Adani Stocks: అదానీ స్టాక్స్‌ అతలాకుతలం.. రూ.4 లక్షల కోట్ల నష్టం!

హిండెన్‌బర్గ్‌ (Hindenburg)నివేదిక  నేపథ్యంలో అదానీ గ్రూప్‌ (Adani Group) షేర్లు గత రెండు సెషన్లలో భారీ నష్టాలను చవిచూశాయి.

Published : 27 Jan 2023 18:43 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంవత్సర కాలంగా అదానీ గ్రూప్‌ (Adani Group) స్టాక్స్‌ మదుపర్లను లాభాల్లో ముంచెత్తాయి. ఇదీ, అదీ అని కాకుండా స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన అదానీ స్టాక్స్‌ అన్నీ.. మదుపర్లకు మంచి లాభాలిచ్చాయి. ఈ లాభాల జైత్రయాత్రకు బుధవారం భారీ బ్రేక్‌ పడింది. షేర్ల విలువలు పెంచడంలో అదానీ గ్రూప్‌ (Adani Group) అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌ బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదికే దీనికి కారణం. 32 వేల పేజీల ఆ నివేదిక మదుపర్లకు రూ. 4 లక్షల కోట్ల నష్టాల్ని మిగిల్చింది.

హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీలు బుధవారమే రూ. లక్ష కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయాయి. నివేదికలో పేర్కొన్న అంశాలను గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ (Adani Group) తీవ్రంగా ఖండించింది. తమ షేర్ల విలువలపై ప్రతికూల ప్రభావం పడేలా, నివేదికలోని అంశాలను రూపొందించారని, ఈ క్రమంలో నిరాధార అంశాలను పొందుపరిచారని అదానీ గ్రూప్‌ లీడ్‌ హెడ్‌ జతిన్‌ జలుంధ్వాలా తెలిపారు. పెట్టుబడిదారుల సమూహాన్ని, అదానీ గ్రూప్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఒక విదేశీ సంస్థ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం తమకు బాధ కలిగించిందని వెల్లడించారు. భారత, అమెరికా చట్టాల ప్రకారం హిండెన్‌బర్గ్‌పై చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. 

ఈ నివేదిక విషయంలో సంస్థ స్పందించినప్పటికీ అదానీ గ్రూప్‌ షేర్ల పతనం శుక్రవారమూ కొనసాగింది. మొత్తం 10 నమోదిత సంస్థల్లో 7 కంపెనీల షేర్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. దీంతో రెండు వరుస సెషన్లలో అదానీ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 4 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు 20 శాతానికి పైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 18 శాతం నష్టపోయింది. ఇటీవలే అదానీ గ్రూప్‌లో చేరిన అంబుజా సిమెంట్స్‌ షేరు 17.33 శాతం (షేరు విలువలో సుమారు నాలుగో వంతు) నష్టపోయింది. అదానీ పవర్‌ 5 శాతం, అదానీ విల్మర్‌ 5 శాతం, ఎన్‌డీటీవీ షేరు 4.99 శాతం పతనమై లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ఈ రోజే ప్రారంభమైంది. బుధవారం యాంకర్‌ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రాగా మంచి స్పందన లభించింది. తాజా ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం రిటైల్‌ మదుపర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదని నిపుణులు తెలిపారు. ఈ ఎఫ్‌పీఓ జనవరి 31 వరకు కొనసాగనుంది. ఎఫ్‌పీఓలో ఒక్కో షేరును రూ.3,112 - రూ.3,276 ధరల శ్రేణిలో విక్రయించనున్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం షేరు ధర ఎఫ్‌పీఓ ధర కంటే కిందకు చేరి రూ. 2,768 వద్ద ట్రేడవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని