Adani Group: అదానీ గ్రూప్‌ మరో రూ.7,374 కోట్ల రుణాల చెల్లింపు

Adani Group: రుణ భారాన్ని తగ్గించుకొని ఇన్వెస్టర్లు, నియంత్రణా సంస్థల్లో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా మరో రూ.7,300 కోట్లు విలువ చేసే రుణాలకు ముందస్తు చెల్లింపులు చేసింది.

Updated : 07 Mar 2023 16:34 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group) తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. నమోదిత కంపెనీల షేర్లు పతనం కావడంతో రూ.లక్షల కోట్ల మార్కెట్‌ విలువ ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్లు, నియంత్రణా సంస్థల్లో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కొన్ని రుణాలను ముందస్తుగానే చెల్లిస్తోంది.

తాజాగా షేర్లు తనఖా పెట్టి తెచ్చిన మరో రూ.7,374 కోట్ల రుణాలను ముందుగానే చెల్లించినట్లు మంగళవారం ప్రకటించింది. 2025 వరకు గడువు ఉన్నప్పటికీ.. రుణాల భారాన్ని తగ్గించుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రమోటర్లు చెల్లింపులు చేసినట్లు పేర్కొంది. చెల్లింపులు అందుకున్న వాటిలో పలు అంతర్జాతీయ బ్యాంకులు, దేశీయ ఆర్థిక సంస్థలు ఉన్నట్లు తెలిపింది. దీంతో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌కు చెందిన 155 మిలియన్‌ షేర్లు, అదానీ ఎంటర్‌ప్రైజ్‌వి 31 మిలియన్‌ షేర్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 36 మిలియన్‌ షేర్లు, అదానీ గ్రీన్‌ ఎనర్జీకి చెందిన 11 మిలియన్‌ షేర్లు బ్యాంకుల నుంచి బయటకు రానున్నాయి. ఫిబ్రవరిలోనూ 1.11 బిలియన్‌ డాలర్లు విలువ చేసే రుణాలను అదానీ గ్రూప్‌ ముందస్తుగా చెల్లించిన విషయం తెలిసిందే.

అదనపు నిఘా నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బయటకు..

‘అదనపు నియంత్రణా నిఘా చర్యల (ASM)’ ఫ్రేమ్‌వర్క్‌ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE), బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (BSE) సోమవారం ప్రకటించాయి. మార్చి 8 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ షేర్ల పతనం నేపథ్యంలో స్టాక్‌ ఎక్స్ఛేంజీలు మూడు కంపెనీల షేర్లను ఏఎస్‌ఎం పరిధిలోకి తీసుకొచ్చాయి. వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అంబుజా సిమెంట్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ఉన్నాయి. అంబుజా, అదానీ పోర్ట్స్‌ను ఫిబ్రవరి 13నే ఏఎస్‌ఎం నుంచి తొలగించాయి. తాజాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు కూడా విముక్తి లభించింది.

షేరు ధరల్లో తేడా, క్లయింట్‌ కాన్సెంట్రేషన్‌, మార్కెట్‌ విలువ, లావాదేవీల సంఖ్యలో వ్యత్యాసం, డెలివరీ శాతం లాంటివి ఒక షేరు ఏఎస్‌ఎం పరిధిలోకి వెళ్లేందుకు కీలక ప్రమాణాలుగా చూస్తారు. ఏఎస్‌ఎం పరిధిలోకి వెళ్లిన షేరులో ట్రేడింగ్‌ చేయాలంటే.. ముందస్తుగా 100 శాతం మార్జిన్‌ అవసరం అవుతుంది. షేరు కదలాడే ధరల శ్రేణి కుదింపు, నికర పద్ధతిలో కాకుండా స్థూల పద్ధతిలో సెటిల్‌మెంట్‌ లాంటి ఆంక్షలు అమలవుతాయి. ఫలానా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే ముప్పు అనే సంకేతం మదుపర్లకు చేరుతుంది. 100% మార్జిన్‌ అవసరం కనుక, ఆ షేర్లలో ట్రేడింగ్‌ తగ్గుతుంది. దీని ద్వారా షార్ట్‌ సెల్లింగ్‌ను నియంత్రించొచ్చు. ఏఎస్‌ఎం పరిధిలోని షేర్లను తనఖా పెట్టడం.. వాటిపై రుణాలు తీసుకోవడం కుదరదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని