Stock Market: అదానీ షేర్ల పతనం.. 1,000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

Stock Market: హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఇతర ప్రతికూల పరిస్థితులు కూడా జత కావడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి.

Updated : 27 Jan 2023 14:25 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12:38 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1089 పాయింట్లు నష్టపోయి 59115 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 350 పాయింట్లు క్షీణించి 17541 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30సూచీలో టాటా మోటార్స్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,  షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

‘అదానీ’ షేర్ల పతనం..

అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు మదుపర్లను నష్టాల్లో ముంచెత్తుతున్నాయి. షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికే దీనికి కారణంగా తెలుస్తోంది. అదానీ టోటల్‌ గ్యాస్‌ ఓ దశలో ఏకంగా 20 శాతం వరకు నష్టపోవడం గమనార్హం. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 19 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 15.50 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 6.19 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ 5.31 శాతం, అదానీ విల్మర్‌ 5 శాతం, అదానీ పవర్‌ 4.99 శాతం వరకు నష్టాల్ని చవిచూస్తున్నాయి. హిండెన్‌బర్గ్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను చూస్తున్నట్లు అదానీ గ్రూప్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవీ కారణాలే..

అదానీ షేర్ల పతనంతో పాటు బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు, విదేశీ మదుపర్ల విక్రయాలు, బడ్జెట్‌ ముందస్తు అంచనాలు, బాండ్ల రాబడుల్లో పెరుగుదల, చమురు ధరలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని