Adani Group: అదానీ గ్రూప్‌ కీలక నిర్ణయం..ముంద్రా పెట్రోకెమ్‌ ప్రాజెక్టు పనులు నిలిపివేత!

Adani Group: అప్పులు భారీగా ఉన్నాయనే ఆరోపణలను తుడిచిపెట్టడం కోసం అదానీ గ్రూప్‌ కొత్త ప్రాజెక్టులను చేపట్టడం నిలిపివేసింది. అందులో భాగంగానే తాజాగా ముంద్రా ప్రాజెక్టును పక్కన పెట్టింది.

Published : 19 Mar 2023 17:15 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్‌ (Adani Group)ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని రంగాల్లో కొత్త ప్రాజెక్టులేమీ చేపట్టబోమని ప్రకటించిన ఈ గ్రూప్‌.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని ముంద్రాలో చేపట్టిన రూ.34,900 కోట్ల విలువ చేసే పెట్రో కెమికల్‌ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ముంద్రా పెట్రోకెమ్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2021లో ప్రకటించింది. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌కు చెందిన స్థలంలో దీన్ని నెలకొల్పనున్నట్లు తెలిపింది. బొగ్గు నుంచి పీవీసీ వరకు ఉత్పత్తి చేసేలా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత కంపెనీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ 140 బిలియన్‌ డాలర్ల వరకు ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం కోసం అదానీ గ్రూప్‌ (Adani Group) పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. షేర్లను తనఖా పెట్టి తెచ్చిన రుణాలను తిరిగి చెల్లించేసింది. అప్పులు భారీగా ఉన్నాయనే ఆరోపణలను తుడిచిపెట్టడం కోసం కొత్త ప్రాజెక్టులను చేపట్టడం నిలిపివేసింది. అందులో భాగంగానే తాజాగా ముంద్రా ప్రాజెక్టును పక్కన పెట్టింది.

ప్రాజెక్టుకు వనరులను సమకూరుస్తున్న విక్రేతలు, సరఫరాదారులు వెంటనే అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని అదానీ గ్రూప్‌ (Adani Group) వారికి సమాచారం అందజేసింది.  అనూహ్య ఘటన వల్ల కొన్ని ప్రాజెక్టులను పునఃసమీక్షించాల్సి వస్తున్నట్లు స్పష్టం చేసింది. భవిష్యత్‌ నగదు లభ్యత, ఆర్థిక వనరుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని