Pharma services: ఫార్మా సేవలకు ప్రత్యేక క్లస్టర్‌

ఫార్మా సేవలు, జీవ శాస్త్ర (లైఫ్‌ సైన్సెస్‌) రంగాల అవసరాలను అర్థం చేసుకోవడంతో పాటు, వాటి వృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని పలు కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈఓ) అభిప్రాయపడ్డారు.

Published : 22 Jun 2024 02:41 IST

ఐటీ తరహా వృద్ధి అవకాశాలు
సీఐఐ సదస్సులో సీఈఓలు

ఫార్మా సేవలపై శుక్రవారం హైదరాబాద్‌లో సీఐఐ నిర్వహించిన సదస్సులో జోనాథన్‌ హంట్,
అఖిల్‌ రావి, మణి కంటిపూడి, సుదర్శన్‌ జైన్, కృష్ణ కనుమూరి, గణేశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫార్మా సేవలు, జీవ శాస్త్ర (లైఫ్‌ సైన్సెస్‌) రంగాల అవసరాలను అర్థం చేసుకోవడంతో పాటు, వాటి వృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని పలు కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈఓ) అభిప్రాయపడ్డారు. ఫార్మా సేవల రంగ ప్రణాళికలపై శుక్రవారం ఇక్కడ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ ప్యానల్‌ సదస్సు నిర్వహించింది. 

రూ.16,500 కోట్ల స్థాయిలో

ప్యానల్‌ కన్వీనర్, సప్తగిర్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిల్పా రెడ్డి మాట్లాడుతూ..ఫార్మా సేవల రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారే శక్తి భారత్‌కు ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు మన దేశంలోని కాంట్రాక్ట్‌ రీసెర్చ్, కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్, తయారీ కంపెనీలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నాయని, ఇది కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. దేశంలో ఐట రంగాన్ని మించి ఫార్మా సేవల రంగం అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో రసాయన శాస్త్రవేత్తలకు గిరాకీ పెరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత ఫార్మా సర్వీసెస్‌ మార్కెట్‌ విలువ రూ.16,500 కోట్ల వరకు ఉందని వివరించారు. తెలంగాణలో 800కి మించి లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలున్నాయన్నారు. 

ఏడోవంతు ఖర్చుతోనే జనరిక్‌ ఔషధాలు

ప్యానల్‌ కో కన్వీనర్, ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ మణి కంటిపూడి మాట్లాడుతూ.. నూతన ఔషధ ఆవిష్కరణ అనేది సవాళ్లతో కూడుకున్నదని, దీనికి రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతుందని, పదేళ్ల సమయమూ పడుతుందన్నారు. అదే జనరిక్‌ ఔషధాన్ని దాదాపు రూ.3,000 కోట్ల ఖర్చుతో, రెండు మూడేళ్లలోనే తీసుకొచ్చేందుకు వీలవుతుందన్నారు. పెట్టుబడులు, సమయం సంస్థ విజయంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఫార్మా సర్వీసెస్‌ కంపెనీలను ఏకం చేసేందుకు కొత్తగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఔషధాలను అభివృద్ధి చేసేందుకు ఇది కృషి చేస్తుందన్నారు. ఫార్మా సేవల కాంట్రాక్టులను ఇతర దేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చే లక్ష్యంగా పనిచేస్తామని వివరించారు. పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఫార్మా సేవల పార్కు లేదా సరళీకృత నిబంధనలతో కూడిన క్లస్టర్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు. 

అనుమతులు సులభతరం కావాలి

సాయి లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ, ఎండీ కృష్ణ కనుమూరి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో క్లినికల్‌ పరీక్షలు, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేయాలని తెలిపారు. ఆరిజీన్‌ ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌ సీఈఓ అఖిల్‌ రావి మాట్లాడుతూ.. ఫార్మా సేవల రంగంలో చైనాకు దీటుగా మన వ్యవస్థను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి ప్రక్రియలలో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచేందుకు సంస్థలు కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించాలని గీతం బయోసైన్సెస్‌ సహ వ్యవస్థాపకుడు గణేశ్‌ సాంబశివం సూచించారు. ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ జనరల్‌ సెక్రటరీ మాట్లాడుతూ.. ఆవిష్కరణలు, నాణ్యత, ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు వేసుకోవాలని తెలిపారు. సింజీన్‌ ఇంటర్నేషనల్‌ సీఈఓ జోనాథన్‌ హంట్‌ మాట్లాడుతూ.. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించేందుకు విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.


సంపూర్ణ సహకారం

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు

 ‘అధునాతన పరిశోధన, తయారీని ప్రోత్సహించేందుకు ఫార్మా సేవల సంస్థలు ఏర్పాటు చేయబోతున్న సంఘానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. ఫార్మా సేవలకు హైదరాబాద్‌ను మించిన మెరుగైన ప్రదేశం మరోటి లేదు. ప్రంపంచ స్థాయి మౌలిక వసతులు, నిపుణుల లభ్యత, పరిశోధనా సంస్థలు లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి అనుకూలంగా ఉన్నాయి. హైదరాబాద్, తెలంగాణలను గ్లోబల్‌ హబ్‌గా మార్చేందుకు పరిశ్రమతో కలిసి పనిచేస్తాం’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని