Adani group: అదానీ గ్రూప్‌ చేతికి పెన్నా సిమెంట్‌

 హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ను అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్‌ రూ.10,422 కోట్లకు కొనుగోలు చేస్తోంది.

Published : 14 Jun 2024 02:26 IST

లావాదేవీ విలువ రూ.10,422 కోట్లు
ఈనాడు, హైదరాబాద్‌

 హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ను అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్‌ రూ.10,422 కోట్లకు కొనుగోలు చేస్తోంది. దీంతో అంబుజా సిమెంట్స్‌కు 14 మిలియన్‌ టన్నుల వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం దక్కింది. ఫలితంగా అదానీ గ్రూపు  సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్‌ టన్నులకు చేరడంతో, దేశీయంగా రెండో అతిపెద్ద సిమెంటు సంస్థగా గుర్తింపు సొంతం చేసుకుంటుంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకలో మార్కెట్‌ వాటా పెంచుకునే అవకాశం తాజా కొనుగోలు వల్ల అదానీ గ్రూపునకు లభిస్తుంది. పెన్నా సిమెంట్‌కు శ్రీలంకలో ఒక అనుబంధ కంపెనీ ఉండటమే ఇందుకు కారణం. పెన్నా సిమెంట్‌కు ఉన్న సున్నపు రాయి గనులు కూడా అంబుజా సిమెంట్స్‌కు లభిస్తాయి. 

పూర్తిగా సొంత నిధులతోనే

పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌లో 100% వాటా కొనుగోలు చేయటానికి, ఆ సంస్థ ప్రమోటర్‌ పి.ప్రతాప్‌ రెడ్డి, ఆయన కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అంబుజా సిమెంట్స్‌ గురువారం వెల్లడించింది. పూర్తిగా సొంత నిధులతో పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంబుజా సిమెంట్స్‌ సీఈఓ అజయ్‌ కపూర్‌ వెల్లడించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్‌లోనూ అంబుజా సిమెంట్స్‌ ఉన్నట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. తమ విస్తరణ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

రూ.1241 కోట్ల టర్నోవర్‌

 పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ 2023-24లో రూ.1,241 కోట్ల ఏకీకృత టర్నోవర్‌ నమోదు చేసింది. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో సిమెంటు యూనిట్లు ఉన్నాయి. ఏటా 14 మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. ప్రస్తుతం 10 మిలియన్‌ టన్నుల మేర ఉత్పత్తి కార్యకలాపాలు సాగుతున్నాయి. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్‌)లో 2 మిలియన్‌ టన్నులు, జోధ్‌పూర్‌ (రాజస్థాన్‌)లో 2 మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ యూనిట్లు ఉత్పత్తి దశలోకి వస్తాయి. 

అదానీ గ్రూప్‌నకు ప్రయోజనం ఇలా

 అదానీ గ్రూపులోని సముద్ర రవాణా సదుపాయాల విభాగానికి కోల్‌కతా, గోపాల్‌పూర్, కరైకల్, కోచి, కొలంబోలలో బల్క్‌ సిమెంట్‌ టెర్మినళ్లు ఉన్నాయి. పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేయడం వల్ల ఈ టెర్మినళ్లు సమర్థంగా పనిచేసే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా సిమెంటు రంగంలో అదానీ గ్రూపు మార్కెట్‌ వాటా 2%, దక్షిణాదిలో 8% పెరుగుతాయి. 

2028కి 140 టన్నుల సామర్థ్యం లక్ష్యం

 అదానీ గ్రూపు సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. 2028 నాటికి 140 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని, దేశీయ సిమెంటు మార్కెట్లో 20% వాటా సొంతం చేసుకోవాలని అదానీ గ్రూపు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సొంతంగా కొత్త యూనిట్లు నిర్మిస్తూనే, ఇతర సిమెంటు కంపెనీలనూ కొనుగోలు చేస్తోంది. గత ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో సంఘీ ఇండస్ట్రీస్‌ను రూ.5,185 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పెన్నా సిమెంట్‌ యూనిట్లు, రైల్వే స్లైడింగ్‌ సదుపాయాలతో వ్యూహాత్మకంగా అత్యంత అనుకూల ప్రదేశాల్లో ఉండటం కలిసి రానుంది. సొంత విద్యుదుత్పత్తి కేంద్రాలు, హీట్‌ రికవరీ సదుపాయాలు కూడా దీనికి ఉన్నాయి.  జోధ్‌పూర్‌ యూనిట్లో లభించే మిగులు క్లింకర్‌తో, అదనంగా 3 మిలియన్‌ టన్నుల సిమెంటు గ్రౌండింగ్‌ సామర్థ్యాన్ని సమకూర్చుకోవచ్చు. పెన్నా సిమెంట్‌ పనితీరును గణనీయంగా పెంచడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. 

4 సిమెంటు కంపెనీలు

 అదానీ గ్రూపు చేతిలో ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. పెన్నా సిమెంట్‌ జత కలుస్తోంది. మనదేశంలో ప్రస్తుతం దాదాపు 550 మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇందులో 152 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో అల్ట్రాటెక్‌ సిమెంట్‌  అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది. దాదాపు 89 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో, అతి తక్కువ సమయంలోనే అదానీ గ్రూపు సిమెంటు ఉత్పత్తిలో రెండో స్థానానికి చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని