి పెరుగుతుండడం వంటివి సవాళ్లు విసరొచ్చు. 
  • నిఫ్టీ బ్యాంక్‌ ఒక శ్రేణిలో కదలాడొచ్చు. సాంకేతికంగా చూస్తే 52,000-53,200 పాయింట్ల స్థాయిలో స్థిరీకరణకు గురవుతోంది. ఈ పాయింట్లకు అటో ఇటో ఈ సూచీ వెళితేనే తదుపరి దిశకు వీలుంటుంది. ఎస్‌బీఐ, బీఓబీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌లు సానుకూలంగా చలించొచ్చు.

స్టాక్‌ మార్కెట్‌ 
ఈ వారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని