Adani Group: అదానీ దూకుడు.. మరో సిమెంట్‌ యూనిట్‌ కొనుగోలుకు చర్చలు!

ఇటీవలే సిమెంట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్‌ మరో సిమెంట్‌ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది.

Updated : 10 Oct 2022 14:03 IST

దిల్లీ: అపర కుబేరుడు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ (Adani group) వ్యాపార విస్తరణలో దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే సిమెంట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ గ్రూప్‌.. మరో సిమెంట్‌ యూనిట్‌ను (Cement unit) కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. రుణాల ఊబిలో ఉన్న జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు చెందిన సిమెంట్‌ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ చర్చలు జరుపుతోందని తెలిసింది. సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌తో పాటు, ఇతర ఆస్తుల కొనుగోలుకు అదానీ గ్రూప్‌ రూ.5 వేల కోట్లు వెచ్చించనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని తెలిపారు.

దేశీయ సిమెంట్‌ కంపెనీలైన అంబుజా సిమెంట్‌, ఏసీసీ లిమిటెడ్‌లోని స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ వాటాను ఇటీవల అదానీ గ్రూప్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వార్షికంగా 67.5 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంపెనీగా అదానీ గ్రూప్‌ అవతరించింది. ఆదిత్య బిర్లా కంపెనీ ప్రస్తుతం ఈ వ్యాపారంలో అగ్రగామిగా ఉండగా.. రెండో అతిపెద్ద సిమెంట్‌ ఉత్పత్తి కంపెనీగా అదానీ గ్రూప్‌ నిలిచింది. ఇప్పుడు జేపీ పవర్‌ వెంచర్స్‌కు చెందిన సిమెంట్‌ యూనిట్‌ను కొనుగోలు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని అదానీ గ్రూప్‌ మరింత పెంచుకోనుంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న జేపీ గ్రూప్‌నకు చెందిన నిగ్రీ సిమెంట్‌ యూనిట్‌ ఏడాదికి 2 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. రుణ భారాన్ని దించుకోవడంలో భాగంగా సిమెంట్‌ యూనిట్‌ను విక్రయించాలని   నిర్ణయించినట్లు ఇప్పటికే ఆ కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. అయితే ఎవరికి విక్రయించేదీ అందులో పేర్కొన లేదు. కంపెనీ బోర్డు సైతం విక్రయానికి ఆమోదం తెలిపింది. సిమెంట్‌ యూనిట్‌ కొనుగోలు నిర్ణయం ఓ వారంలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అదానీ గ్రూప్‌ గానీ, జయప్రకాశ్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ గానీ స్పందించలేదు. రాబోయే ఐదేళ్లలో సిమెంట్‌ తయారీ సామర్థ్యాన్ని 140 మిలియన్‌ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్‌ ఇది వరకే ప్రకటించింది. అందులో భాగంగానే సిమెంట్‌ యూనిట్‌ కొనుగోలు దిశగా అడుగులు వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని