Adani Power Q1 Results: గణనీయంగా పెరిగిన అదానీ పవర్‌ లాభాలు

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అదానీ పవర్‌ లిమిటెడ్‌ లాభాలు గణనీయంగా వృద్ధి చెందాయి....

Published : 03 Aug 2022 18:31 IST

దిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అదానీ పవర్‌ లిమిటెడ్‌ లాభాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ఆదాయం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభాలు రూ.4,779.86 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇవి రూ.278.22 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆదాయం రూ.7,213.21 కోట్ల నుంచి రూ.15,509 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో వ్యయాలు రూ.6,763.50 కోట్ల నుంచి రూ.9,642.80 కోట్లకు చేరాయి.

మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తమ కంపెనీ సమర్థంగా ముందుకెళ్తోందని కంపెనీ ఎండీ అనిల్‌ సర్దానా తెలిపారు. పెరుగుతున్న విద్యుత్తు గిరాకీకి అనుగుణంగా తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నట్లు వెల్లడించారు. కంపెనీ ఎదుర్కొంటున్న నియంత్రణాపరమైన పరిమితులను సైతం క్రమంగా సద్దుగణుగుతున్నాయని తెలిపారు. ఫలితంగా డిమాండ్‌కు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్లేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పవర్‌.. దేశంలో అతిపెద్ద థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి కంపెనీగా ఉంది. కంపెనీకి 13,610 మెగావాట్ల వ్యవస్థాపక విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కేంద్రాలు ఉన్నాయి. గుజరాత్‌లో ప్రత్యేకంగా మరో 40 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని