NDTV Acquisition: అదానీ చేతికి రాధికా, ప్రణయ్‌ రాయ్‌ల వాటాలు

ఎన్టీటీవీ వ్యవస్థాపకులు రాధికా, ప్రణయ్‌ రాయ్‌ వద్ద నుంచి మెజారిటీ వాటాల కొనుగోలును అదానీ గ్రూప్‌ పూర్తి చేసింది. ఒక్కో షేరుకు రూ.342 చొప్పున మొత్తం ఇరువురికీ రూ.600 కోట్లు చెల్లించింది.

Published : 30 Dec 2022 18:23 IST

దిల్లీ: న్యూదిల్లీ టెలివిజన్‌లో (NDTV) మెజారిటీ వాటాలను అదానీ గ్రూప్‌ (Adani Group) సొంతం చేసుకుంది. ఛానల్‌ వ్యవస్థాపకులైన రాధికా, ప్రణయ్‌ రాయ్‌లకు చెందిన 27.26 శాతం వాటాల కొనుగోలు చేసినట్లు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎన్డీటీవీలో తమకున్న 32.26 శాతం వాటాల్లో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించనున్నట్లు రాధికా, ప్రణయ్‌ రాయ్‌ డిసెంబర్‌ 23న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటాల కొనుగోలును డిసెంబర్‌ 30న బ్లాక్‌ డీల్‌ విండో ద్వారా పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది. ఒక్కో షేరుకు రూ.342.65 చొప్పున మొత్తం 1.75 కోట్ల విలువైన షేర్లకు గానూ రూ.602.30 కోట్లను రాధికా, ప్రణయ్‌ రాయ్‌లకు చెల్లించింది.

ఎన్డీటీవీ ప్రమోటర్‌ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌కు గతంలో రుణం ఇచ్చిన కంపెనీని అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఆ కంపెనీ రుణాన్ని ఈ ఏడాది ఆగస్టులో వాటాలుగా మార్చడంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్‌ వాటాలు పొందింది. అనంతరం 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీంతో మొత్తం 37.44 శాతం వాటాలను పొందింది. తాజా కొనుగోలు ద్వారా 60 శాతానికి పైగా వాటాలతో అదానీ ఎన్డీటీవీపై పూర్తి యాజమాన్య హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే అదానీ గ్రూప్‌ సంజయ్‌ పుగాలియా, సెంథిల్‌ సిన్హయ్య చెంగల్వారాయన్‌ను ఎన్డీటీవీ బోర్డు డైరెక్టర్లుగా నియమించింది. ప్రణయ్‌ రాయ్‌ ఎన్డీటీవీ ఛైర్‌పర్సన్‌గా, ఆయన భార్య రాధికా రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని