Karan Adani: రంగంలోకి అదానీ వారసుడు.. కరణ్‌ అదానీకి సిమెంట్‌ వ్యాపార బాధ్యతలు

Karan Adani: అదానీ గ్రూప్‌ ఇటీవల సొంతం చేసుకున్న సిమెంట్‌ వ్యాపారాన్ని కరణ్‌ అదానీ ముందుండి నడిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Updated : 16 Sep 2022 20:20 IST

దిల్లీ: గౌతమ్‌ అదానీ.. వ్యాపార రంగంలో కొన్నాళ్లుగా విస్తృతంగా వినిపిస్తున్న పేరు. అదానీ గ్రూప్‌ అనగానే ప్రముఖంగా గుర్తొచ్చేదీ ఆయన పేరే. ఆయనకు వారసులు ఉన్నా, వారి పేర్లు పెద్దగా వ్యాపార వర్గాల్లో వినిపించింది లేదు. ఈ క్రమంలో గౌతమ్‌ అదానీ కుమారుడు కరణ్‌ అదానీకి కీలక బాధ్యతలు అప్పగించారు. అదానీ గ్రూప్‌ ఇటీవల సొంతం చేసుకున్న సిమెంట్‌ వ్యాపారాన్ని ఆయన ముందుండి నడిపించనున్నారు. ఈ విషయాన్ని ఆ కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

అదానీ గ్రూప్ ఇటీవల సిమెంట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ సిమెంట్‌ కంపెనీలైన అంబుజా, ఏసీసీ కంపెనీల్లోని స్విట్జర్లాండ్‌కు చెందిన హోలిమ్స్‌ కంపెనీ వాటాను అదానీ గ్రూప్‌ దక్కించుకుంది. ఈ క్రమంలో సిమెంట్‌ వ్యాపార బాధ్యతలను కరణ్‌ అదానీకి అప్పగించాలని గ్రూప్‌ నిర్ణయించింది. అదానీ టేకోవర్‌ పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ రెండు కంపెనీల సీఈఓ, సీఎఫ్‌ఓలు సహా బోర్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వెంటనే కొత్త యాజమాన్యం సభ్యుల నియామకాన్ని చేపట్టింది.

అంబుజా సిమెంట్స్‌కు గౌతమ్‌ అదానీ ఫౌండర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కరణ్‌ అదానీ రెండు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉంటారు. ఏసీసీ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. గౌతమ్‌ అదానీ పెద్ద కుమారుడైన కరణ్‌.. ప్రస్తుతం అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌కు సీఈఓగా ఉన్నారు. ఈ సందర్భంగా రెండు కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్లను కూడా అదానీ గ్రూప్‌ నియమించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అంబుజా బోర్డులో, షెల్‌ ఇండియా మాజీ అధిపతి నితిన్‌ శుక్లా ఏసీసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా ఉంటారు. అంబుజా సిమెంట్‌కు సీఈఓగా అజయ్‌ కుమార్‌, ఏసీసీ సీఈఓగా శ్రీధర్‌ బాలకృష్ణన్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా అంబుుజా సిమెంట్‌కు రూ.20వేల కోట్ల మూలధన సాయం అందించేందుకు కొత్త బోర్డు ఆమోదం తెలిపింది.

వాటాల కొనుగోలు పూర్తి

అంబుజా, ఏసీసీ సిమెంట్‌ కంపెనీల్లో అదానీ గ్రూప్‌ వాటాల కొనుగోలు ప్రక్రియ శుక్రవారంతో పూర్తయ్యింది. అంబుజాలో 63%, ఏసీసీలో 4.5 శాతం వాటాను స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ నుంచి అదానీ గ్రూపునకు చెందిన మారిషస్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ సుమారు రూ.50,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మెజారిటీ వాటా కొనుగోలు నేపథ్యంలో సెబీ నిబంధనల ప్రకారం ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లకు ఓపెన్‌ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. ఇటీవలే ఆ ఆఫర్‌ ముగిసింది కూడా. అయితే, ఓపెన్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ఓపెన్‌ ఆఫర్‌ పూర్తయిన నేపథ్యంలో వాటాల కొనుగోలు ప్రక్రియ తాజాగా పూర్తయ్యింది. దీంతో ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తర్వాత రెండో అతిపెద్ద సిమెంట్‌ తయారీ సంస్థగా అదానీ గ్రూప్‌ అవతరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని