Adani group: పదేళ్లలో అదానీ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి: గౌతమ్‌ అదానీ

రాబోయే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్‌ 100 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుందని ఆ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు.

Updated : 27 Sep 2022 15:49 IST

దిల్లీ: రాబోయే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్‌ 100 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుందని ఆ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. న్యూ ఎనర్జీ, డిజిటల్‌ స్పేస్‌లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. మొత్తం పెట్టుబడిలో 70 శాతం ఎనర్జీ రంగంలోనే పెట్టనున్నట్లు తెలిపారు. సింగపూర్‌లో జరిగిన గ్లోబల్‌ సీఈఓ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యాపార ప్రణాళికను వెల్లడించారు.

న్యూ ఎనర్జీ వ్యాపార విస్తరణలో భాగంగా 45 గిగావాట్స్‌ సామర్థ్యం కలిగిన హైబ్రిడ్‌ పునరుత్పాదక విద్యుదుత్పత్తితో పాటు మూడు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు గౌతమ్‌ అదానీ వెల్లడించారు. సోలార్‌ ప్యానెళ్లు, విండ్‌ టర్బైన్లు, హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్‌ తయారీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న 20 గిగావాట్స్‌ పునరుత్పాదక పోర్ట్‌ఫోలియోకు అదనంగా 45 గిగావాట్స్‌ హైబ్రిడ్‌ పునరుద్పాతక విద్యుదుత్పత్తిని లక్ష హెక్టార్ల స్థలంలో చేపట్టనున్నట్లు చెప్పారు. భారత్‌లో డేటా సెంటర్‌ మార్కెట్‌ భారీ వృద్ధి కనబరుస్తోందని చెప్పారు.

చైనా ఒంటరవుతోంది

భారత వృద్ధికి ఎనలేని అవకాశాలు ఉన్నాయని గౌతమ్‌ అదానీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఒడుదొడుకులు భారత్‌కు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టిందన్నారు. దేశ గ్రోత్‌ స్టోరీ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ఎక్కడాలేని యువ జనాభా కలిగిన భారత్‌.. రాబోయే 30 ఏళ్లపాటు ప్రపంచంపై గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపబోతోందన్నారు. గ్లోబలైజేషన్‌ ఛాంపియన్‌గా ఉన్న చైనా అనేక సవాళ్లు ఎదుర్కోనుందని గౌతమ్‌ అదానీ అంచనా వేశారు. ఆ దేశం ఏకాకిగా మిగుతోందన్నారు. పెరుగుతున్న జాతీయ వాదం, సప్లయ్‌ చైన్‌ అవరోధాలు, టెక్నాలజీ పరిమితులు వంటివి ఆ దేశంపై ప్రభావం చూపనున్నాయని చెప్పారు. చైనా చేపట్టిన బెల్డ్‌ ఆన్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌కు సైతం వివిధ దేశాల్లో ప్రతిఘటన ఎదురవుతోందని, చైనా లక్ష్యాలకు ఇది అవరోధంగా మారిందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని