Adani Group: పర్యావరణ హిత ఇంధనంలోకి మారడానికి 100 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తాం: అదానీ

భవిష్యత్తులో ఇంధన మార్పిడి రంగంలో గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ 100 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. 

Published : 19 Jun 2024 16:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పర్యావరణహిత ఇంధనంలోకి మార్పు చెందే ప్రాజెక్టులపై అదానీ గ్రూప్‌ (Adani Group) 100 బిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించనున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ బుధవారం వెల్లడించారు. ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్‌- ది క్యాటలిస్ట్‌ ఫర్‌ ఇండియాస్‌ ఫ్యూచర్‌’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన ప్రతిఒక్క పరికరాన్ని తయారుచేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సంస్థ భారీఎత్తున సౌర, పవన విద్యుత్తు తయారీ ప్రాజెక్టులను నిర్మించింది. తాజాగా హైడ్రోజన్‌ నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ఎలక్ట్రోలైజర్స్‌, గాలిమరలకు సంబంధించిన టర్బైన్లు, సోలార్‌ ప్యానల్స్‌ తయారీపై దృష్టిసారించింది.  

పర్యావరణహిత ఇంధనంలోకి మార్పు, డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో ట్రిలియన్‌ డాలర్ల వ్యాపార అవకాశాలున్నాయని అదానీ జోస్యం చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ఇవి పూర్తిగా మార్చేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా గ్రీన్‌ ఎలక్ట్రాన్‌ను తయారుచేయాలనుకొంటున్నట్లు వెల్లడించారు. 

ఇప్పటికే తాము కచ్‌లోని ఖావుడాలో అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టు చేపట్టిన విషయాన్ని అదానీ గుర్తు చేశారు. ఈ ఒక్కచోటే 30 గిగావాట్ల విద్యుత్తు తయారుచేస్తున్నట్లు వివరించారు. 2030 నాటికి దీనిని 50 గిగా వాట్లకు తీసుకెళతామన్నారు. పర్యావరణహిత ఇంధనంలోకి మార్పు రంగం విలువ 3 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని అదానీ అంచనా వేశారు. ఇది 2030 నాటికి 6 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందన్నారు. ఇక డేటా ఇన్ఫ్రాపై అదానీ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతీ పనికి డేటా సెంటర్లు కేంద్రంగా మారతాయన్నారు. మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, డీప్‌ లెర్నింగ్‌ వంటివి మొత్తం వీటి ఆధారంగా పని చేస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు