Gautam Adani: అదానీ వార్షిక వేతనం రూ.9.26 కోట్లు

దేశంలోని అత్యంత సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.26 కోట్ల వేతనం అందుకున్నారు.

Updated : 24 Jun 2024 03:02 IST

సహచర పారిశ్రామిక వేత్తలు, కంపెనీలోని ఎగ్జిక్యూటివ్‌ల కంటే తక్కువ

దిల్లీ: దేశంలోని అత్యంత సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.26 కోట్ల వేతనం అందుకున్నారు. పరిశ్రమలోని సహచర పారిశ్రామికవేత్తలతో పాటు తన గ్రూప్‌ కంపెనీల్లో పని చేస్తున్న కొంత మంది ఎగ్జిక్యూటివ్‌ల కంటే కూడా ఆయన వేతనం తక్కువ కావడం గమనార్హం. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 నమోదిత కంపెనీలు వార్షిక నివేదికలు విడుదల చేయగా, అందులో రెండు కంపెనీల నుంచే ఆయన వేతనం అందుకున్నట్లు తెలుస్తోంది.

  • అదానీ గ్రూప్‌ సంస్థల్లో ప్రధానమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) వార్షిక నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.19 కోట్ల వేతనం అందుకున్నారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో రూ.27 లక్షలు పొందారు. దీంతో ఆయన మొత్తం రూ.2.46 కోట్లు తీసుకోగా, ఇది అంత క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 3 శాతం తక్కువగా ఉంది.
  • అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) నుంచి రూ.6.8 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. దీంతో ఆయన మొత్తం వేతనం రూ.9.26 కోట్లకు చేరింది. కుటుంబ యాజమాన్యంలో పని చేసే అన్ని పెద్ద సంస్థల అధినేతలతో పోలిస్తే అదానీ వార్షిక వేతనం తక్కువగా ఉంది.
  • దేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సీఎండీ ముకేశ్‌ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ 2022-23 వార్షిక వేతనం రూ.16.7 కోట్ల కంటే అదానీ వేతనం తక్కువగా ఉంది. రాజీవ్‌ బజాజ్‌ (రూ.53.7 కోట్లు), పవన్‌ ముంజాల్‌ (రూ.80 కోట్లు), ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్, ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ ఎస్‌.పరేఖ్‌ల వేతనాల కంటే కూడా అదానీ తక్కువ వేతనం తీసుకున్నారు.
  • ఏఈఎల్‌ బోర్డులో కీలక ఎగ్జిక్యూటివ్, డైరెక్టర్‌గా ఉన్న వినయ్‌ ప్రకాశ్‌ మొత్తం రూ.89.37 కోట్ల వేతనం అందుకోవడం విశేషం. గ్రూప్‌ సీఎఫ్‌ఓ జుగేషిందర్‌ సింగ్‌ రూ.9.45 కోట్ల వేతనం తీసుకున్నారు. అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ సీఈఓ వినీత్‌ ఎస్‌.జైన్‌ రూ.15.25 కోట్లు అందుకున్నారు. వీరి వార్షిక వేతనాలు గౌతమ్‌ అదానీ వేతనం కంటే ఎక్కువగా ఉన్నాయి.
  • ఏఈఎల్‌ నుంచి అదానీ సోదరుడు రాజేశ్‌ మొత్తం రూ.8.37 కోట్ల వేతనం పొందగా (రూ.4.71 కోట్ల కమీషన్‌తో కలిపి), ఆయన మేనల్లుడు ప్రణవ్‌ అదానీ రూ.6.46 కోట్లు (రూ.4.5 కోట్ల కమీషన్‌తో కలిపి) అందుకున్నారు. ఆయన కుమారుడు కరణ్‌ అదానీ ఏపీఎస్‌ఈజెడ్‌ నుంచి రూ.3.9 కోట్ల వేతనం అందుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని