Adani Group: 2రోజుల్లో ₹82 వేల కోట్లు.. ‘అదానీ’ షేర్లలో అనూహ్య ర్యాలీకి కారణాలేంటి?

Adani Group: అదానీ గ్రూప్‌ షేర్లు గత రెండు రోజుల్లో రూ.82 వేల కోట్లకు పైగా మార్కెట్‌ క్యాప్‌ను జత చేసుకున్నాయి. స్టాక్స్‌ ర్యాలీ వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం..!

Published : 01 Mar 2023 18:16 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్లలో గత రెండు రోజుల్లో ఉపశమన ర్యాలీ కొనసాగుతోంది. కీలక కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) షేరు గత రెండు రోజుల్లో 30 శాతం పుంజుకుంది. మంగళవారం 14 శాతానికి పైగా లాభంతో ముగిసిన ఈ షేరు.. ఈరోజు మరో 15 శాతం లాభపడింది. ఇంట్రాడేలో రూ.1,567 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయినప్పటికీ.. 52 వారాల గరిష్ఠంతో పోలిస్తే మాత్రం ఇంకా 60 శాతం దిగువనే ట్రేడవుతోంది.

అదానీ గ్రూప్‌ (Adani Group) ఆధ్వర్యంలోని 10 కంపెనీల షేర్లు బుధవారం పాజిటివ్‌గానే ముగిశాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ విల్మర్‌ 5 శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి. జనవరి 25న వెలువడ్డ హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీలు దాదాపు 12 లక్షల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి. గత రెండు రోజుల ర్యాలీతో మార్కెట్‌ విలువ మళ్లీ దాదాపు రూ.82,000 కోట్లు పెరగడం విశేషం.

మరి వరుస నష్టాల నుంచి ఈ గ్రూప్‌ స్టాక్స్ బ్రేక్‌ తీసుకోవడానికి దోహదం చేసిన అంశాలేంటో చూద్దాం..

  • ఒడిశాలోని కుట్రుమాలిలో 128 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ బ్లాక్‌ను కేటాయించే విషయంపై తమకు ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌’ అందినట్లు అదానీ గ్రూప్‌ (Adani Group) ప్రకటించింది.
  • కంపెనీల బ్యాలెన్స్‌ షీట్‌, భవిష్యత్తు వృద్ధిపై ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) సింగపూర్‌, హాంకాంగ్‌లలో మూడు రోజుల రోడ్‌షో నిర్వహించింది. రుణాల చెల్లింపులు, నిధుల సమీకరణపై తమ ప్రణాళికలను వివరించింది.
  • మరోవైపు 800 మిలియన్‌ డాలర్ల తాజా రుణ సదుపాయానికి అదానీ గ్రూప్‌ (Adani Group)నకు హామీ లభించినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. ఇది కూడా అదానీ గ్రూప్‌ (Adani Group) స్టాక్స్‌పై మదుపర్ల సెంటిమెంటును పెంచింది. ఈ నిధులను అదానీ గ్రీన్‌ ఎనర్జీకి చెందిన 750 మిలియన్‌ డాలర్ల రుణ పునర్‌వ్యవస్థీకరణకు వినియోగించుకోనున్నట్లు ఇన్వెస్టర్ల రోడ్‌షోలో వెల్లడించినట్లు సమాచారం.
  • ఓ ప్రముఖ సావరీన్‌ వెల్త్‌ ఫండ్‌ నుంచి 3 బిలియన్ డాలర్ల రుణ మంజూరుకు హామీ లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినట్లు రాయిటార్స్ పేర్కొంది. ఈ విషయాలనే అదానీ గ్రూప్‌ (Adani Group) మూడు రోజుల రోడ్‌షోలో ఇన్వెస్టర్లకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే, ఏ సావరీన్‌ ఫండ్‌ నుంచి రుణం లభించనుందనే విషయం మాత్రం తెలియరాలేదు. దీనిపై ఇంకా అదానీ గ్రూప్‌ (Adani Group) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
  • అదానీ గ్రూప్‌ (Adani Group)నకు రుణ సదుపాయం కల్పించిన ఎస్‌బీఐ సహా ఇతర దేశీయ సంస్థలు ఆయా ‘అదానీ’ కంపెనీలకిచ్చిన క్రెడిట్‌ ఫెసిలిటీస్‌ను కొనసాగించాలని నిర్ణయించాయి. వార్షిక సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు