Adani Group: ఆడిట్‌ చేయించడం లేదు.. అవన్నీ అవాస్తవాలే: అదానీ గ్రూప్‌

Adani Group: ఆడిట్‌ సంస్థను నియమించుకుంటున్నట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. ఆ వార్తలు అవాస్తవమని పేర్కొంది.

Published : 16 Feb 2023 16:48 IST

దిల్లీ: హిండెన్‌ బర్గ్‌ రీసెర్చి (Hindenburg research) ఇచ్చిన నివేదిక నేపథ్యంలో తమ సంస్థలను ఆడిట్‌ సంస్థతో ఆడిటింగ్‌ నిర్వహించేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) నిర్ణయించిందంటూ వచ్చిన వార్తలను ఆ సంస్థ ఖండించింది. మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ అవాస్తవమని పేర్కొంది. తాము ఎలాంటి ఆడిట్‌ సంస్థనూ నియమించుకోలేదని, అదంతా మర్కెట్‌ రూమర్ అని పేర్కొంది. ఈ మేరకు బీఎస్‌ఈకి ఇచ్చిన ఫైలింగ్‌లో పేర్కొంది. ఎప్పటిలానే సెబీతో పూర్తి వివరాలు పంచకుంటామని తెలిపింది.

అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలను దీటుగా ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్‌ ఆడిట్‌ మార్గాన్ని చేపట్టిందంటూ వార్తలు వచ్చాయి. గ్రూప్‌లోని కొన్ని కంపెనీలపై స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్టన్‌ను నియమించిందన్నది ఆ వార్తల సారాంశం. గ్రూప్‌ అన్ని చట్టాలను పాటిస్తోందని, ఏ విషయాలనూ దాచిపెట్టలేదని ఆర్‌బీఐ వంటి నియంత్రణ సంస్థలకు నిరూపించడమే దీని ఉద్దేశమని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను అదానీ గ్రూప్‌ ఖండించింది. మరోవైపు అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో బుధవారం మిక్స్‌డ్‌ ట్రెండ్‌ కనిపిస్తోంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ నష్టాల్లో కొనసాగుతుండగా.. మిగిలిన షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని