Adani group: అదానీ గ్రూప్‌నకు సిటీ బ్యాంక్‌ షాక్‌.. కొనసాగుతున్న షేర్ల పతనం!

Adani group: స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ ఆ గ్రూప్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఏసీసీ, అంబుజా షేర్లు మినహా అన్ని షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Updated : 02 Feb 2023 14:09 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ (Adani group) షేర్లలో మొదలైన నష్టాల పరంపర ఇంకా కొనసాగుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సహా ఆ గ్రూప్‌నకు చెందిన స్టాక్స్‌లో గురువారం అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయిన ఎఫ్‌పీఓను (FPO) అదానీ గ్రూప్‌ నిలిపివేయడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇంకో వైపు సిటీ బ్యాంక్‌ గ్రూప్‌ సైతం అదానీ గ్రూప్‌నకు షాకిచ్చింది. అదానీ గ్రూప్‌ సెక్యూరిటీస్‌పై తమ క్లయింట్లకు రుణాలు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆర్‌బీఐ సైతం రంగ ప్రవేశం చేసినట్లు సమాచారం. 

రూ.20వేల కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బుధవారం ఉపసంహరించుకుంది. స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాటాదారులకు సొమ్ము తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు బీఎస్‌ఈలో ఏకంగా 15 శాతం కుంగి రూ.1809.40 వద్ద కొనసాగుతోంది. గ్రూప్‌ స్టాక్స్‌లో సైతం నష్టాల పరంపర కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్‌ 14 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 10 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 10 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 10 శాతం, అదానీ విల్మర్‌ 5 శాతం, ఎన్డీటీవీ 4.99 శాతం, అదానీ పవర్‌ 4.98 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంబుజా, ఏసీసీ షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పటి వరకు అదానీ గ్రూప్‌నకు చెందిన 100 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది.

సిటీ గ్రూప్‌ షాక్‌..

అదానీ గ్రూప్‌ కంపెనీలకు చెందిన సెక్యూరిటీస్‌పై తమ క్లయింట్లకు ఎలాంటి మార్జిన్‌ రుణాలు ఇవ్వకూడదని సిటీ గ్రూప్‌నకు చెందిన వెల్త్‌ యూనిట్‌ నిర్ణయించినట్లు తెలిసింది. క్రెడిట్‌ సూయిజ్‌ ఏజీ సైతం అదానీ గ్రూప్‌ బాండ్లపై రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. బాండ్లకు విలువను జీరోగా పేర్కొంది.

ఆర్‌బీఐ ఎంట్రీ..!

అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌లో ఆ గ్రూప్‌ షేర్ల పతనం కొనసాగుతున్న వేళ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం రంగ ప్రవేశం చేసినట్లు తెలిసింది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు ఏయే బ్యాంకులు ఎంత రుణం ఇచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే, ఆర్‌బీఐ మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని