NDTV షేర్లు అమ్మిన వారికి అదానీ గుడ్‌న్యూస్‌.. ఒక్కో షేరుకు ₹48 చెల్లింపు!

ఎన్డీటీవీ ఓపెన్‌ ఆఫర్‌లో షేర్లు విక్రయించిన వారికి అదనపు చెల్లింపులు చేయాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. ఒక్కో షేరుపై రూ.48.65 చొప్పున చెల్లించనుంది.

Updated : 03 Jan 2023 14:43 IST

దిల్లీ: న్యూదిల్లీ టెలివిజన్‌ (NDTV) ఓపెన్‌ ఆఫర్‌లో షేర్లు విక్రయించిన వారికి అదానీ గ్రూప్‌ (Adani Group) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఒక్కో షేరుపై రూ.48.65 చొప్పున చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు రాధికా, ప్రణయ్‌ రాయ్‌లకు చెందిన మెజారిటీ వాటాలను ఒక్కో షేరుకు రూ.342.65 చొప్పున చెల్లించి అదానీ గ్రూప్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతే మొత్తాన్ని ఓపెన్‌ ఆఫర్‌లో షేర్లు విక్రయించిన వారికి చెల్లించాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది.

ఎన్డీటీవీలో రాధికా, ప్రణయ్‌ రాయ్‌లకు చెందిన 27.26 శాతం వాటాలను ఇటీవల అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా ఒక్కో షేరుకు రూ.342.65 చొప్పున మొత్తం 1.75 కోట్ల విలువైన షేర్లకు గానూ రూ.602.30 కోట్లను రాధికా, ప్రణయ్‌ రాయ్‌లకు చెల్లించింది. అయితే, గతంలో ఎన్డీటీవీలో 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆ సమయంలో ఒక్కో షేరుకు రూ.294 చొప్పున చెల్లించింది. ఓపెన్‌ ఆఫర్‌ ధరకు, ప్రమోటర్లకు చెల్లించిన ధరకు మధ్య వ్యత్యాసం ఉండడంతో భవిష్యత్‌లో చిక్కులు తలెత్తకుండా అదనపు చెల్లింపులకు తాజాగా ముందుకొచ్చింది. ఓపెన్‌ ఆఫర్‌లో దాదాపు 50 లక్షలకు పైగా షేర్లను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. మరోవైపు వ్యవస్థాపకుల నుంచి వాటాల కొనుగోలు ద్వారా  60 శాతానికి పైగా వాటాలతో ఎన్డీటీవీపై పూర్తి యాజమాన్య హక్కులను అదానీ సొంతం చేసుకున్నారు. ప్రణయ్‌ రాయ్‌ ఎన్డీటీవీ ఛైర్‌పర్సన్‌గా, ఆయన భార్య రాధికా రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని