Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 64 పాయింట్ల నష్టంతో 62,208 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 18,467 వద్ద కొనసాగుతోంది.

Published : 25 Nov 2022 09:39 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 64 పాయింట్ల నష్టంతో 62,208 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 18,467 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.67 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. థ్యాంక్స్‌ గివింగ్‌ డే నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం  పనిచేయలేదు. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనాలో కరోనా కేసులు విజృంభిస్తుండడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు నిన్నటి గరిష్ఠాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకూ మొగ్గుచూపుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడం మాత్రం కలిసొచ్చే అంశం.

గమనించాల్సిన స్టాక్స్‌...

ఎస్‌బీఐ: ఈ ఆర్థిక సంవత్సరం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌ ద్వారా రూ.10 వేల కోట్లు సమీకరించాలని ఎస్‌బీఐ యోచిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: కైజద్‌ భరూచాను డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బ్యాంకు ఎంపిక చేయాలని నిర్ణయించింది. భవేశ్‌ జవేరీని పూర్తికాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించనుంది.

ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫ్ ఇండియా: ఎక్స్‌2ఫ్యూయల్స్‌ అండ్‌ ఎనర్జీ అనే అంకుర సంస్థలో 50 శాతం వాటాలను కొనుగోలు చేయాలని ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్ణయించింది.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌: చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌తో కలిసి ఇండియన్‌ ఆయిల్‌ ఏర్పాటు చేయనున్న సంయుక్త సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీడ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో రూ.31,580 కోట్ల వరకు పెట్టుబడులు అవసరం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

టీవీఎస్‌ మోటార్‌: ప్రంపచవ్యాప్తంగా తమ కార్యకలాపాల్ని విస్తరించడంలో భాగంగా సింగపూర్‌లో టీవీఎస్‌ మోటార్‌ తొలి షోరూంను ప్రారంభించింది.

టాటా స్టీల్‌ లాంగ్‌: నీలాంచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌లో మరో 46.87 మిలియన్ల షేర్లను టాటా స్టీల్‌ లాంగ్‌ కొనుగోలు చేసింది.

పీవీఆర్‌: తిరువంతపురంలో పీవీఆర్‌ 12 తెరలతో కూడిన సూపర్‌ప్లెక్స్‌ను తెరిచింది.

లారస్‌ ల్యాబ్స్‌: సొంత విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని లారస్‌ ల్యాబ్స్‌, సౌర విద్యుదుత్పత్తి సంస్థ ఎథాన్‌ ఎనర్జీ ఇండియాలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని