Employment: వచ్చే 5 ఏళ్లలో ఈ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌.. WEF ఆసక్తికర నివేదిక!

Employment: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల్లో రానున్న మార్పులు, వాటి తీరుతెన్నులపై ప్రపంచ ఆర్థిక నివేదిక ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌ పేరిట నివేదికను విడుదల చేసింది. అందులోని ఆసక్తికర విషయాలను చూద్దాం..!

Updated : 01 May 2023 11:12 IST

జెనీవా: ఈ దశాబ్దం ఆరంభంలోనే ఉద్యోగాల కల్పనకు కరోనా మహమ్మారి, ఆటోమేషన్‌ రూపంలో పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా ఉద్యోగాల తీరులో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు ఆ మార్పులు స్థిరంగా కొనసాగుతాయని తాజాగా ఓ ప్రముఖ నివేదిక కుండబద్దలు కొట్టింది. మొత్తం నికర ఉద్యోగాల సృష్టిలో తగ్గుదల నమోదవుతుందని తేల్చి చెప్పింది.

వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పావు వంతు (23%) ఉద్యోగాల్లో మార్పులు తథ్యమని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) నివేదిక ఒకటి స్పష్టం చేసింది. 2023 నుంచి 2027 వరకు దాదాపు 6.9 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్లు కనుమరుగవుతాయని అంచనా వేసింది. ఈ మేరకు భవిష్యత్‌ ఉద్యోగాల తీరుతెన్నులపై ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌ 2023’ (The Future of Jobs Report 2023) పేరిట డబ్ల్యూఈఎఫ్‌ సవివర నివేదికను ఆదివారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 803 కంపెనీల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

హరిత ఇంధనంవైపు మళ్లడం; సరఫరా గొలుసుల స్థానికీకరణ; పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన (ESG) అంశాల్లో ప్రామాణికత ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తాయని నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం (Inflation), ఆర్థిక వృద్ధిలో మందకొడితనం, సరఫరా కొరతలు సవాల్‌ విసురుతాయని పేర్కొంది. అత్యాధునిక సాంకేతికతల అమలు, డిజిటలీకరణ వల్ల ఉద్యోగాల తీరుతెన్నుల్లో గణనీయ మార్పులు రానున్నట్లు అంచనా వేసింది. మొత్తంగా అధునాతన సాంకేతికతల వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగాల కల్పన మెరుగవుతుందని స్పష్టం చేసింది.

నివేదికలోని ఇతర కీలకాంశాలు..

  • వచ్చే ఐదేళ్లలో వ్యాపారాల్లో మార్పులు పూర్తిగా నూతన సాంకేతికతల అమలుపైనే ఆధారపడి ఉంటుంది.
  • పర్యావరణ, సాంకేతికత, ఆర్థికంగా వచ్చే కొత్త పోకడలే ఉద్యోగాల సృష్టి, కోతలను నిర్దేశిస్తాయి.
  • వచ్చే ఐదేళ్లలో 75 శాతం కంపెనీలు బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోనున్నాయి.
  • కొత్త సాంకేతికతల అమలు వల్ల వచ్చే ఐదేళ్లలో నికరంగా ఉద్యోగాల కల్పన మెరుగవుతుంది.
  • కృత్రిమ మేధ (AI), మెషీన్‌ లెర్నింగ్‌ నిపుణులకు రానున్న రోజుల్లో గిరాకీ మెండుగా ఉంటుంది. ఆ తర్వాత సస్టయినబిలిటీ నిపుణులు, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ విశ్లేషకులు, సమాచార భద్రత విశ్లేషకులు, పునరుత్పాదక ఇంధన ఇంజినీర్లు, సౌర ఇంధన స్థాపన, వ్యవస్థల ఇంజినీర్ల వంటి వారికి డిమాండ్‌ పెరగనుంది.
  • క్లర్కులు, సెక్రటోరియల్‌ విధుల్లో ఉన్నవారికి రానున్న కొన్నేళ్లలో అవకాశాలు సన్నగిల్లనున్నాయి. బ్యాంక్‌ టెల్లర్లు సంబంధింత క్లర్కులు, పోస్టల్‌ సేవల క్లర్కులు, క్యాషియర్లు, టికెట్‌ క్లర్కులు, డేటా ఎంట్రీ క్లర్కు ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోనున్నాయి. ఆటోమేషనే దీనికి కారణం.
  • విద్య, వ్యవసాయం, డిజిటల్‌ కామర్స్‌, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాల కల్పన గణనీయంగా ఉండనుంది. అదే సమయంలో సంప్రదాయ భద్రత, ఫ్యాక్టరీ, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాలు తగ్గనున్నాయి.
  • విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచన విధానం కీలక నైపుణ్యంగా మారనుంది.
  • వచ్చే ఐదేళ్లలో దాదాపు 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు కాలం చెల్లనుందని యాజమాన్యాలు వెల్లడించాయి.
  • 2027 నాటికి ప్రతి 10 మంది కార్మికుల్లో ఆరుగురికి నైపుణ్య శిక్షణ అవసరమవుతుందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. కానీ, సగం మందికి మాత్రమే సరైన నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని