Adani Capital IPO: అదానీ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ.. ఎప్పుడంటే?

Adani Capital IPO: ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ నుంచి మరో కంపెనీ ఐపీఓకి రానుంది.

Published : 28 Jul 2022 18:43 IST

ముంబయి: ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ (Adani Group) నుంచి మరో కంపెనీ ఐపీఓ (IPO)కి రానుంది. 2024 కల్లా బ్యాంకింగేతర సంస్థ అయిన అదానీ క్యాపిటల్‌ (Adani Capital)ను పబ్లిక్‌ ఆఫర్‌కు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ గౌరవ్‌ గుప్తా వెల్లడించారు. 10 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

రైతులు; చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందిస్తున్న అదానీ క్యాపిటల్‌ (Adani Capital)మార్కెట్‌లో తన వాటాను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా రూ.30,000 నుంచి రూ.3 లక్షల రుణాల సెగ్మెంట్‌ను ఆకర్షించే యోచనలో ఉంది. ఈ క్రమంలో సాంకేతికతను వినియోగించుకుంటోంది. ఎలాంటి మధ్యవర్తులు, లోన్‌ ఏజెంట్లు లేకుండా నేరుగా రుణగ్రహీతలకే రుణాలు అందజేస్తోంది. 2017లో ప్రారంభమైన ఈ కంపెనీ 2021, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.16.3 కోట్ల నికర ఆదాయాన్ని నివేదించింది.

అదానీ క్యాపిటల్‌ (Adani Capital)కు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో 154 శాఖలు ఉన్నట్లు గుప్తా తెలిపారు. దాదాపు 60 వేల మందికి రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నిరర్థక ఆస్తుల విలువ 1 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.3000 కోట్ల రుణ వితరణను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏటా లోన్‌బుక్‌ను రెండింతలు చేయాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని