Today Stock Market: గరిష్ఠాల్లో లాభాల స్వీకరణ

గరిష్ఠ స్థాయుల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇటీవల బాగా పెరిగిన లోహ, వాహన, ఐటీ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది.

Published : 11 Jul 2024 02:32 IST

సమీక్ష

రిష్ఠ స్థాయుల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇటీవల బాగా పెరిగిన లోహ, వాహన, ఐటీ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతలపై అనిశ్చితి పెరగడంతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 83.51 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.24% లాభంతో 84.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌ నష్టపోగా, సియోల్, టోక్యో లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

 • సెన్సెక్స్‌ ఉదయం 80,481.36 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠంతో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఒకదశలో 915.88 పాయింట్లు నష్టపోయి 79,435.76 వద్ద కనిష్ఠానికి చేరింది. మళ్లీ కోలుకుని 426.87 పాయింట్ల నష్టంతో 79,924.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 108.75 పాయింట్లు కోల్పోయి 24,324.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,141.80-24,461.05 పాయింట్ల మధ్య కదలాడింది. 

 • ఎస్‌యూవీ మోడల్‌ ఎక్స్‌యూవీ700 ధరను తగ్గించడంతో ఎం అండ్‌ ఎం షేరు 6.62% క్షీణించి రూ.2,732.10 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.24,087.15 కోట్లు తగ్గి రూ.3.39 లక్షల కోట్లకు చేరింది.
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 డీలాపడ్డాయి. టాటా స్టీల్‌ 2.21%, టీసీఎస్‌ 2.05%, ఎస్‌బీఐ 1.38%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.36%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.07%, టాటా మోటార్స్‌ 0.92%, కోటక్‌ బ్యాంక్‌ 0.89%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.63% నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 3.10%, పవర్‌గ్రిడ్‌ 1.53%, ఎన్‌టీపీసీ 1.22%, హెచ్‌యూఎల్‌ 0.82% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో.. వాహన 1.65%, లోహ 1.60%, ఐటీ 0.99%, కమొడిటీస్‌ 0.87%, వినియోగ 0.78%, టెక్‌ 0.76%, పరిశ్రమలు 0.62% పడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీస్, విద్యుత్‌ రాణించాయి. బీఎస్‌ఈలో 2612 షేర్లు నష్టపోగా, 1326 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 83 షేర్లలో ఎటువంటి మార్పులేదు.

మెరిసిన బన్సల్‌ వైర్‌ షేర్లు: స్టీల్‌ వైర్‌ తయారీ సంస్థ బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు అరంగేట్రంలో మెరిశాయి. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.256తో పోలిస్తే 37.51% లాభంతో రూ.352.05 వద్ద షేరు ప్రారంభమైంది. ఇంట్రాడేలో 44% దూసుకెళ్లి రూ.368.70 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 36.83 శాతం పెరిగి రూ.350.30 వద్ద ముగిసింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5,484.15 కోట్లుగా నమోదైంది.

 • ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ షేరు ఇష్యూ ధర రూ.1008తో పోలిస్తే 31.45% లాభంతో రూ.1,325.05 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.1,384 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 34.80% లాభంతో రూ.1,358.85 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.25,696.63 కోట్లుగా నమోదైంది.
 • మౌలిక బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. మౌలిక, అందుబాటు రుణాల విభాగంలో రుణాలు ఇచ్చేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపింది.
 • బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.766 కోట్ల ఆర్డరును రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌తో కూడిన తమ కన్సార్షియం దక్కించుకున్నట్లు సీమెన్స్‌ ప్రకటించింది.
 • దీర్ఘకాల గుండె జబ్బు చికిత్సలో వినియోగించే జనరిక్‌ సకుబుట్రిల్, వల్సార్టాన్‌ ట్యాబ్లెట్‌ల విక్రయానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తమకు తుది అనుమతి లభించిందని జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ పేర్కొంది.
 • సెంట్‌కార్ట్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసెస్‌ను తమ మాతృసంస్థ ఆరీస్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసిందని క్యాషీ తెలిపింది. తద్వారా ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు వివరించింది.
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ గృహ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సిగ్నేచర్‌ గ్లోబల్‌ ఛైర్మన్‌ ప్రదీప్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. 
 • ఎయిరిండియా-విస్తారా విలీనం వల్ల దాదాపు 600 మంది నాన్‌ ఫ్లైయింగ్‌ సిబ్బందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. వీరికి ఎయిరిండియా గ్రూప్‌ లేదా టాటా కంపెనీల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని సంబంధింత వర్గాలు తెలిపాయి. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా, విస్తారాల్లో 23,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు గ్రూపుల్లో పనిచేసే వీలు లేకపోతే, అటువంటి వారికి ప్రత్యేక పదవీ విరమణ ప్యాకేజీని అందించనున్నట్లు సమాచారం. ఈ విలీనం సెప్టెంబరు చివర్లో లేదా అక్టోబరు ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉంది.
 • భారత్‌లో హరిత ఇంధన ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు డాయిష్‌ బ్యాంక్‌ గిఫ్ట్‌ సిటీ శాఖ నుంచి 31.96 బిలియన్‌ జపాన్‌ యెన్‌లు (దాదాపు రూ.1660 కోట్లు) రుణాన్ని పొందినట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఈసీ తెలిపింది. 
 • 2024-25లో వివిధ పద్ధతుల్లో రుణాలు తీసుకునే పరిమితిని రూ.12000 కోట్ల నుంచి రూ.15000 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనకు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. 2025-26లో రుణాల పరిమితిని బోర్డు రూ.16000 కోట్లుగా నిర్ణయించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని