Adani FPO: మెగా ఎఫ్‌పీఓకు ‘అదానీ’ సన్నాహాలు!

Adani FPO: వాటాదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం అదానీ గ్రూప్‌ ఎఫ్‌పీఓకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ.20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 23 Nov 2022 20:27 IST

దిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ త్వరలో మలి విడత పబ్లిక్‌ ఇష్యూ (FPO-ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. దాదాపు రూ.20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి ఆమోదం తెలిపేందుకు కంపెనీ బోర్డు శుక్రవారం భేటీ కానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే.. దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఎఫ్‌పీఓగా రికార్డు సృష్టిస్తుంది. 2020లో యెస్‌ బ్యాంక్‌ సమీకరించిన రూ.15,000 కోట్లే ఇప్పటి వరకు అతిపెద్ద ఎఫ్‌పీఓగా ఉంది.

ప్రైమ్‌ డేటాబేస్‌ వివరాల ప్రకారం.. దేశంలో తొలి తొమ్మిది అతిపెద్ద ఎఫ్‌పీఓల జాబితాలో బ్యాంకింగ్‌, ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే ఉన్నాయి. బాబా రామ్‌దేవ్‌ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన రుచి సోయా ఈ ఏడాదిలోనే ఎఫ్‌పీఓ ద్వారా రూ.4,300 కోట్లు సమీకరించింది. ఇది పదో అతిపెద్ద ఎఫ్‌పీఓ. స్టాక్‌ మార్కెట్‌ నమోదిత కంపెనీలు సాధారణంగా ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా నిధుల్ని సమీకరిస్తుంటాయి. ఎఫ్‌పీఓలతో పోలిస్తే ఇది చాలా సులభమైన మార్గం. అలాగే వేగంగానూ పూర్తవుతుంది. అదే ఎఫ్‌పీఓలో సెబీకి దరఖాస్తు చేసుకోవడం, తనిఖీ, అనుమతులు పేరిట దాదాపు మూడు నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓవైపే మొగ్గుచూపడానికి కారణం ఉందని పలువురు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. వాటాదారులను పెంచుకోవడంలో భాగంగానే అదానీ గ్రూప్‌ ఈ మార్గం ఎంచుకుందని తెలిపారు. కంపెనీ వాటాలు కేంద్రీకృతమై ఉన్నాయన్న విమర్శలు తమపై ఉన్నాయని.. దానికి త్వరలోనే పరిష్కారం చూపబోతున్నామని ఇటీవల కంపెనీ ఓ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. తాజాగా ఎఫ్‌పీఓ వల్ల రిటైల్‌ మదుపర్లకు వాటా లభిస్తుంది. అదే ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌కు వెళితే మళ్లీ సంస్థాగత మదుపర్ల వాటాలే పెరిగే అవకాశం ఉంది.

2022 సెప్టెంబరు నాటికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో అదానీ గ్రూప్‌ వాటా 72.63 శాతం. ఎల్‌ఐసీ, ఎలారా, ఎల్‌టీఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, వెస్పెరా ఫండ్‌ సహా మరికొన్ని సంస్థలకు కలిపి 15 శాతం వాటాలున్నాయి. కేవలం 2.22 శాతం వాటాలు మాత్రమే వ్యక్తిగత మదుపర్ల వద్ద ఉన్నాయి. తాజా ఎఫ్‌పీఓ ద్వారా ఈ వాటాదారుల సంఖ్య పెరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని