Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్‌.. ఖర్చులన్నీ కంపెనీవే!

ఆస్ట్రేలియాకు చెందిన ఓ కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగులను చూసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర సంస్థల ఉద్యోగులు అసూయపడతారంటే అతిశయోక్తి కాదేమో...

Published : 06 Jul 2022 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాకు చెందిన ఓ కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగులను చూసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర సంస్థల ఉద్యోగులు అసూయపడతారంటే అతిశయోక్తి కాదేమో! ట్రిప్పులు, పార్టీలు, పబ్‌లు.. కార్పొరేట్‌ సంస్కృతిలో భాగం. సరదాగా ఎక్కడైనా టూర్‌కు వెళతామంటే కంపెనీ ఒక్కరో, ఇద్దరికో కలిపి సెలవు మంజూరు చేస్తుంది. మహా అయితే, ఒక బృందం మొత్తం సరదాగా గడిపి రావడానికి ఏటా ఉండే ట్రావెల్‌ అలవెన్స్‌ సెలవులను ఇస్తుంది.

ఆస్ట్రేలియాకు చెందిన అడ్వర్టైజింగ్‌ కంపెనీ సూప్ ఏజెన్సీ మాత్రం ఏకంగా కంపెనీ ఉద్యోగులందరినీ ఒకేసారి బయటకు తీసుకెళ్లింది. అదీ ఏకంగా వరుసగా 14 రోజులు. అంతటితో ఆగిపోలేదు.. కంపెనీయే సొంత ఖర్చులతో వారిని ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలికి తీసుకెళ్లింది. ఉబుద్‌లోని అత్యంత విలాసవంతమైన విల్లాను అద్దెకు తీసుకొని ఉద్యోగులకు అన్‌లిమిటెడ్‌ ఎంజాయ్‌మెంట్‌ను అందించింది. అయితే, ఇది పూర్తిగా సెలవు కాదు. ఒక వర్కింగ్‌ ట్రిప్‌. అంటే ఎంజాయ్‌ చేస్తూనే వర్క్‌ కూడా చేయాలి. ఇలా ఆఫీసు వెలుపల కొత్త వాతావరణంలో సరదాగా గడుపుతూ పని చేయడమంటే నిజంగా వినూత్న ఎక్స్‌పీరియెన్స్‌ అనే చెప్పాలి!

ఉద్యోగులందరూ కలిసి సరదాగా గడుపుతున్న ఓ వీడియోను కంపెనీయే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. హైకింగ్‌, స్నోర్కెలింగ్‌, స్విమ్మింగ్‌, క్వాడ్‌ బైకింగ్‌ వంటి ఆటవిడుపులతో ఉద్యోగులు సరదాగా గడుపుతూ పనిచేయడం వీడియోలో గమనించొచ్చు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ కాత్యా వకులెంకో మాట్లాడుతూ.. బలమైన ఉద్యోగుల బృందాన్ని నిర్మించుకోవడానికి ఇలాంటి వాతావరణాన్ని అందించడం అవసరమని తెలిపారు. అయితే, ఈ ట్రిప్‌లో ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదట! వచ్చేసారి సూప్‌ ఏజెన్సీ తమ ఉద్యోగులకు ఐరోపా సూప్‌ రుచి చూపించాలనుకంటోందట మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని