Adani Power: అదానీ ఖాతాలో మరొకటి.. ₹7,107 కోట్లతో డీబీ పవర్‌ కొనుగోలు

అదానీ తన వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. తాజాగా అదానీ గ్రూప్‌ మరో కొనుగోలుకు సిద్ధమైంది...

Updated : 19 Aug 2022 21:28 IST


దిల్లీ: అదానీ తన వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. అయితే విలీనాలు.. లేదంటే వాటాలు కొనుగోలు అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. తాజాగా అదానీ గ్రూప్‌ మరో కొనుగోలుకు సిద్ధమైంది. ఇంధన రంగంలో ఉన్న డీబీ పవర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ పవర్‌ శుక్రవారం వెల్లడించింది. రూ.7,017 కోట్లకు ఈ డీల్‌ కుదిరినట్లు ఆ కంపెనీ తన బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లింపులు జరపనున్నట్లు తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్గిర్‌ చంపా జిల్లాలో డీబీ పవర్‌ 2× 600 మెగావాట్ల థర్మల్‌విద్యుత్‌ ప్లాంట్‌ను కలిగి ఉంది. 923.5 మెగావాట్ల పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు ఉండగా.. ఆ కంపెనీకి చెందిన నూరు శాతం వాటాలను అదానీ పవర్‌ దక్కించుకోనుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 31 నాటికి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. ఈ కొనుగోలు ద్వారా థర్మల్‌ పవర్‌ సెక్టార్‌లో అదానీ పవర్‌ పరిధి మరింత విస్తరించనుంది.

అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ ఓకే

అంబుజా‌, ఏసీసీ సిమెంట్‌ కంపెనీల్లో వాటా కొనుగోళ్ల విషయంలో అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు కంపెనీల్లో ఉన్న హోలిమ్స్‌కు చెందిన నియంత్రిత వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. హోలిమ్స్‌కు అంబుజాలో 63.11 శాతం, ఏసీసీలో 4.48 శాతం వాటాలు ఉన్నాయి. ఓపెన్‌ ఆఫర్‌కు సెబీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అంబుజా షేరుకు రూ.385, ఏసీసీ షేరుకు రూ.2,300 చొప్పున అదానీ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.31,139 కోట్లు వెచ్చించనుంది. ఆ మేర పబ్లిక్‌ నుంచి 26 శాతం మేర అదానీ గ్రూప్‌ షేర్లు కొనుగోలు చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని