Adani group: 2024లో ‘అదానీ’ 2 బి.డాలర్ల బాండ్లకు చెల్లించాలి!

Adani Group: అదానీ గ్రూప్‌ కంపెనీలు విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా  గతంలో 10 బిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. వీటిలో 2 బిలియన్‌ డాలర్ల బాండ్లకు 2024లో చెల్లింపులు చేయాల్సి ఉందని ఇటీవల నిర్వహించిన రోడ్‌ షోలో గ్రూప్‌ తెలిపింది.

Updated : 05 Mar 2023 18:52 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌ (Adani Group).. 2024లో రెండు బిలియన్ డాలర్ల విలువ చేసే విదేశీ కరెన్సీ బాండ్లకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన రోడ్‌షోల్లో ఇన్వెస్టర్లకు తెలియజేసింది. వీటికి నిధులు ఎలా సమకూర్చుకోనుందో వారికి వివరించింది. ఈ పరిణామం తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్లు పుంజుకున్న విషయం తెలిసిందే.

2015- 2022 మధ్య అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీలు విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా 10 బిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. వీటిలో 1.15 బిలియన్‌ డాలర్లు విలువ చేసే బాండ్లకు 2020, 2022లో గడువు ముగిసింది. 2023లో మాత్రం ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కానీ, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ తీసుకున్న 650 మిలియన్‌ డాలర్లు, అదానీ గ్రీన్‌ ఎనర్జీ తీసుకున్న 750 మిలియన్‌ డాలర్లు, 500 మిలియన్‌ డాలర్ల బాండ్లకు 2024లో చెల్లింపులు చేయాల్సి ఉంది.

ఇలా రానున్న రోజుల్లో చేయాల్సిన చెల్లింపులను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ నోట్ల జారీ, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం నుంచి చెల్లించనున్నట్లు ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్‌ (Adani Group) అధికారులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఆర్థిక పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. సింగపూర్‌, హాంకాంగ్‌లో గ్రూప్‌ ప్రత్యేక రోడ్‌షోలు నిర్వహించిన విషయం తెలిసిందే. వీటిని మార్చి 7 నుంచి 15 మధ్య దుబాయ్‌, లండన్‌, అమెరికాకు కూడా విస్తరించనున్నారు.

రోడ్‌షోలో తెలిపిన వివరాల ప్రకారం 2019లో రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్న అదానీ గ్రూప్‌ (Adani Group) స్థూల రుణాలు 2023 నాటికి రూ.2.21 లక్షల కోట్లకు చేరాయి. విదేశీ కరెన్సీలో ఉన్న ఎలాంటి బాండ్లకు 2025లో చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. 2026లో మరో 1 బిలియన్‌ డాలర్ల బాండ్లకు చెల్లించాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు