Adani Group: డోజోన్స్‌ కీలక సూచీ నుంచి ‘అదానీ’ ఔట్‌..!

Adani Group: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తమ సస్టైనబిలిటీ ఇండిసెస్‌ నుంచి తొలగిస్తున్నట్లు డోజోన్స్‌ ఎస్‌అండ్‌పీ తెలిపింది.

Updated : 03 Feb 2023 13:06 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా ఈ స్టాక్స్‌ భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను ‘సస్టైనబిలిటీ సూచీ’ నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ డోజోన్స్‌ వెల్లడించింది. అందుకనుగుణంగా ‘డోజోన్స్‌ సస్టైనబిలిటీ సూచీ (Dow Jones sustainability indices)’కి ఫిబ్రవరి 7న సవరణలు చేయనున్నట్లు పేర్కొంది.

నెలరోజుల్లో 70% డౌన్‌..

మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) సహా అదానీ పోర్ట్‌, అంబుజా సిమెంట్‌ షేర్లను ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి తెచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. ఈ షేర్లలో ఇంట్రాడేలో ట్రేడ్‌ చేయాలంటే ట్రేడర్లకు ముందస్తుగా 100 శాతం మార్జిన్‌ అవసరం. ఇందువల్ల కొంత మేర షార్ట్‌ సెల్లింగ్‌కు అడ్డుకట్ట పడుతుంది. ఈ పరిణామాల మధ్య అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) షేరు శుక్రవారం 15 శాతం నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తర్వాత ట్రేడింగ్‌లో 30 శాతం వరకు కుంగి రూ.1,017.45 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ దాదాపు 70 శాతం కుంగిపోవడం గమనార్హం. గత ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లలో అదానీ గ్రూప్‌ (Adani Group)లోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.8.76 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఈ రోజు కూడా షేర్ల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్ల సంపద మరింత తరిగిపోతోంది.

ఇన్వెస్టర్లలో విశ్వాసం కోసం...

అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. మరోవైపు షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు గౌతమ్‌ అదానీ (Gautam Adani) పలు చర్యలకు ఉపక్రమించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. ఈ మేరకు రుణదాతలతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. రుణ చెల్లింపులను ముందుగానే చేసేసి తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, షేర్లు భారీగా పతనమైనప్పుడు రుణదాతలు హెచ్చరికగా మార్జిన్‌ కాల్స్‌ జారీ చేస్తుంటారు. అంటే అదనంగా నగదుగానీ, సెక్యూరిటీలనుగానీ డిపాజిట్‌ చేయమని కోరతారు. ఇప్పటి వరకు ఏ రుణసంస్థ కూడా అదానీ గ్రూప్‌ కంపెనీలకు మార్జిన్‌ కాల్‌ ఇవ్వలేదని తెలుస్తోంది.

మరోవైపు అమెరికా డాలర్‌ బాండ్లకు అవసరమైన కూపన్‌ చెల్లింపులను అదానీ కంపెనీలు గురువారం గడువులోగా చెల్లించేసినట్లు ఓ బాండ్‌హోల్డర్‌ను ఉటంకిస్తూ రాయిటార్స్‌ తెలిపింది. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ అదానీ గ్రూప్‌ శుక్రవారం ఓ క్రెడిట్‌ రిపోర్టును విడుదల చేసే అవకాశమూ ఉందని సమాచారం.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో బంగ్లాదేశ్‌ సవరణలు..

అదానీ పవర్‌తో 2017లో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో సవరణలు కోరినట్లు బంగ్లాదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. విద్యుత్‌ ధర చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలిపారు. బొగ్గుకు అదానీ పవర్‌ అధిక ధర వెచ్చించాల్సి రావడం వల్లే ఈ ధర ఎక్కువగా ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని