Adani Group: 1,114 మి.డాలర్ల ముందస్తు రుణం చెల్లించనున్న అదానీ గ్రూప్‌!

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లను తనఖా నుంచి విడిపించడానికి తమ ప్రమోటర్లు ముందస్తు రుణ చెల్లింపులు చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ సోమవారం వెల్లడించింది.

Updated : 06 Feb 2023 20:09 IST

దిల్లీ: షేర్ల పతనంతో సతమతమవుతున్న అదానీ గ్రూప్‌ కీలక ప్రకటన చేసింది. తమ ప్రమోటర్లు 1,114 మిలియన్‌ డాలర్లు రుణ సంస్థలకు ముందస్తుగా చెల్లించనున్నట్లు తెలిపింది. తద్వారా తనఖా పెట్టిన తమ కంపెనీ షేర్లను విడిపించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 2024వరకు గడువు ఉన్నప్పటికీ.. ముందుగానే చెల్లించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

ప్రమోటర్ల చెల్లింపులు పూర్తయితే 168.27 మిలియన్‌ (12 శాతం) అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, 27.56 మిలియన్ల (3 శాతం) అదానీ గ్రీన్‌, 11.77 మిలియన్ల (1.4 శాతం) అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు తనఖా నుంచి బయటకు రానున్నాయి. షేర్లను పూచీకత్తుగా పెట్టి తీసుకున్న రుణాలను ముందుగానే చెల్లిస్తామని ప్రమోటర్లు గతంలోనే హామీ ఇచ్చినట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది. దీనితో పాటు తాజా మార్కెట్‌ ఒడుదొడుకుల నేపథ్యంలో ఇదే సరైన సమయమని తాము భావించినట్లు పేర్కొంది.

జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదలైంది.  అప్పటి నుంచి అదానీ కంపెనీల షేర్ల పతనం ప్రారంభమైంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్ మినహా మిగిలిన ‘అదానీ’ షేర్లన్నీ లోయర్‌ సర్క్యూట్‌ని తాకడం గమనార్హం. ఇప్పటి వరకు అదానీ గ్రూప్‌లోని నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 50 శాతానికి పైగా ఆవిరైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని